Israel Iran War: పశ్చిమాసియాలో ఆగ్రహావేశాలు చల్లారినట్టే కనిపిస్తోంది. 24 గంటల నుంచి ఎలాంటి ఉద్రిక్తతలు చోటు చేసుకోలేదు. ఇన్ని రోజులు మూసి ఉన్న గగణతలాలు తెరుచుకుంటున్నాయి. సాధారణ ప్రయాణికుల విమానాల రాకపోకలు ప్రారంభమయ్యాయి. దీనిపై ప్రజలు కూడా స్పందిస్తున్నారు. వేల మంది ప్రజలు తమ ఆస్తులు కోల్పోయారు. అయినా శాంతి పరిస్థితి ఏర్పడినందుకు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 

మంగళవారం వేకువజామున కాల్పుల విరమణ ఒప్పందం అమలులోకి వచ్చింది. ఈ విషయాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ ప్రకటించారు. ఇలా ప్రకటించిన కాసేపటికే ఇరాన్ మరోసారి తమ దేశాన్ని టార్గెట్ చేసిందని ఇజ్రాయెల్ ఆరోపించింది. ప్రతిదాడులకు ప్లాన్ చేసింది. కానీ మరోసారి ట్రంప్ హెచ్చరించడంతో యుద్ధవిమానాలను వెనక్కి రప్పించింది. కాల్పుల విరమణ ఒప్పందం జరిగిన తర్వాత ఎలాంటి దూకుడు చర్యలు చేపట్టలేదని ఇరాన్ చెబుతోంది. 

స్వాగతించిన ప్రపంచ దేశాలు 

ఇరాన్- ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విరమణ జరగడంతో ప్రపంచ దేశాలు ఊపిరి పీల్చుకున్నాయి. ఈ నిర్ణయాన్ని రష్యా అధ్యక్షుడు పుతిన్‌తోపాటు సౌదీ అరేబియా, ఈజిప్టు సహా దేశాలన్నీ స్వాగతించాయి. దాదాపు 12 రోజుల పాటు పశ్చిమాసియాలో టెన్షన్ వాతావరణం ఏర్పడింది. ట్రంప్ జోక్యంతోనే కాల్పుల విరమణ సాధ్యమైందని ఇజ్రాయెల్‌ ప్రధాని నెతన్యాహు ప్రకటించారు. యుద్ధాన్ని ఆపేసినట్లు ఇరాన్‌ కూడా ప్రకటించింది. కానీ ఆ దేశ సుప్రీం లీడర్‌ అయతుల్లా అలీ ఖమేనీ నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు. కాల్పుల విరమణ తర్వాత కూడా ఏర్పడిన స్వల్ప ఉద్రిక్తతలపై ట్రంప్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఇరు దేశాలపై బూతులతో రెచ్చిపోయారు.

అణ్వాయుధాలపై మాటామాట

మరోవైపు శాంతి పరిస్థితులు ఏర్పడినందుకు ఇరాన్ మాత్రం అణ్వాయుధాల ప్రస్తావనే చేయొద్దని అమెరికా హెచ్చరించింది. ఇదే విషయాన్ని ట్రంప్ ప్రకటించారు. అయితే ఇరాన్ ఎప్పటికీ అణ్వాయుధాలను తయారు చేయలేదనే డోనాల్డ్ ట్రంప్ వాదనను ఇరాన్ అణుశక్తి సంస్థ (AEOI) తోసిపుచ్చింది. ఇరాన్ అణు కార్యక్రమం ఎటువంటి అడ్డంకులు లేకుండా తిరిగి ప్రారంభమవుతుందని, యురేనియం సుసంపన్నతను తిరిగి ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నామని AEOI తెలిపింది.   

ఇరు దేశాలకు నష్టం

ఈ యుద్ధ వాతావరణంతో ఇరు దేశాలు భారీగానే నష్టపోయాయి. 24 మంది ఇజ్రాయెలీలు ప్రాణాలు కోల్పోగా వెయ్యిమందికిపైగా గాయాలు పాలయ్యారు. ఆస్తినష్టం సరేసరి.  974 మంది ఇరానియన్లు మృతి చెందగా.. మూడు వేలకుపైగా ప్రజలు గాయపడ్డార.  భారీగా ఆస్తులు ధ్వంసం అయ్యాయి. వీటికి తోడు వేల మంది విదేశీయులు అక్కడి నుంచి తరలిపోయారు.  

తెరుచుకున్న గగన తలాలుఇజ్రాయెల్- ఇరాన్ మధ్య పరిస్థితులు చక్కబడటంతో చాలా దేశాలు తమ గగన తలాలను తెరుస్తున్నాయి. గల్ఫ్‌ దేశాలన్నీ మంగళవారం ఉదయానికి సాధారణ విమాన సేవలు పునరుద్ధరించాయి. ఇరాన్‌తో కాల్పుల విరమణ అమల్లోకి వచ్చిన తర్వాత, ఇజ్రాయెల్ రక్షణ దళం (IDF) కీలక నిర్ణయం తీసుకుంది.  బహిరంగ ప్రదేశాలు, పాఠశాలలు కార్యాలయాలపై విధించిన ఆంక్షలు ఎత్తివేసింది. ఇరాన్ కూడా తమ గగనతలాన్ని తిరిగి తెరిచింది. ఫ్లైట్-ట్రాకింగ్ వెబ్‌సైట్ ఫ్లైట్‌రాడార్ 24 ప్రకారం విమానాలను అనుమతిస్తున్నారు.