Year Ender 2022: ఈ సంవత్సరం మరికొన్ని రోజుల్లో పూర్తి కానుంది. కొన్ని రోజుల్లో 2023 ఏడాదిలోకి అడుగు పెట్టబోతున్నాం. అయితే 2022 సంవత్సరంలో కొన్ని సెలబ్రిటీల కోర్టు కేసులు ప్రపంచాన్ని కుదిపేశాయి. విడాకుల కేసులు, పరువు నష్టం దావాలు, ఇలా పలు కేసులు ప్రపంచ వ్యాప్తంగా వార్తల్లో నిలిచాయి. అందులో పైరేట్స్ ఆఫ్ ది కరేబియన్ సిరీస్ ఫేమ్ జానీ డెప్, ఆయన మాజీ భార్య అంబర్ హెర్డ్ కేసు నుండి అమెరికన్ ర్యాపర్ కేన్ వెస్ట్ కేసులు ప్రధానంగా అందరి దృష్టిని ఆకర్షించాయి. ప్రపంచ వ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించిన ఆ కేసులు ఏంటి.. ఎందుకు అంతనా ప్రాధాన్యత సంతరించుకున్నాయో ఇప్పుడు చూద్దాం.


జానీ డెప్ - అంబర్ హెర్డ్


ఎన్నో ఏళ్ల డేటింగ్ తర్వాత హాలీవుడ్ నటులు జానీ డెప్, అంబర్ హెర్డ్ లు వివాహం చేసుకున్నారు. కానీ వీరి బంధం ఎక్కువ రోజులు నిలువలేదు. జానీ డెప్ డ్రగ్స్ కు బానిసై తనను వేధిస్తున్నాడని తనకు విడాకులు కావాలంటూ 2016లో విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నారు అంబర్ హెర్డ్. 2018లో వాషింగ్టన్ పోస్టులో వ్యాసం కూడా రాశారు. లైంగిక దాడిని ఎదుర్కొంటున్న మహిళలకు తాను ప్రతినిధిగా ఉంటానన్నారు. దీంతో జానీ డెప్ అంబర్ హెర్డ్ పై పరువు నష్టం దావా వేశారు. 50 మిలియన్ డాలర్లు చెల్లించాలని కోర్టుకు వెళ్లారు. తర్వాత అంబర్ హెర్డ్ కూడా జానీ డెప్ పై 100 మిలియన్ డాలర్లకు పరువు నష్టం దావా వేశారు. 


ఇరువురి వాదనలు విన్న కోర్టు.. ఇద్దరూ తప్పు చేశారని కానీ ఎక్కువ నష్టం జానీ డెప్ కు జరిగిందని చెబుతూ జానీ డెప్ కు అంబర్ హెర్డ్ 10 మిలియన్ డాలర్లు చెల్లించాలని తీర్పును ఇచ్చింది. అలాగే అంబర్ హెర్డ్ కు 2 మిలియన్ డాలర్లు చెల్లించాలని జానీ డెప్ ను ఆదేశించింది. కోర్టు తీర్పు అనంతరం న్యాయం గెలిచిందని, తన కొత్త శకం మొదలైందంటూ జానీ డెప్ సోషల్ మీడియాలో భావోద్వేగభరిత పోస్టు పెట్టారు. తనకు అన్యాయం జరిగిందని తనకు ఇదో ఎదురుదెబ్బ అని పేర్కొంటూ అంబర్ హెర్డ్ ట్వీట్ చేశారు.


కోట్ల రూపాయలు కోల్పోయిన కాన్యే వెస్ట్


కాన్యే వెస్ట్.. ఈ అమెరికన్ ర్యాపర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎంతో పేరు ప్రఖ్యాతలు పొంది కాన్యే వెస్ట్ 2022 సంవత్సరంలో కోట్లాది రూపాయలు, బిలియనీర్ స్టేటస్, ఎన్నో బ్రాండ్ల డీల్స్, బ్రాండ్ అంబాసిడర్ పోస్టులు ఇలా ఎన్నో కోల్పోయారు. పేరు, ప్రఖ్యాతలూ పోగొట్టుకున్నారు. కాన్యే వెస్ట్ యూధులకు సంబంధించి పలు అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆయనపై జనాలు ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. ఈ ప్రముఖ అమెరికన్ ర్యాపర్ కు వ్యతిరేకంగా ఆగ్రహావేశాలు వ్యక్తం అయ్యాయి. తాను బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్న అడిడాస్ కంపెనీకి చెందిన సబ్ బ్రాండ్ అయిన యీజీ కంపెనీ షూలకు జనాలు తగల బెట్టారు. ఈ వ్యవహారంతో కాన్యే వెస్ట్ బ్రాండ్ వాల్యూ పూర్తిగా పడిపోయింది. ఆయనతో పలు కంపెనీలు ఒప్పందాలను రద్దు చేసుకున్నాయి. మరికొన్ని కంపెనీలు కేన్ ను తమ బ్రాండ్ అంబాసిడర్ స్థానం నుండి తొలగించాయి. ఇలా కోట్లాది రూపాయలు పోగొట్టుకున్నారు.