గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల పనితీరుపై ముఖ్యమంత్రి జగన్ తీవ్ర అసంతప్తిగా ఉన్న సూచనలు కనిపిస్తున్నాయి. పని చేయని వారందరికీ నోటీసులు జారీ చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు. ఉద్యోగులకు మెమోలు జారీ చేయడం బాధాకరం అయినా ప్రజలకు సరైన సేవలు అందించకపోతే ఉపేక్షించలేమన్నారు. ఈ వ్యవస్థలను పర్యవేక్షిస్తున్న జాయింట్ కలెక్టర్లు కూడా.. వారి పనితీరుకు బాధ్యత వహించాలని ఆయన స్పష్టం చేశారు. స్పందన కార్యక్రమంపై కలెక్టర్లు ఉన్నతాధికారులతో సీఎం జగన్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ పథకాల విషయంలో ప్రజల నుంచి అనేక ఫిర్యాదులు వస్తున్నట్లుగా గుర్తించడంతో.. సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. 


ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు .. ఇంటి వద్దకే సేవలు అందించేందుకు గ్రామ, వార్డు సచివాలయాలు ఏర్పాటు చేసినా ఇంత పెద్ద ఎత్తున ఫిర్యాదులు రావడం ఏమిటని ఆయన భావన.  గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు సరిగ్గా పని చేయకపోవడం వల్లనే ఈ సమస్య వచ్చిందని ఆయన నమ్మకానికి వచ్చారు. వాటిపై పర్యవేక్షణ కూడా తక్కువగా ఉంటుందని భావిస్తున్నారు. అందుకే అధికారులు ఎప్పటికప్పుడు గ్రామ, వార్డు సచివాలాయలను తనిఖీ చేయాలని ఆదేశించారు. గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థ మెరుగుపడాలంటే ఎప్పటికప్పుడూ తనిఖీ చేస్తుండాలని .... వారానికి రెండు సార్లు కలెక్టర్లు, నాలుగుసార్లు జాయింట్‌ కలెక్టర్లు, మున్సిపల్‌ కమిషనర్లు, ఐటీడీఏ పీఓలు, తనిఖీ చేయాలన్నారు. 


 సబ్‌ కలెక్టర్లు కూడా వారానికి నాలుగుసార్లు సచివాలయాలను సందర్శించి వాటి పనితీరును పర్యవేక్షించాలని ఆదేశించారు.  తనిఖీలు చేయని అధికారులకు కూడా నోటీసులు ఇవ్వాలని ...అటు జేసీలకు కూడా మెమోలు జారీ చేయాలని ఆదేశించారు. త్వరలో  జిల్లాల పర్యటనలు ప్రారంభించబోతున్న సీఎం జగన్.. తాను కూడా..  గ్రామ, వార్డు సచివాలయాలను తనిఖీ చేయాలని నిర్ణయించుకున్నారు.  గ్రామ, వార్డు సచివాలాయాల్లోని ఉద్యోగులు ప్రస్తుతం పరీక్షల టెన్షన్‌లో ఉన్నారు. పరీక్షల్లో పాసయిన వారినే పర్మినెంట్ చేస్తామని...  చెబుతున్నారు. ఇప్పుడు.. వారి పనితీరుపైనా ప్రధానంగా ఉన్నతాధికారులంతా దృష్టి పెట్టే అవకాశం కనిపిస్తూండటంతో వారికి మరింత పని ఒత్తిడి పెరగనుంది. 


ప్రభుత్వ పథకాల విషయంలో కలెక్టర్లు మరింత అప్రమత్తంగా ఉండాలని జగన్ ఆదేశించారు. సంక్షేమ క్యాలెండర్ ప్రకారం ఆగష్టు 10వ తేదీన నేతన్న నేస్తం, ఆగష్టు 16న విద్యాకానుక, రూ. 20 వేలలోపు డిపాజిట్‌ చేసిన అగ్రిగోల్డ్‌ బాధితులకు ఆగష్టు 24న డబ్బు జమ, ఎంఎస్‌ఎంఈలకు, స్పిన్నింగ్‌మిల్స్‌కు ఆగష్టు 27న ఇన్సెంటివ్‌లు ఇస్తారు. కలెక్టర్లు ఇందుకు తగ్గ ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. 


ALSO READ: ఎన్టీఆర్ VS రాజమౌళి.. నువ్వా నేనా 'సై'!