Wrestlers Protest:


సుప్రీంకోర్టులో విచారణ..


బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై లైంగిక ఆరోపణలు చేస్తున్న రెజ్లర్లు సుప్రీంకోర్టుని ఆశ్రయించారు. దీనిపై ఇవాళ విచారణ జరిగింది. ఇందులో భాగంగా ఢిల్లీ పోలీసులు సుప్రీంకోర్టులో కీలక వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే బ్రిజ్ భూషణ్‌పై FIR నమోదు చేస్తామని వెల్లడించారు. ఈ మేరకు సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోర్టులో ఇదే విషయం చెప్పారు. మొత్తం ఏడుగురు రెజ్లర్లు జంతర్ మంతర్ వద్ద నిరసన చేపడుతున్నారు. ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేయడం లేదని అసహనం వ్యక్తం చేస్తున్నారు. అందుకే నేరుగా సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. ఇప్పటికే సుప్రీంకోర్టు ఢిల్లీ పోలీసులకు నోటీసులు ఇచ్చింది. ఇంత సీరియస్ మ్యాటర్‌ని అలా ఎలా వదిలేస్తున్నారంటూ చురకలు అంటించింది. ఈ కేసుని తీవ్రంగా పరిగణించాలని ఆదేశించింది. ఈ ఏడాది జనవరిలోనూ రెజ్లర్లు నిరసన వ్యక్తం చేశారు. అప్పుడు కూడా వాళ్లకు న్యాయం జరగలేదు. ఆందోళనలు ఆపేసి...మళ్లీ మూడు నెలల తరవాత ఇప్పుడు మొదలు పెట్టారు. ఈ సారి ఇది రాజకీయంగానూ ఈ అంశం వేడి పుట్టించింది. 






కమిటీ రిపోర్ట్ ఏది..? 


కేంద్ర ప్రభుత్వం గతంలో వేసిన కమిటీ ఏం చెప్పిందో బయట పెట్టాలని రెజ్లర్లు డిమాండ్ చేస్తున్నారు. బజ్‌రంగ్ పునియా, సాక్షి మాలిక్, రవి దహియా జనవరిలో తొలిసారి ఈ అంశంపై నిరసన వ్యక్తం చేశారు. బ్రిజ్ భూషణ్‌పై లైంగిక ఆరోపణలు చేశారు. అయితే...అప్పుడు కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ వాళ్లకు భరోసా ఇచ్చారు. కచ్చితంగా విచారిస్తామని చెప్పారు. కానీ ఇప్పటి వరకూ ఈ కేసులో ఎలాంటి పురోగతి లేదు. అందుకే మరోసారి దీక్షకు దిగారు రెజ్లర్లు. మేరీకోమ్ నేతృత్వంలో కేంద్రం ఓ కమిటీని నియమించింది. మొత్తం ఐదుగురు సభ్యులతో విచారణ చేయించింది. దీనిపై కమిటీ ఓ రిపోర్ట్ కూడా తయారు చేసింది. కానీ ఇంత వరకూ ఆ రిపోర్ట్‌లో ఏముందో బయట పెట్టలేదు. 


పోరాటానికి మద్దతు..


తమ పోరాటానికి మద్దతు తెలిపాలని  వినేశ్ ఫోగట్ ట్విటర్ వేదికగా  అభ్యర్థించిన నేపథ్యంలో   గోల్డెన్ బాయ్ నీరజ్ చోప్రా ట్విటర్ వేదికగా స్పందిస్తూ.. ‘న్యాయం కోరుతూ మన క్రీడాకారులు వీధుల్లోకి రావడం నాకు బాధ కలిగిస్తోంది. వాళ్లు మన దేశానికి ప్రాతినిథ్యం వహించడానికి, మనల్ని గర్వించేలా చేయడంలో   చాలా కష్టపడ్డారు. ఒక దేశంగా  ప్రతి వ్యక్తి  సమగ్రత,  గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. ఇప్పుడు జరుగుతున్నది ఇంకెప్పుడూ జరుగకూడదు.  ఇది  చాలా సున్నితమైన సమస్య.  దీనిలో విచారణ నిష్పక్షపాతంగా, పారదర్శకంగా  వ్యవహరించి  న్యాయం జరిగేలా అధికారులు వెంటనే  చర్య లు తీసుకోవాలి..’ అని  ట్వీట్ చేశాడు.


Also Read: Sudha Murty: నా కూతురి వల్లే రిషి సునాక్ ప్రధాని అయ్యారు, భర్తను అలా మార్చేసింది - సుధామూర్తి