YCP Rebel Candidate Contesting From Kuppam in Coming Assembly Elections: కుప్పం.. టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) సొంత నియోజకవర్గమైన ఈ ప్రాంతానిది ఏపీ రాజకీయాల్లో ప్రత్యేక స్థానం. దీనిపై ఈసారి వైసీపీ కూడా ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది. సీఎం జగన్ (CM Jagan) 'వై నాట్ 175' నినాదంతో ముందుకెళ్తున్నారు. అందుకు అనుగుణంగా మంత్రులు, నేతలు, పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేస్తున్నారు. అయితే, తాజాగా, కుప్పంలో (Kuappam) అధికార, ప్రతిపక్ష పార్టీలకు ఓ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ షాకిచ్చారు. రాబోయే ఎన్నికల్లో కుప్పం వైసీపీలో రెబల్ అభ్యర్థిగా (YCP Rebel Candidate) పోటీ చేస్తానంటూ ముందుకొచ్చారు నీలిమా జగదీష్ (Neelima Jagadeesh). ప్రచారం సైతం మొదలుపెట్టి నియోజకవర్గంలో ప్రజలతో మమేకమవుతున్నారు.


ఎవరీ నీలిమ.?


అధికార వైసీపీకి చెందిన మొరసనపల్లె సర్పంచ్ జగదీష్ భార్య నీలిమ. కుప్పం అసెంబ్లీ స్థానంలో ఒక్క మహిళ కూడా ఎమ్మెల్యేగా స్థానం కల్పింలేదని, స్థానికంగా ప్రజలకు అందుబాటులో ఉండి, ప్రజలకు సేవ చేయడానికే ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నానని నీలిమ స్పష్టం చేస్తున్నారు. అధికార, ప్రతిపక్ష పార్టీలపై విమర్శలు చేస్తూ పోటీకి సై అంటూ ముందుకొచ్చారు. ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నారు. ఎన్నికల్లో తనకు ఓటు వేసి గెలిపిస్తే సమస్యలు పరిష్కరిస్తానని హామీ ఇస్తున్నారు. చంద్రబాబు పర్యటన నేపథ్యంలో ఇక్కడ నీలిమ ప్రచారం సర్వత్రా చర్చనీయాంశమైంది. మరోవైపు, కుప్పంలో రాబోయే ఎన్నికల్లో చంద్రబాబును ఓడించడమే లక్ష్యంగా అధికార పార్టీ ప్రత్యేక వ్యూహాలతో ముందుకెళ్తోంది. ఈ క్రమంలో ఒక్కో కులం నుంచి ఒక్కో అభ్యర్థిని రెబల్ అభ్యర్థులుగా నిలబెట్టాలని అధికార పార్టీ ప్లాన్ చేసినట్లు సమాచారం.


'సాఫ్ట్ వేర్ కంపెనీ తీసుకొస్తా'


రాబోయే ఎన్నికల్లో కుప్పం నియోజకవర్గంలో తనను గెలిపిస్తే సాఫ్ట్ వేర్ కంపెనీని తీసుకొస్తానని నీలిమ తెలిపారు. ప్రజా సేవే లక్ష్యంగా ఎన్నికల బరిలో నిలిచినట్లు చెప్పారు. కుప్పం ప్రజలను అధికార, ప్రతిపక్ష పార్టీలు ఇంకెన్నాళ్లు మోసం చేస్తారని నిలదీశారు. 14 ఏళ్లు సీఎంగా, 35 ఏళ్లు ఎమ్మెల్యేగా ఉన్న చంద్రబాబు కుప్పం ప్రజలకు ఏం చేశారని ప్రశ్నించారు.?. గత నాలుగున్నరేళ్లుగా ఎమ్మెల్సీ భరత్ కుప్పం ప్రజలకు ఏం చేశారో చెప్పాలని సవాల్ విసిరారు. ఇక్కడ ఇసుక, గ్రానైట్ దోచుకునేందుకే అధికార, ప్రతిపక్ష పార్టీల నేతలు చూస్తున్నారని, ఒక్క షర్ట్, ఫ్యాంట్ వేసుకుని వచ్చి ఈ రోజు రూ.2 వేల కోట్లు దోచుకుంటున్నారని ఆరోపించారు. అధికార పార్టీ నాయకులు కుప్పంలో అరాచకలు, దౌర్జాన్యాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇక్కడి ప్రజలు తమ కడుపు నింపుకోవడానికి పొట్ట చేతబట్టి బెంగుళూరుకు కూలీ పనులకు వెళ్తున్నారని, చంద్రబాబు హయాంలో కానీ, జగన్ హయాంలో కానీ కుప్పం ప్రజలకు న్యాయం జరగలేదని అన్నారు. కుప్పం ప్రజలు ఈసారి ఎన్నికల్లో ఆలోచించి తనకు ఎమ్మెల్యేగా ఒక అవకాశం కల్పించాలని నీలిమ కోరారు. ఇంటింటికీ వెళ్లి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుని తనను గెలిపించాలంటూ అభ్యర్థిస్తున్నారు.


Also Read: Ananthapuram News: 'అనంత' నేతలతో సీఎం జగన్ చర్చలు - ఈసారి టికెట్ ఎవరికో.?, అందరిలోనూ సర్వత్రా ఉత్కంఠ