Delhi Liquor Policy Case:


లిక్కర్ స్కామ్‌ కేసులో అరెస్టైన ఢిల్లీ మాజీ డిప్యుటీ సీఎం మనీశ్ సిసోడియాకు రౌస్ అవెన్యూ కోర్టు షాక్ ఇచ్చింది. ఆయన వేసిన బెయిల్ పిటిషన్‌ను కొట్టేసింది. మార్చి 24న సిసోడియా బెయిల్‌ పిటిషన్‌పై తీర్పుని రిజర్వ్‌లో ఉంచిన కోర్టు...ఇప్పుడు ఈ తీర్పునిచ్చింది. ఢిల్లీ స్పెషల్ కోర్టు పిటిషన్‌ను తిరస్కరించిన నేపథ్యంలో సిసోడియా...ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేసేందుకు సిద్దమవుతున్నారు. 





ఈ నెల 22న ఢిల్లీ మాజీ డిప్యుటీ సీఎం మనీశ్ సిసోడియా జ్యుడీషియల్ కస్టడీని మరి కొద్ది రోజుల పాటు పొడిగించింది రౌజ్ అవెన్యూ కోర్టు. ఏప్రిల్ 5వ తేదీ వరకూ కస్టడీలోనే ఉండాలని తేల్చి చెప్పింది.  ఇదే సమయంలో మనీశ్ సిసోడియా అభ్యర్థననూ పరిగణనలోకి తీసుకుంది. కస్టడీలోకి ఆధ్యాత్మిక పుస్తకాలు తీసుకెళ్లేందుకు అనుమతినివ్వాలని సిసోడియా కోరారు. దీనిపై అప్లికేషన్ పెట్టుకోవాలని కోర్టు వెల్లడించింది. రౌజ్ అవెన్యూ కోర్టులో బెయిల్ పిటిషన్ కూడా వేశారు. ఇన్నాళ్లూ దీనిపై విచారణ జరగలేదు. కస్టడీని పొడిగిస్తోందే తప్ప ఏ నిర్ణయమూ తీసుకో లేదు. మార్చి 25న ఈ పిటిషన్‌పై విచారించాల్సి ఉన్నా...ఢిల్లీ కోర్టు వాయిదా వేసింది. ఈ పిటిషన్‌పై ఈడీ వివరణను కోరింది కోర్టు. స్పెషల్ జడ్జ్ ఎమ్‌కే నాగ్‌పాల్‌ ఈ విషయమై ఈడీకి నోటీసులు ఇచ్చారు.


వాయిదా పడుతూ...


మార్చి 17న రౌజ్ అవెన్యూ కోర్టు సిసోడియా కస్టడీని ఐదు రోజుల పాటు పొడిగించింది. ఆ తరవాత మరోసారి ఆయనను కోర్టులో హాజరు పరిచింది ఈడీ. మళ్లీ విచారించిన కోర్టు...ఏప్రిల్ 5 వరకూ కస్టడీని పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. 2021 మార్చి నాటి డాక్యుమెంట్‌ల ఆధారంగా చూస్తే ఈ పాలసీలో సిసోడియాకు 5% కమీషన్‌ ఉన్నట్టు చెబుతోంది ఈడీ. అయితే 2022 సెప్టెంబర్ నాటికి అది 12%కి పెరిగిందని వివరించింది. సిసోడియా తరపు న్యాయవాది మాత్రం దర్యాప్తు సంస్థలు చెప్పిందే చెబుతున్నాయి తప్ప కొత్త ఆధారాలేవీ వెలుగులోకి తీసుకురావడం లేదని వాదిస్తున్నారు.  ఈడీ అధికారులు రోజూ గంటల పాటు ఆయనను విచారిస్తున్నారు. అటు కోర్టు కూడా ఆయన కస్టడీ గడువును పెంచుతూ పోతోంది. కీలక వివరాలు సిసోడియా చెప్పడం లేదని, విచారణకు సహకరించడం లేదని అధికారులు ఆరోపిస్తున్నారు. సిసోడియా మాత్రం తాను అన్ని ప్రశ్నలకూ సమాధానం చెబుతున్నట్టు వివరిస్తున్నారు. సౌత్‌ గ్రూప్‌ ద్వారా దినేష్ అరోరా రూ.31 కోట్ల నగదు తీసుకుని, ఆ నగదును ఆప్‌ నేతలకు చేరవేశారు. దిల్లీ మద్యం పాలసీ రూపకల్పన సమయంలో సిసోడియా 14 మొబైల్‌ ఫోన్లు మార్చారు. సీబీఐ దాడుల్లో వాటిలో రెండు ఫోన్లు స్వాధీనం చేసుకున్నారని ఈడీ తన రిపోర్టులో వెల్లడించింది. దిల్లీ లిక్కర్ పాలసీ అధికారికంగా విడుదల చేయడానికి రెండు రోజుల ముందే కవిత మాజీ ఆడిటర్ బుచ్చిబాబుకి ఆ వివరాలు చేరాయని తెలిపింది. మద్యం విధానంలో కొన్ని విషయాలను బుచ్చిబాబు ఫోన్ లో గుర్తించామని ఈడీ కోర్టుకు తెలిపింది. 


Also Read: PM Modi Degree Certificate: మోదీ ఎడ్యుకేషన్‌ గురించి అడిగిన కేజ్రీవాల్‌కు జరిమానా- ఆరాలు అనవసరమన్న గుజరాత్ హైకోర్టు