BJP Leaders Letter to CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డికి (CM Revanth Reddy) కేంద్ర మంత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి (Kishan Reddy) బుధవారం లేఖ రాశారు. కేంద్ర ప్రభుత్వ 'భారతమాల' పథకంలో భాగంగా.. తెలంగాణలో నిర్మించనున్న వివిధ జాతీయ రహదారులకు సంబంధించి భూ సేకరణ ప్రక్రియ త్వరగా పూర్తి చేయాలని ఆయన లేఖలో కోరారు. అలాగే, రీజనల్ రింగ్ రోడ్డు (RRR) భూ సేకరణ కోసం NHAIకు 50 శాతం నిధులను జమ చేయాలని సీఎంకు విజ్ఞప్తి చేశారు. గతంలో ఇవే అంశాలకు సంబంధించి బీఆర్ఎస్ ప్రభుత్వానికి లేఖలు రాసినా స్పందించలేదని అన్నారు. ఇప్పటికైనా ప్రాజెక్టులు ఆలస్యం కాకుండా చర్యలు తీసుకోవాలని కోరారు.
మార్గం సుగమం
అటు, హైదరాబాద్ రీజినల్ రింగ్ రోడ్డు (ఆర్ఆర్ఆర్)లో నిరంతరాయ భూ పరిహారం పంపిణీకి మార్గం సుగమమైంది. ఇందుకు వీలుగా ఆ మార్గంలో అడ్డుగా ఉన్న విద్యుత్ టవర్లు, స్తంభాలు, కాలువల మళ్లింపు వంటి వాటి కోసం రూ.364 కోట్ల మొత్తాన్ని డిపాజిట్ చేసేందుకు డిపాజిట్ చేసేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం NHAIకు లేఖ ఇచ్చింది.
బండి సంజయ్ లేఖ
మరోవైపు, కరీంనగర్ ఎంపీ, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ సైతం సీఎం రేవంత్ రెడ్డికి బుధవారం బహిరంగ లేఖ రాశారు. సర్పంచుల పెండింగ్ బిల్లుల విడుదలకు వెంటనే ఉత్తర్వులు ఇవ్వాలని లేఖలో విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 50 రోజులు కావస్తున్నా.. సర్పంచుల పెండింగ్ బిల్లులపై సారించకపోవడం శోచనీయమని అన్నారు. సర్పంచులు తమ సొంత నిధులతో గ్రామాల్లో అభివృద్ధి పనులు చేపట్టారని.. ప్రభుత్వం నుంచి డబ్బులు రాక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. పెండింగ్ బిల్లులపై ఇప్పటివరకూ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో స్థానిక సంస్థల ప్రతినిధులు, సర్పంచులు ఆందోళన చెందుతున్నారని లేఖలో ప్రస్తావించారు. వారి సమస్యలను దృష్టిలో ఉంచుకుని.. పనులకు సంబంధించి రూ.1,850 కోట్ల పెండింగ్ బిల్లులను వెంటనే మంజూరు చేయాలని కోరారు. ప్రభుత్వం వెంటనే సర్పంచుల సంఘం ప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేయాలని అన్నారు.
'నిధులు దారి మళ్లించారు'
కేంద్ర ప్రభుత్వం గ్రామాలకు కేటాయించిన నిధులను గత బీఆర్ఎస్ హయాంలో దారి మళ్లించారని బండి సంజయ్ ఆరోపించారు. దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా పెండింగ్ బిల్లుల కారణంగా సర్పంచులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని ఆయన గుర్తు చేశారు. గ్రామాభివృద్ధి కోసం చేసిన పనులను కూడా ప్రభుత్వ అధికారులు రికార్డు చేయకుండా సర్పంచులను ఇబ్బంది పెడుతున్నారని.. వాటిని వెంటనే రికార్డు చేసేలా చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో చెప్పిన విధంగా సర్పంచులు సహా స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులకు గౌరవ వేతనం పెంచాలని అన్నారు. అలాగే, మాజీ సర్పంచులు, ఇతర స్థానిక సంస్థల ప్రతినిధులకు పెన్షన్ మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు.
Also Read: CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డి భద్రతపై ఫోకస్ - ఇంటెలిజెన్స్ కీలక నిర్ణయం