US airstrikes on Iran's nuclear facilities: ఇరాన్ అణు కేంద్రాలపై అమెరికా వైమానిక దాడులకు పాల్పడింది. ఇరాన్​కు అత్యంత ప్రధానమైన ఫోర్డోతోపాటు నతాంజ్‌, ఇస్ఫాహన్ అణుకేంద్రాలపై  దాడులు చేసింది. అధునాత, ఖరీదైన విమానాల్లో ఒకటైన శక్తివంతమైన B-2 స్పిరిట్ స్టెల్త్ బాంబర్లతో విరుచుకుపడింది. ఈ దాడులపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్వయంగా ప్రకటించారు. ఎక్స్​లో పోస్ట్​ చేశారు. ‘భారీ బాంబులు ఫోర్డోపై వేశాం. ఇరాన్‌ గగనతలం బయట నుంచే ఈ దాడులు చేశాం. విమానాలు సురక్షితంగా తిరుగుముఖం పట్టాయి. అమెరికా యోధులకు అభినందనలు. ప్రపంచంలో మరే మిలిటరీకి ఇది సాధ్యంకాదు. ఇప్పుడు శాంతికి సమయం’’ అని పేర్కొన్నారు.

Continues below advertisement


కేవలం 21 యూనిట్లు మాత్రమే తయారీ
ఈ నేపథ్యంలోనే B-2 స్పిరిట్‌ బాంబర్లపై చర్చ సాగుతోంది. B-2 బాంబర్ విమానం అత్యంత ఖరీదైన సైనిక విమానంగా పేరుగాంచింది. దీని ధర ఏకండా దాదాపు 2.1 బిలియన్లు. నార్త్​రోప్ గ్రుమ్మన్ తయారు చేసిన ఈ బాంబర్‌ను మొదట కోల్డ్​వార్​ సమయంలో అధునాతన సోవియట్ వైమానిక రక్షణలను ఛేదించేందుకు అభివృద్ధి చేశారు. అయితే, సోవియట్ యూనియన్ పతనం తర్వాత వీటి ఉత్పత్తిని తగ్గించారు. దీంతో కేవలం 21 యూనిట్లు మాత్రమే తయారు చేశారు. చిన్న పక్షిని స్ఫూర్తిగా తీసుకొని దాని ఆకారంతో దీన్ని రూపొందించారు.


ప్రపంచంలోని ఏ ప్రదేశాన్నైనా నేరుగా ఛేదించగల సామర్థ్యం
ఇంధనం నింపకుండానే 6,000 నాటికల్ మైళ్ల (11,112 కి.మీ.) కంటే ఎక్కువ దూరం ప్రయాణించడం B-2 ప్రత్యేకత. ఖండాంతర యునైటెడ్ స్టేట్స్‌లోని స్థావరాల నుంచి ప్రపంచంలోని ఏ ప్రదేశాన్నైనా నేరుగా ఛేదించగల సామర్థ్యం దీనికుంది. ఈ విమానం కేవలం ఇద్దరు పైలట్లతోనే నడుస్తుంది. దాని స్టెల్త్ సిగ్నేచర్‌ను నిర్వహించడానికి రూపొందించిన అంతర్గత బేల నుండి 40,000 పౌండ్ల (18,144 కిలోలు) కంటే ఎక్కువ అణ్వాయుధాలను రిలీజ్​ చేయగలదు. ఇప్పుడు మిస్సౌరీ నుంచి ఆఫ్ఘనిస్తాన్, లిబియాను దాటి ఇరాన్ లోని అణు కేంద్రాలపై విజయవంతంగా దాడులు చేశాయి. 


లోతుగా పాతిపెట్టబడిన  అణు పరిశోధన బంకర్లను సైతం నాశనం చేసేలా..
శనివారం ఇరాన్‌లోని ఫోర్డో అణు కేంద్రంపై జరిగిన దాడిలో ఆరు GBU-57A/B మాసివ్ ఆర్డినెన్స్ పెనెట్రేటర్లను (MOPలు) అమెరికా ఉపయోగించింది. వీటిని ‘బంకర్ బస్టర్’ బాంబులు అని కూడా పిలుస్తారు. ప్రతి ఒక్కటి దాదాపు 30,000 పౌండ్ల బరువు ఉంటుంది. లోతుగా పాతిపెట్టబడిన  అణు పరిశోధన బంకర్లను సైతం నాశనం చేసేలా వీటిని ప్రత్యేకంగా రూపొందించారు. భారీగా ఆయుధాలను మోసుకెళ్లగల అతి కొద్ది  విమానాలలో B-2 ఒకటి. దీనికున్న స్టెల్త్ డిజైన్ కారణంగా B-2ను గుర్తించడం కూడా కష్టమే. దీంతో అది లక్ష్యాలను ఈజీగా చేరుకొని శత్రు స్థావరాలను నాశనం చేస్తుంది.