Upcoming Kinetic Electric Scooter: మీరు 80s కిడ్స్‌ అయితే మీకు కైనెటిక్‌ స్కూటర్లు గుర్తుండే ఉంటాయి. ఒకప్పుడు మార్కెట్‌లో మంట పుట్టించిన, అప్పటి కాలానికి అత్యాధునిక రూపంతో కుర్రకారు మనసు దోచుకున్న స్కూటర్‌ ఇది. ఆ తర్వాత, వివిధ కారణాల వల్ల మార్కెట్‌ నుంచి క్రమంగా కనుమరుగైంది. ఇప్పుడు, కైనెటిక్ గ్రూప్ కొత్త ఫ్యామిలీ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తుండటంతో, కైనెటిక్‌ పేరు మళ్లీ వినిపిస్తోంది. పునరాగమనం చేస్తున్న ఈ బండి గురించి తెలుసుకోవడానికి చాలామంది ఆసక్తి చూపిస్తున్నారు. 

Hero Vida, TVS iQube, Bajaj Chetak & Ola S1 వంటి స్కూటర్‌లకు పోటీగా కైనెటిక్‌ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ను ప్రత్యేకంగా డిజైన్‌ చేశారు. ఈ ప్రాజెక్ట్‌ను కైనెటిక్ కొత్త ఎలక్ట్రిక్ వాహనాల యూనిట్ - కైనెటిక్ వాట్స్ & వోల్ట్స్ లిమిటెడ్ ఆధ్వర్యంలో తయారు చేస్తున్నారు. ప్రస్తుతం, ఈ స్కూటర్‌ను పుణెలో టెస్ట్‌ చేస్తున్నారు.

డిజైన్ ఎలా ఉంది?కైనెటిక్ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ పాత కైనెటిక్ హోండా ZX లాగానే కనిపిస్తుంది. రెట్రో స్టైల్ & మోడర్న్‌ ఫీచర్లతో తయారైంది. ముందు భాగంలో చదరపు ఆకారపు LED హెడ్‌ల్యాంప్‌ ఇచ్చారు. ఇది ఈ బండికి క్లాసిక్ & ఆధునిక రూపాన్ని ఆపాదిస్తోంది. చిన్న విండ్‌షీల్డ్ & ఫాక్స్ ఫ్లైస్క్రీన్‌ను కూడా జత చేశారు, ఇది ఈ స్కూటర్‌కు కొద్దిగా స్పోర్టీ లుక్‌ను కూడా ఇస్తోంది.

ఈ స్కూటర్‌లో పెద్ద & స్ట్రెయిట్ ఫ్లోర్‌బోర్డ్‌ ఉంది & కుటుంబ అవసరాల కోసం ఇలా తయారు చేశారని ఈ బాక్సీ డిజైన్ చూపిస్తుంది. ఈ టూవీలర్‌కు సింగిల్ గ్రాబ్ రైల్ & ముందు భాగంలో టెలిస్కోపిక్ సస్పెన్షన్ ఉంది, ఇది రైడ్‌ను సౌకర్యవంతంగా చేస్తుంది. టెస్టింగ్‌ టైమ్‌లో.. దీర్ఘచతురస్రాకార హెడ్‌లైట్లు, 3-స్పోక్ అల్లాయ్ వీల్స్ & ఫ్రంట్ డిస్క్ బ్రేక్‌ కూడా కనిపించాయి. దీని పరిమాణం & రూపం TVS iQube, Ola S1 & Bajaj Chetak వంటి స్కూటర్‌ల మాదిరిగానే ఉంటుంది. అంటే, Kinetic ఈ ప్రసిద్ధ ఎలక్ట్రిక్ స్కూటర్‌లతో నేరుగా పోటీ పడటానికి సిద్ధమవుతోందని స్పష్టం అవుతోంది.

పవర్‌ & పెర్ఫార్మెన్స్‌పవర్‌ & పెర్ఫార్మెన్స్‌ విషయాని వస్తే... దీనికి హబ్-మౌంటెడ్ మోటార్‌ ఉండే అవకాశం ఉంది, ఇది సరళమైన & తక్కువ ధర EV డ్రైవ్‌ట్రెయిన్‌లో భాగం అవుతుంది. మెరుగైన స్థిరత్వం కోసం డ్యూయల్ టెలిస్కోపిక్ ఫ్రంట్ సస్పెన్షన్ & డ్యూయల్ రియర్ షాక్ అబ్జార్బర్‌లు అందిస్తున్నారు. దీనికి మిడ్‌ సైజ్‌ బ్యాటరీ ఉండవచ్చు, ఇది 100 నుంచి 120 కి.మీ. రేంజ్‌ ఇచ్చే అవకాశం ఉంది. అయితే, ఈ విషయం ఇంకా అధికారికంగా తెలియలేదు.

ప్రొడక్షన్‌ & లాంచింగ్‌ టైమ్‌కైనెటిక్‌ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ను మహారాష్ట్రలోని అహల్యా నగర్‌లో ఉన్న కైనెటిక్ కొత్త EV యూనిట్ 'వాట్స్ & వోల్ట్స్ లిమిటెడ్' తయారీ ప్లాంట్‌లో ఉత్పత్తి చేసే అవకాశం ఉంది. కంపెనీ, కైనెటిక్ గ్రీన్ బ్రాండింగ్ కింద దీనిని మార్కెట్లోకి విడుదల చేస్తుంది. ఈ స్కూటర్ 2025 చివరి త్రైమాసికంలో లేదా 2026 ప్రారంభంలో భారత మార్కెట్‌లోకి వస్తుందని భావిస్తున్నారు.