US News: ఇటీవల ఓ దుండగుడి కాల్పుల నుంచి తప్పించుకున్న అమెరికా మాజీ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్, తాజాగా మరోసారి అలాంటి ప్రమాదం నుంచి బయటపడిన విషయం తెలిసిందే. రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి ట్రంప్ పై తాజాగా మరో హత్యాయత్నం జరిగింది. ట్రంప్ పై  AK-47 లాంటి ఆయుధంతో కాల్పులు జరపబోయిన ఆ వ్యక్తి పేరు ర్యాన్ వెస్లీ రౌత్. 58 ఏళ్ల శ్వేతజాతీయుడిగా అతడిని FBI పేర్కొంది. ఫ్లోరిడా లోని వెస్ట్ పామ్ బీచ్ లో ట్రంప్ గోల్ఫ్ ఆడుతుండగా కాల్చి చంపాలని చూశాడు రౌత్. కానీ ఆ ప్రయత్నం ఫలించలేదు. ఈ ఘటన జరిగిన తర్వాత అతడిని FBI అరెస్ట్ చేసింది. 


ఎవరీ ర్యాన్ వెస్లీ రౌత్..?
ర్యాన్ వెస్లీ రౌత్ గురించి FBI మరింత సమాచారం సేకరించింది. అతడు నార్త్ కరోలినాకు చెందిన వాడు, అంతే కాదు సుదీర్ఘ నేర చరిత్ర కూడా ఉంది. నార్త్ కరోలినా అగ్రికల్చరల్ అండ్ టెక్నికల్ స్టేట్ యూనివర్శిటీకి చెందినవాడు అని చెబుతున్నారు. ఆ తర్వాత అతడు హవాయికి మకాం మార్చాడు. అతని సోషల్ మీడియా అకౌంట్ల ప్రకారం మిగతా వివరాలను కూడా అంచనా వేస్తున్నారు. 2002లో అతనికి పెళ్లైంది. అదే ఏడాది అతను వెపన్స్ బిజినెస్ మొదలు పెట్టాడు. 2003లో, లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ చేసిన కేసులో జైలుపాలయ్యాడు. ఆయుధాలను దాచి పెట్టిన కేసులో, హిట్ అండ్ రన్ కేసులో కూడా అతడికి శిక్ష పడింది. 2010లో దొంగతనం కేసులో కూడా రౌత్ కి శిక్ష పడింది. 


రౌత్ అనే వ్యక్తి ఉక్రెయిన్ సానుభూతిపరుడు, రష్యాపై జరుగుతున్న యుద్ధంలో ఇటీవల కైవ్ కి కూడా వెళ్లాడని.. తానే ఓ ఇంటర్యూలో చెప్పినట్టు తెలుస్తోంది. ఇటీవల న్యూయార్క్ టైమ్స్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో అతను ఉక్రెయిన్ కి మద్దతుగా మాట్లాడాడు. రష్యా దాడి తర్వాత తాను ఆ దేశానికి వెళ్లానని, అక్కడ పోరాడేందుకు ఆఫ్ఘన్ సైనికులని కూడా నియమించుకోవాలనుకున్నాని చెప్పాడు. ఇక సోషల్ మీడియాలో కూడా రౌత్ రాజకీయాల గురించి పోస్టింగ్ లు పెట్టేవాడు. 2019 నుంచి పాలిటిక్స్ లో మరింత యాక్టివ్ అయ్యాడు. డెమోక్రాట్ అభ్యర్థులకు విరాళాలు కూడా ఇచ్చేవాడు. 


ట్రంప్ పై విమర్శలు..
డెమోక్రాట్లను సమర్థించే రౌత్.. సహజంగానే ట్రంప్ పై విమర్శలు గుప్పించేవాడు. ట్విట్టర్లో కూడా ట్రంప్ ని విమర్శిస్తూ పలు పోస్టింగ్ లు పెట్టాడు రౌత్. బైడన్ ప్రెసిడెంట్ అభ్యర్థిగా ఉన్న టైమ్ లో ఆయనకు సోషల్ మీడియా ద్వారా పలు సలహాలు కూడా ఇచ్చాడు. ఇటీవల ట్రంప్ పై సెన్సిల్వేనియా ర్యాలీలో జరిగిన హత్యాయత్నం తర్వాత కూడా రౌత్ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉన్నాడు. ఆ ఘటనలో కొంతమంది సెక్యూరిటీ సిబ్బంది మరణించారు, మరికొందరు సామాన్యులు కూడా గాయపడ్డారు. మరణించిన వారి అంత్యక్రియల్లో పాల్గొనాలని రౌత్, బైడెన్ కి సూచించాడు. ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న బాధితుల్ని పరామర్శించాలని, ట్రంప్ ఆ పని ఎలాగూ చేయడు కాబట్టి.. బైడెన్ అయినా వారిని పరామర్శించాలని, తద్వారా ఎన్నికల్లో మరింత మైలేజీ వస్తుందని చెప్పాడు రౌత్. ప్రస్తుతం బైడెన్ స్థానంలో కమలా హ్యారిస్ డెమోక్రాట్ల తరపున ప్రెసిడెంట్ అభ్యర్థిగా ఉన్న విషయం తెలిసిందే.


ఇక్కడ ఇంకో విశేషం కూడా ఉంది. డొనాల్డ్ ట్రంప్ తొలిసారి అధ్యక్ష ఎన్నికల్లో పాల్గొన్నప్పుడు రౌత్ అతడికి మద్దతిచ్చాడు. ఆ తర్వాత అతని పాలన రౌత్ కి నచ్చలేదు. రెండోసారి ట్రంప్ ఎట్టి పరిస్థితుల్లోనూ అధ్యక్షుడు కాకూడదని కోరుకుంటున్నాడు రౌత్. అయితే అతను ఇంత దుస్సాహసం చేస్తాడని ఎవరూ భావించలేదు. ప్రస్తుతం FBI అధీనంలో ఉన్నాడు రౌత్. 


Also Read: డొనాల్డ్ ట్రంప్‌పై మళ్లీ కాల్పులకు యత్నం- గోల్ఫ్ కోర్స్‌ వద్ద కలకలం