Visakhapatnam News: విశాఖ ఉక్కు కర్మాగారం ఉద్యోగులు ప్రైవేటీకరణకు నిరసనగా చేస్తున్న దీక్ష శిబిరాన్ని సందర్శించి ఏపీపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా వారికి పూర్తి మద్దతు పలుకుతూ విశాఖ ఉక్కు - ఆంధ్రుల హక్కు అంటూ నినాదాలు చేశారు. దేశంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నంత వరకు విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటు పరం కాదని ఆమె అన్నారు. అందుకు కాంగ్రెస్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోబోదని అన్నారు. తాను రాహుల్ గాంధీని విశాఖకు తీసుకు వస్తానని.. ఆయనతో కూడా మాట ఇప్పిస్తానని అన్నారు. కాంగ్రెస్ పార్టీ తన మ్యానిఫెస్టోలో కూడా ఈ అంశాన్ని చేర్చబోతోందని షర్మిల అన్నారు. ప్రైవేటీకరణపై పోరాటాన్ని కాంగ్రెస్ పార్టీ తరపున ఉదృతం చేస్తామని అన్నారు. ప్రైవేటీకరణ వల్ల నష్టపోకుండా 30 వేల కుటుంబాల పక్షాన కొట్లడుతామని షర్మిల అన్నారు.


విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రాజెక్ట్ నిలదొక్కుకునేందుకు ఇనుప ఖనిజం (ఐరన్ ఓర్) ఇప్పించేందుకు కృషి చేస్తాం. ఉద్యోగాలు రాని 8 వేల మంది నిర్వాసితులకు ఉద్యోగాలు ఇప్పించేలా పోరాటం చేస్తాం. సపోర్ట్ సిస్టంగా కాంగ్రెస్ పార్టీ నిలబడుతుంది. విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ చేసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలని అనుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీ హయాంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విశాఖ స్టీల్ లాభాల్లో ఉంది. మూడు మిలియన్ టన్నులు ఉన్న ఉత్పత్తిని 7 మిలియన్ టన్నుల ఉత్పత్తికి పెంచారు. ఐరన్ ఓర్ ఇవ్వకుండా విశాఖ స్టీల్ ఫ్యాక్టరీకి కాళ్ళు చేతులు విరిచేశారు. 


నష్టాల పేరు చెప్పి ప్రైవేటీకరణ చేయాలని చూస్తున్నారు. కష్టం వస్తే ప్రభుత్వానికి చెప్పుకుంటారు. ఇక్కడ ప్రభుత్వమే పెద్ద దొంగ. ఇక్కడ ఉన్న జింక్ ఫ్యాక్టరీని వేదాంతకి ఇచ్చారు. జింక్ ఫ్యాక్టరీ కాస్త రియల్ ఎస్టేట్ అయింది’’ అని షర్మిల ఆరోపించారు.


ఇందిరమ్మ హయాంలో ఏర్పడిన విశాఖ స్టీల్ ను అమ్మే ప్రయత్నం చేస్తున్నారని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే దీన్ని కాపాడుతుందని స్పష్టం చేశారు. వైఎస్సార్ హయాంలో మూడు మిలియన్ టన్నుల ఉత్పత్తి సామర్థ్యం కలిగిన స్టీల్ ప్లాంట్ ను ఏడు మిలియన్ టన్నుల ఉత్పత్తి కి పెంచారని వెల్లడించారు. నష్టాల సాకు చూపి ప్రైవేటీకరణ చేయాలని చూస్తున్నారని, ఇది తగదన్నారు. విశాఖకి రైల్వే జోన్ , ఉత్తరాంధ్రకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వలేదని, బిజెపి రాష్ట్రాన్ని ప్రజలను మోసం చేస్తుందని విమర్శించారు.రాష్ట్రంలో, కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావాలని, అధికారంలోకి వచ్చిన వెంటనే విభజన హామీలను అమలు చేయడంతో పాటు స్టీల్ ప్లాంట్ ను పరిరక్షిస్తామని స్పష్టం చేశారు. బీజేపీకి తొత్తులుగా ఉన్న వైసీపీ, టీడీపీ లను ఓడగొట్టాలని, అంతవరకు క్యాడర్ అంకితభావంతో పనిచేయాలని పిలుపునిచ్చారు.