Yemen to execute Indian nurse :  యెమెన్ దేశంలో ఉరిశిక్షకు గురి అయిన భారతీయ నర్సు నిమిష ప్రియను కాపాడేందదుకు అత్యున్నత స్థాయిలో జరుగుతున్న ప్రయత్నాలు విఫలమవుతున్నాయి. నిమిషా ప్రియను జూలై 16న ఉరితీసేందుకు ఏర్పాట్లు చేసినట్లుగా తెలుస్తోంది. కేరళలోని పాలక్కాడ్ జిల్లాకు చెందిన 37 ఏళ్ల నర్స్ నిమిషా ప్రియ 2017లో యెమెన్‌కు చెందిన తలాల్ అబ్దో మెహదీ అనే వ్యక్తిని హత్య చేసిన కేసులో ఉరిశిక్షకు గురయ్యారు. 

నిమిషా ప్రియ 2011లో  యెమెన్‌లో నర్సుగా పనిచేయడానికి వెళ్లింది.  2014లో  భర్త, కూతురుతో కలిసి యెమెన్‌లో అంతర్యుద్ధం కారణంగా భారతదేశానికి తిరిగి వచ్చారు. కానీ నిమిషా మాత్రం  యెమన్‌లోనే ఉండిపోయారు. అక్కడ ఉద్యోగం మానేసి వ్యాపారం చేశారు. యెమెన్‌లో విదేశీయులు వ్యాపారం చేయడానికి స్థానిక భాగస్వామి అవసరం కావడంతో, నిమిషా తలాల్ అబ్దో మెహదీ అనే యెమెనీ వ్యక్తితో కలిసి ఒక మెడికల్ క్లినిక్‌ను ప్రారంభించింది.

వ్యాపార భాగస్తుడిగా ఉన్న తలాల్.. నిమిషాను  శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా దోపిడీ చేశాడని, ఆమె పాస్‌పోర్ట్‌ను జప్తు చేశాడని, మాదక ద్రవ్యాలు ఇచ్చి బెదిరింపులతో ఆమెను యెమెన్‌లోనే ఉంచాడన్న ఆరోపణలు వచ్చాయి.  స్థానిక అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ, ఆమెకు సహాయం అందలేదు. తనకు ఎదురవుతున్న వేధింపులను ఎదుర్కొనేందుకు తన పాస్‌పోర్ట్‌ను తిరిగి పొందేందుకు, నిమిషా తలాల్‌కు సెడిటివ్‌లు ఇంజెక్ట్ చేసింది. కానీ, డోస్ అధికంగా ఉండడంతో అతను మరణించాడు. భయంతో, నిమిషా , ఆమె యెమెనీ సహాయకుడు హనన్‌తో కలిసి తలాల్ శరీరాన్ని ముక్కలుగా చేసి, నీటి ట్యాంక్‌లో పడవేశారు. 2017లో నిమిషాను అరెస్ట్ చేశారు, 2018 జూన్‌లో హత్య నేరంలో దోషిగా నిర్ధారించారు,  2020లో సనా ట్రయల్ కోర్టు ఆమెకు మరణశిక్ష విధించింది. ఆమె అప్పీళ్లు తిరస్కరణకు గురయ్యాయి.  2023లో హౌతీ నియంత్రణలోని సుప్రీం జ్యుడీషియల్ కౌన్సిల్ ఈ శిక్షను సమర్థించింది.  

ఇస్లామిక్ చట్టం ప్రకారం, బాధిత కుటుంబం "దియత్"  స్వీకరించి క్షమాపణ ఇస్తే మరణశిక్షను రద్దు చేయవచ్చు.  తలాల్ కుటుంబం దియత్ ఆఫర్‌కు స్పందించలేదు.   భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ 2018 నుంచి ఈ కేసును పరిశీలిస్తోంది. యెమెన్ అధికారులు ,  నిమిషా కుటుంబంతో సంప్రదింపులు జరుపుతూ "సాధ్యమైన అన్ని సహాయాలను" అందిస్తోంది.  సనాలోని హౌతీలతో  భారతదేశానికి అధికారిక దౌత్య సంబంధాలు లేకపోవడంతో సహాయం సంక్లిష్టంగా మారింది. 

యెమెన్ అధికారులు జూలై 16, 2025న సనాలో హౌతీ నియంత్రణలోని ప్రాంతంలో నిమిషాను ఉరితీయాలని ఆదేశాలు జారీ చేసినట్లు నివేదికలు సూచిస్తున్నాయి. భారత ప్రభుత్వం,  సేవ్ నిమిషా ప్రియ ఇంటర్నేషనల్ యాక్షన్ కౌన్సిల్ దౌత్యపరమైన మార్గాల ద్వారా ,  బ్లడ్ మనీ చర్చల ద్వారా ఉరిశిక్షను ఆపేందుకు చివరి ప్రయత్నాలు చేస్తున్నాయి.  హౌతీలతో దౌత్య సంబంధాలు లేకపోవడం,  తలాల్ కుటుంబంతో చర్చలు స్తంభించడం సవాళ్లుగా ఉన్నాయి. రక్షించడం కష్టంగా మారిందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.