పక్షి జాతుల్లో చిలకలు ఎప్పుడూ ప్రత్యేకమైనవే. ఇవి ఇతర పక్షుల్లా కాకుండా భిన్నంగా ఉంటాయి. కొంత ట్రైనింగ్ ఇస్తే మనుషుల్లా మాట్లాడటమే కాదు.. మనిషి తరహాలో తెలివి తేటల్ని కూడా ప్రదర్శిస్తాయి. అందుకే వీటిపై తరచూ పరిశోధనలు జరుగుతూనే ఉంటాయి. తాజాగా జర్మనీకి చెందిన కొంత మంది శాస్త్రవేత్తలు వీటిపై పరిశోధనలు చేసి 'కోఎవల్యూషన్ ఆఫ్ రిలేటివ్ బ్రెయిన్ సైజ్ అండ్ లైఫ్ ఎక్స్‌పెక్టెన్సీ ఇన్ ప్యారట్స్' పేరుతో పరిశోధనా పత్రాన్ని ప్రచురించారు. ఇందులో చిలుకలకు సంబంధించిన అనేక కీలకమైన విషయాలను విశ్లేషించారు. జర్మనీలో ప్రధాన కార్యాలయాన్ని కలిగి ఉన్న మాక్స్ ప్లాంక్ సొసైటీ పరిశోధకుల నేతృత్వంలోని ఈ అధ్యయనం జరిగింది.
జర్మనీ పరిశోధకులు మొత్తం 217 చిలుక జాతులను పరిశీలించారు . స్కార్లెట్ మాకా, సల్ఫర్-క్రెస్టెడ్ కాకాటూ వంటి జాతులు 30 సంవత్సరాల వరకు సగటు జీవితకాలం కలిగి ఉన్నాయని కనుగొన్నారు.చిలుకలకు విశేషమైన తెలివి తేటలు, సుదీర్ఘ జీవిత కాలం ఉంటాయి. ఇటువంటి అనూహ్యంగా సుదీర్ఘ జీవిత కాలం సాధారణంగా పెద్ద పక్షులలో మాత్రమే కనిపిస్తుంది. పెద్ద సాపేక్ష మెదడు పరిమాణం సుదీర్ఘ జీవిత కాలానికి కారణమవుతుందని పరిశోధకులు వివరించారు. చిలుకలలో మెదడు పరిమాణం, జీవిత కాలం ఆధారపడి ఉంటాయి. చిలుకలు ఎక్కువ కాలం బతకడానికి మెదడులోని చురుకుదనమే కారణం అని తాజాగా గుర్తించారు. గతంలోఈ విషయాలు వెల్లడి కాలేదు.
మ్యాక్స్ ప్లాంక్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ యానిమల్ బిహేవియర్ , మ్యాక్స్ ప్లాంక్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ ఎవల్యూషనరీ ఆంత్రోపాలజీ పరిశోధకులు మానవ సంరక్షణలో వన్యప్రాణుల ఆన్‌లైన్ డేటాబేస్‌ను నిర్వహించే అంతర్జాతీయ లాభాపేక్షలేని సంస్థ అయిన స్పీసీస్360తో జతకట్టారు. తగిన నమూనా పరిమాణాన్ని రూపొందించడానికి శాస్త్రవేత్తలు వారితో ఒప్పందం చేసుకున్నారు. 1,000 జంతుప్రదర్శనశాలల నుండి సేకరించిన 1,30,000 కంటే ఎక్కువ చిలుకల నుండి డేటాను సంకలనం చేశారు. డేటాబేస్ కారణంగా 217 చిలుక జాతుల సగటు జీవిత కాలం యొక్క మొదటి విశ్వసనీయ అంచనాలను పొందగలిగారు. వీటిలో అత్యధిక మనంకు తెలిసిన చిలుక జాతులే.
శాస్త్రవేత్తల అధ్యయనంలో చిలుకల ఆయుర్దాయంలో ఆశ్చర్యకరమైన వైవిధ్యం ఉంది, అత్తి చిలుకకు సగటున రెండు సంవత్సరాల జీవనకాలం ఉంటే స్కార్లెట్ మాకాకి సగటున 30 సంవత్సరాల వరకు ఉంటుంది. ఆస్ట్రేలియా నుండి వచ్చిన సల్ఫర్-క్రెస్టెడ్ కాకాటూ కూడా సుదీర్ఘ జీవితకాలం కలిగి ఉంది. ఇది సగటున 25 సంవత్సరాలు జీవిస్తుంది. పక్షులలో సగటున 30 ఏళ్లు జీవించడం చాలా అరుదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మనుషులు గరిష్టంగా 80 సంవత్సరాల కంటే ఎక్కువ ఆయుర్దాయం కలిగి ఉంటారు. ఒక మనిషి చిలుక కంటే 100 రెట్లు ఎక్కువ బరువు కలిగి ఉంటారు. అయినప్పటికీ చిలకులు ఎక్కవ కాలం బతుకుతున్నాయంటే నిజంగా అద్భుతమని వారంటున్నారు.
చిలుకలకు మనుషులతో సమానంగా తెలివితేటలు ఎలా వచ్చాయన్నదానిపైనా పరిశోధన చేశారు. అలాగే ఆ తెలివి తేటల వల్ల ఎక్కువ కాలం బతకుతున్నాయని కూడా గుర్తించారు. చిలుకలు పెద్ద మెదడులను కలిగి ఉండటం వలన దీర్ఘకాల జీవిత కాలం ఉంటుంది. దీనర్థం తెలివిగల పక్షులు అడవిలో సమస్యలను బాగా పరిష్కరించగలవు, తద్వారా ఎక్కువ కాలం జీవించగలవు. రెడో కారణం పెద్ద మెదడు పెరగడానికి ఎక్కువ సమయం తీసుకుంటుంది అందుకే ఎక్కువ జీవిత కాలం అవసరం. శాస్త్రవేత్తలు ప్రతి జాతికి సంబంధించిన మెదడు పరిమాణం, సగటు శరీర బరువు మరియు అభివృద్ధి వేరియబుల్స్‌పై డేటాను సేకరించారు. సాధారణంగా, పెద్ద మెదళ్లు జాతులను మరింత అనువైనవిగా చేసి వాటిని ఎక్కువ కాలం జీవించేలా చేసే ఆలోచనకు ఇది మద్దతు ఇస్తుంది.