XBB.1.16 Covid Variant:
XBB.1.16 వేరియంట్ వ్యాప్తి
దేశ రాజధాని ఢిల్లీలో మరోసారి కరోనా కేసుల కలవరం మొదలైంది. ఆ మధ్య ఉన్నట్టుండి పెరిగి తగ్గిపోయినా...ఇప్పుడు మళ్లీ అలజడి సృష్టిస్తోంది ఈ వైరస్. ముఖ్యంగా XBB.1.16 కొవిడ్ వేరియంట్ ఎక్కువగా వ్యాప్తి చెందుతున్నట్టు వైద్యులు గుర్తించారు. ప్రస్తుతం యాక్టివ్‌గా ఉన్న కేసుల్లో 48% వాటా వీటిదే. ఈ వేరియంట్‌తో పాటు మరి కొన్ని వేరియంట్‌లూ వ్యాప్తి చెందుతున్నా...ప్రభావం అయితే తక్కువగానే ఉంటోంది. ఈ నేపథ్యంలోనే కేజ్రీవాల్ అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. కొవిడ్ వ్యాప్తిని అడ్డుకునేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. జీనోమ్ సీక్వెన్సింగ్ కూడా తప్పనిసరిగా చేయాలని స్పష్టం చేశారు.
"ప్రస్తుతానికి ప్రజలెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. గత 4-5 రోజుల్లో ముగ్గురు చనిపోయారు. వాళ్లు దీర్ఘకాలిక జబ్బులతో బాధపడుతున్నారు. ఏదేమైనా అప్రమత్తంగా ఉంటాం. కొవిడ్ పాజిటివ్ వచ్చిన వాళ్ల నుంచి శాంపిల్స్ సేకరించాలి. జీనోమ్ సీక్వెన్సింగ్ చేయాలి. కొత్త వేరియంట్‌లను ముందుగానే గుర్తించడమే ప్రభుత్వం లక్ష్యం"
- అరవింద్ కేజ్రీవాల్, ఢిల్లీ సీఎం
ప్రమాదమేం లేదు..
ఢిల్లీవ్యాప్తంగా అన్ని ఆసుపత్రుల్లోనూ కొవిడ్ మాక్ డ్రిల్స్‌పైనా ఈ సమావేశంలో చర్చించారు కేజ్రీవాల్. ఇతర రాష్ట్రాలు పరిస్థితులను ఎలా కంట్రోల్ చేస్తున్నాయో గమనించాలంటూ అధికారులకు సూచించారు. ప్రస్తుతం ఇన్సకాగ్ చెబుతున్న వివరాల ప్రకారం...దేశంలో ఒక్కసారిగా కేసులు పెరగడానికి కారణం...XBB.1.16 వేరియంట్. 9 రాష్ట్రాలతో పాటు కేంద్ర పాలిత ప్రాంతాల్లోనూ ఈ వేరియంట్ వెలుగులోకి వచ్చింది. మహారాష్ట్రలో అత్యధికంగా 105, తెలంగాణలో 93, కర్ణాటకలో 61, గుజరాత్‌లో 54కేసులు నమోదయ్యాయి. ఈ వేరియంట్ వ్యాప్తి చెందుతున్నప్పటికీ...ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని AIIMS డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియా వెల్లడించారు. వైరస్ మ్యుటేషన్ అవుతున్నంత కాలం ఇలాంటి వేరియంట్‌లు వస్తూనే ఉంటాయని స్పష్టం చేశారు. XBB.1.16 వేరియంట్ ఈ ఏడాది జనవరిలో తొలిసారి బయటపడింది.
గత కొన్ని రోజులుగా కరోనా కేసుల్లో విపరీతమైన పెరుగుదల నమోదు అవుతోంది. మార్చి 30వ తేదీన నమోదు అయిన కేసులతో పోలిస్తే మార్చి 31న వెలుగు చూసిన కేసుల్లో 50 శాతం పెరుగుదల ఆందోళన కలిగిస్తోంది. మహారాష్ట్రలో కొత్తగా 694 కేసులు నమోదు అయ్యాయి. కేరళలో 765 కేసులు వెలుగు చూశాయి. మహారాష్ట్ర, కేరళ, కర్ణాటక, తమిళనాడు, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాల్లో కరోనా కేసుల్లో పెరుగుదల కనిపిస్తోంది. ఈ వారంలో సోమవారంతో పోలిస్తే మంగళవారం దేశవ్యాప్త కేసుల్లో కొంత తగ్గుదల కనిపించింది. తిరిగి బుధవారం కేసులు పెరిగాయి. గురు, శుక్రవారాల్లోనూ విపరీతమైన పెరుగుదల ప్రస్తుతం అధికారులను ఆందోళనకు గురి చేస్తోంది.కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే కరోనా కేసుల పెరుగుదలపై అన్ని రాష్ట్రాలను, కేంద్ర పాలిత ప్రాంతాలను అప్రమత్తం చేసింది. ప్రధానమంత్రి నేతృత్వంలో అత్యున్నత స్థాయి సమీక్షా సమావేశం జరిగింది. ఒమిక్రాన్ సబ్ వేరియంట్ ఎక్స్‌బీబీ 1.16 ఉద్ధృతి వల్లే కేసుల్లో పెరుగుదల కనిపిస్తోందని ఆరోగ్య శాఖ అధికారులు చెబుతున్నారు. అన్ని రాష్ట్రాల్లో కరోనా నిర్ధారణ పరీక్షలు పెరిగితే కేసులు కూడా పెరుగుతాయని అధికారులు చెబుతున్నారు.
Also Read: Delhi Liquor Policy Case: సిసోడియాకు షాక్ ఇచ్చిన కోర్టు, బెయిల్ పిటిషన్ తిరస్కరణ