Inter Admissions: తెలంగాణలో ఇంటర్ ప్రవేశాల్లో కార్పొరేట్ కాలేజీల మాయ మొదలైంది. ఇంకా పదోతరగతి పరీక్షల షెడ్యూలు కూడా రాకముందే.. పలు కాలేజీల్లో ఇప్పటికే 2024-25 విద్యాసంవత్సరానికి సంబంధించి ఇంటర్‌ ఫస్టియర్‌ అడ్మిషన్లు పూర్తవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ముఖ్యంగా గ్రేటర్‌ హైదరాబాద్‌లోని కార్పొరేట్‌ కాలేజీలు.. సీట్లు అయిపోతున్నాయంటూ కృత్రిమ డిమాండ్‌ను సృష్టించి సొమ్ము చేసుకొంటున్నాయి. అడ్వాన్స్‌డ్‌ బుకింగ్‌ పేరుతో సీట్లను బ్లాక్‌ చేస్తున్నాయి. 


ఇప్పుడు ప్రవేశాలు తీసుకుంటేనే ఫీజు రాయితీ ఇస్తాం.. తర్వాత ఫీజులు పెరుగుతాయంటూ తల్లిదండ్రులను, విద్యార్థులను పరుగులు పెట్టిస్తున్నాయి. ఆలస్యంగా వచ్చిన వారి నుంచి భారీగా ఫీజులు దండుకుంటున్నాయి. మంచి కాలేజీల్లో సీట్లు దొరకవేమోనన్న ఆందోళనలో తల్లిదండ్రులు కాలేజీలు చెప్పినమొత్తం చెల్లించి సీట్లు ఖరారు చేసుకుంటున్నారు. కార్పొరేట్ కాలేజీలు సాగిస్తున్న ఈ దందాను ఎలాగైనా అరికట్టాలని ఇంటర్‌బోర్డు అధికారులను తల్లిదండ్రులు కోరుతున్నారు.


వాస్తవానికి పదోతరగతి పరీక్షలు ముగిసి, ఫలితాలు వెల్లడించిన తర్వాతే ఇంటర్‌బోర్డు ప్రవేశాల నోటిఫికేషన్‌ను జారీచేస్తుంది. అప్పుడే ఇంటర్ ప్రథమ సంవత్సరంలో ప్రవేశాలు కల్పిస్తారు. కానీ కార్పొరేట్‌ కాలేజీలు ముందుగానే ప్రవేశాల ప్రక్రియను పూర్తి చేసుకుంటున్నాయి. ఇలా చేయడం నిబంధనలకు విరుద్ధం. కానీ ఇంటర్‌విద్య అధికారుల పర్యవేక్షణలోపం.. కాలేజీలను అదుపుచేసే పరిస్థితి లేకపోవడంతో ఇలా జరుగుతున్నదని తల్లిదండ్రులు వాపోతున్నారు.


ప్రస్తుత పరిస్థితి ఇలా..


➥ హైదరాబాద్‌లోని దిల్‌సుఖ్‌నగర్‌ పరిసర ప్రాంతాలు, ఉప్పల్‌లోని కొన్ని క్యాంపస్‌లలో బైపీసీ (నీట్‌)కి సీట్లు ఇప్పుటికే నిండిపోయాయి.


➥ అడ్వాన్స్‌ బుకింగ్‌ పేరిట తల్లిదండ్రుల నుంచి రూ. 3  వేల నుంచి రూ.11 వేల వరకు కార్పొరేట్ కాలేజీలు వసూలు చేస్తున్నాయి.


➥ ఇంటర్ బైపీసీతోపాటు నీట్‌ కోచింగ్‌ కోసం మియాపూర్‌‌లోని రెండు బ్రాంచీలకు వెళ్లిన ఓ అబ్బాయి తల్లిదండ్రులు సీట్లు ఖాళీ లేవని తెలుసుకొని వెనుదిరగాల్సి వచ్చింది.


➥ మాదాపూర్‌లో అన్ని కార్పొరేట్‌ క్యాంపస్‌లలో అడ్వాన్స్‌డ్‌ బుకింగ్స్‌తో సీట్లు నిండాయి.


➥ ఇక నల్లకుంట, విద్యానగర్‌ పరిసర ప్రాంతాల్లో ఎంపీసీ (జేఈఈ) శిక్షణ టాప్‌ బ్రాంచీలుగా పేరొందిన కాలేజీలను సంప్రదించినా.. సీట్లు లేవన్న సమాచారమే వినిపిస్తోంది.


➥ మరోవైపు మియాపూర్‌ పరిసర ప్రాంతాల్లోని కళాశాలల్లో జేఈఈ మెయిన్‌, అడ్వాన్స్‌డ్‌ కోచింగ్‌ బ్రాంచీల్లోనూ సీట్లు నిండిపోయినట్లు తెలుస్తోంది.


అక్రమాలకు ఆన్‌లైన్‌తో చెక్.. 
రాష్ట్రంలో ఇంటర్ కార్పొరేట్ కాలేజీలు సాగిస్తున్న ఈ అక్రమ దందాకు ఆన్‌లైన్‌ ప్రవేశ ప్రక్రియ ఒక్కటే పరిష్కారమని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఫీజుల దందాకు కూడా చెక్ పెట్టవచ్చని అంటున్నారు. ఇప్పటికే ‘దోస్త్‌’ ద్వారా డిగ్రీ కోర్సుల్లో ఆన్‌లైన్‌ అడ్మిషన్లను విజయవంతంగా చేపడుతున్నారు. ఎంసెట్‌ సహా అనేక వృత్తివిద్యాకోర్సుల్లో సీట్ల భర్తీని ఆన్‌లైన్‌ ద్వారానే నిర్వహిస్తున్నారు. ఇంటర్‌లోనూ ఇదే తరహా ప్రవేశ విధానాన్ని చేపడితే మేలని నిపుణులు సూచిస్తున్నారు.


ALSO READ:


ఇంటర్ వార్షిక పరీక్షల షెడ్యూలు ఖరారు, ఎగ్జామ్స్ ఎప్పటినుంచంటే?
తెలంగాణలో ఇంటర్ వార్షిక పరీక్షల షెడ్యూలును ప్రభుత్వం ఖరారుచేసింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 28 నుంచి మార్చి 18 వరకు ఇంటర్ పరీక్షలను నిర్వహించనున్నీరు. ఇక ఇంటర్ ప్రీ-ఫైనల్‌ పరీక్షలను జనవరిలో, ప్రాక్టికల్ పరీక్షలను ఫిబ్రవరి 1న నిర్వహించనున్నారు. ఇంటర్మీడియట్‌ బోర్డు రూపొందించిన ఈ ప్రతిపాదనలకు బుధవారం (డిసెంబరు 27) రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది.
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి...