Wrestlers Protest:


జంతర్ మంతర్ వద్ద నిరసనలు 


భారత రెజ్లర్లు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఆందోళనకు దిగారు. Wrestling Federation of India (WFI) చీఫ్ బ్రిజ్ భూషన్ శరణ్ సింగ్‌ మహిళా రెజ్లర్లను లైంగిక వేధింపులకు గురి చేశాడంటూ గతంలోనూ నినదించారు. అయినా పోలీసులు పెద్దగా పట్టించుకోలేదు. పోలీసుల తీరుని నిరసిస్తూ మరోసారి నిరసన వ్యక్తం చేశారు. మళ్లీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇప్పటికీ ఇంకా FIR నమోదు కాలేదు.  ఈ నిర్లక్ష్యంపై రెజ్లర్ వినేష్ ఫోగట్ అసహనం వ్యక్తం చేశారు. ఢిల్లీ పోలీసులపై మండి పడ్డారు. వినేష్ ఫోగట్‌తో పాటు బజ్‌రంగ్ పునియా, సాక్షి మాలిక్ బ్రిజ్ భూషణ్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేశారు. జనవరిలోనూ దీనిపై నిరసనలు చేపట్టారు. ప్రభుత్వం ఈ కేసుని విచారించేందుకు ప్రత్యేకంగా ఓ ప్యానెల్‌ని నియమించింది. ఇప్పటి వరకూ ఆ రిపోర్ట్ విడుదల చేయలేదు. దీనిపైనా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 


"మహిళా రెజ్లర్లు ఇచ్చిన స్టేట్‌మెంట్ ఆధారంగా రూపొందించిన ఆ రిపోర్ట్‌ని ప్రజల ముందుంచాలి. ఇది చాలా సెన్సిటివ్ ఇష్యూ. కంప్లెయింట్ చేసిన వాళ్లలో ఓ మైనర్ కూడా ఉన్నారు"


- సాక్షి మాలిక్, రెజ్లర్ 






బజ్‌రంగ్ పునియా కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. న్యాయం జరిగేంత వరకూ తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. "బ్రిజ్ భూషణ్‌ని అరెస్ట్ చేసేంత వరకూ ఇక్కడి నుంచి కదిలే ప్రసక్తే లేదు" అని వెల్లడించారు. 


"మాకు న్యాయం జరిగేంత వరకూ మేం ఇక్కడే తింటాం. ఇక్కడే నిద్రపోతాం. మూడు నెలలుగా కేంద్ర క్రీడాశాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్‌ని కలవాలని ప్రయత్నిస్తున్నాం. కమిటీ సభ్యులు అసలు మా ఆరోపణలను పట్టించుకోవడం లేదు. అటు క్రీడాశాఖ కూడా ఇప్పటి వరకూ ఎలాంటి ప్రకటన చేయలేదు. మేం కాల్ చేసినా అటెండ్ చేయడం లేదు. దేశం కోసం మేం మెడల్స్ సాధించాం. ఎన్నో త్యాగాలు చేస్తే కానీ ఈ స్థాయికి చేరుకోలేదు"


- వినేష్ ఫోగట్, రెజ్లర్ 






జనవరి 23వ తేదీన కేంద్ర క్రీడా శాఖ ఐదుగురు సభ్యులతో ఓ కమిటీ ఏర్పాటు చేసింది. నెల రోజుల్లోగా రిపోర్ట్ చేయాలని ఆదేశించింది. ఆ తరవాత ఆ గడువును పెంచుతూ వచ్చింది. కమిటీ కేంద్రానికి రిపోర్ట్ ఇచ్చినప్పటికీ...అందులోని వివరాలేంటో పబ్లిక్‌గా చెప్పలేదు. ఢిల్లీ పోలీసులు ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిపై కేసు నమోదు చేయకపోవడాన్ని ఢిల్లీ మహిళా కమిషన్ తప్పు పట్టింది. అయితే అటు పోలీసులు మాత్రం ఇప్పటి వరకూ 7గురిపై కేసు నమోదు చేసినట్టు చెబుతున్నారు. 


Also Read: Rahul Gandhi: మా అమ్మ చేతి వంట అద్భుతం, లాలూ కూడా బాగా వండుతారు - రాహుల్ గాంధీ