పాట్నా: ఓ ఇండిగో విమానం బుధవారం ఉదయం అత్యవసరంగా ల్యాండింగ్ అయింది. పట్నా నుంచి ఢిల్లీకి బయలుదేరిన విమానం టేకాఫ్ అయిన కాసేపటికే పక్షిని ఢీకొట్టింది. దాంతో టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఇండిగో విమానం పాట్నాకు తిరిగి వచ్చింది. IGO5009 విమానం దాదాపు 175 మంది ప్రయాణికులతో ఢిల్లీకి బయలుదేరింది. కానీ టేకాఫ్ అయిన కాసేపటికే పక్షి ఢీకొనడంతో ముందు జాగ్రత్త చర్యగా అత్యవసర పరిస్థితిని ప్రకటించి జయప్రకాష్ నారాయణ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో పైలట్ ఇండిగో విమానాన్ని సురక్షితంగా ల్యాండ్ చేశారు.
విమానాశ్రయ అధికారులు విడుదల చేసిన ప్రకటన ప్రకారం, బుధవారం ఉదయం 8:42 గంటలకు విమానం బయలుదేరిన కొద్దిసేపటికే ఈ ఘటన జరిగింది. "పాట్నా నుండి ఢిల్లీకి వెళ్తున్న IGO5009 విమానం 0842 సమయానికి టేకాఫ్ అయిన ఇండిగో కొంత సమయానికే పక్షిని ఢీకొట్టింది. చెక్ చేయగా రన్‌వేపై ఒక చనిపోయిన పక్షి భాగాలు కనిపించాయి. అదే విషయాన్ని అప్రోచ్ కంట్రోల్ యూనిట్ ద్వారా విమానానికి తెలియజేశారు. ఒక ఇంజిన్‌లో వైబ్రేషన్ కారణంగా విమానం పాట్నాకు తిరిగి రావాలని అప్రోచ్ కంట్రోల్ యూనిట్ నుండి మెస్సేజ్ చేశారు. లోకల్ స్టాండ్-బై ప్రకటించారు. విమానం రన్‌వే 7లో 0903 ISTకి సురక్షితంగా ల్యాండ్ అయింది. ప్రయాణికులు, సిబ్బంది సురక్షితంగా ఉన్నారు" అని విమానాశ్రయం ఓ ప్రకటనలో తెలిపింది.
ఆ ఇండిగో విమానాన్ని అధికారులు తనిఖీ చేస్తున్నారు. ప్రయాణికులు వారి గమ్యస్థానాలకు చేర్చడానికి ఇండిగో ఎయిర్ లైన్స్ ప్రత్యామ్నాయ ప్రయాణ ఏర్పాట్లు చేస్తోందని అధికారులు తెలిపారు.
ఇటీవల వరుస ఘటనలు
పక్షి ఢీకొట్టడంతో విమానాలు ఎమర్జెన్సీగా ల్యాండ్ చేయడం ఇదే తొలిసారి కాదు. తరచుగా ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయి. కొన్ని రోజుల కిందట పాట్నా ఎయిర్ పోర్ట్ నుండి రాంచీకి వెళ్తున్న మరో ఇండిగో విమానం గాలిలో ఉండగా ఒక డేగను ఢీకొనడంతో అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు. విమానం 3,000 నుంచి 4,000 అడుగుల ఎత్తులో ఉండగా 10 నుండి 12 నాటికల్ మైళ్ల దూరంలో పక్షి ఢీకొట్టింది. ఆ విమానం రాంచీకి చేరుకున్నాక అటు నుంచి కోల్‌కతాకు వెళ్లాల్సి ఉంది.
“రాంచీ సమీపంలో ఇండిగో విమానం ఓ పక్షిని ఢీకొట్టింది. ఇండిగో విమానం పాట్నా నుండి రాంచీకి వెళ్తుండగా ఇది జరిగింది. అయితే పైలట్ సురక్షితంగా ల్యాండింగ్ చేయడంతో ప్రమాదం తప్పింది” అని రాంచీలోని బిర్సా ముండా విమానాశ్రయం డైరెక్టర్ ఆర్ ఆర్ మౌర్య అన్నారు.
ఎయిరిండియా విమానాన్ని ఢీకొన్న పక్షి
జూన్ 23న ఢిల్లీ నుండి వచ్చిన విమానం ల్యాండింగ్ అవుతున్న సమయంలో పక్షిని ఢీకొట్టింది. దాంతో తిరువనంతపురం-ఢిల్లీ విమానాన్ని ఎయిర్ ఇండియా రద్దు చేసింది. ఢిల్లీ నుండి తిరువనంతపురానికి వెళ్తున్న AI2454 విమానం ల్యాండింగ్ సమయంలో పక్షిని ఢీకొట్టిందని అధికారులు భావించారు. ఆ కారణంతో విమానం AI2455ని ముందు జాగ్రత్త చర్యగా తర్వాత సర్వీసును ఎయిర్ లైన్స్ రద్దు చేసింది. భారత్ లో తరచుగా ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. టెక్నికల్ కారణాలతో ప్రమాదాలు జరిగాయి. కానీ పక్షులు ఢీకొనడంతో ప్రమాదాలు జరగిన ఘటన చాలా అరుదు.