Vivek Ramaswamy supports JD Vance: అమెరికా అధ్యక్ష ఎన్నికల వేళ రిపబ్లికన్ పార్టీ తరఫున వైస్ ప్రెసిడెంట్ అభ్యర్థిగా ఎంపికైన జేడీ వాన్స్‌కు భారతీయ అమెరికన్, ప్రముఖ వ్యాపారవేత్త వివేక్ రామస్వామి మద్దతు ప్రకటించారు. జేడీ వాన్స్ ప్రస్తుతం ఓహియో సెనేటర్‌గా ఉన్నారు. అయితే, తొలుత వివేక్ రామస్వామి రిపబ్లికన్‌ పార్టీ తరఫున అభ్యర్థిత్వం కోసం ట్రంప్‌కి పోటీగా నిలిచిన సంగతి తెలిసిందే. అతి తక్కువ వయసులోనే అభ్యర్థిత్వం కోసం ఆయన ప్రయత్నించారు. అయితే, పార్టీ వర్గాల నుంచి సరైన మద్దతు లేకపోవడంతో అభ్యర్థిత్వ రేసు నుంచి రామస్వామి తప్పుకోవాల్సి వచ్చింది. 


తాజాగా వివేక్ రామస్వామి తన స్నేహితుడికి మద్దతు పలికారు. వైఎస్ ప్రెసిడెంట్ అభ్యర్థిగా జేడీ వాన్స్‌ ఎంపిక అయ్యారు. జేడీ వాన్స్‌ ఓ తెలుగు అమ్మాయిని పెళ్లి చేసుకున్న వ్యక్తి. ఆయన భార్య పేరు ఉషా చిలుకూరి. ఇలా తెలుగింటి అల్లుడైన జేడీ వాన్స్‌కు వివేక్ రామస్వామి మద్దతు తెలిపారు. జేడీ వాన్స్ - రామస్వామి ఒకప్పుడు క్లాస్ మేట్స్ కూడా. లా స్కూలులో వీళ్లిద్దరూ క్లాస్‌మేట్స్‌. ఈ సందర్భంగా ఆనాటి రోజులను రామస్వామి గుర్తు చేసుకున్నారు.


‘‘ఈ రోజు నా స్నేహితుడు, క్లాస్‌మేట్, నా తోటి సౌత్ వెస్ట్ ఒహియోన్ గురించి చాలా గర్వంగా ఉంది. మేం లా స్కూల్‌లోని బార్‌లో బెంగాల్స్ గేమ్స్ చూసేవాళ్ళం. ఒక దశాబ్దం తర్వాత జేడీ తన లైఫ్ టైంలోనే బలమైన వైస్ ప్రెసిడెన్షియల్ టిక్కెట్‌ దక్కించుకున్నారు. అతను ఇక్కడి వరకూ రావడం చాలా అద్భుతంగా ఉంది. జేడీ అత్యుత్తమ వైస్ ప్రెసిడెంట్ అవుతాడు. నేను అతని కోసం, మన దేశం కోసం ఎదురు చూస్తున్నాను’’ అని వివేక్ రామస్వామి ఎక్స్‌లో పోస్ట్ చేశారు.






‘‘నా స్నేహితుడ్ని, క్లాస్‌మేట్‌ను చూసి చాలా గర్వంగా ఉంది. ‘లా’ స్కూల్‌లో ఇద్దరం కలిసి గేమ్స్‌ ఆడుకునే వాళ్లం. ఇవాళ అతడికి అమెరికా ఉపాధ్యక్ష అభ్యర్థిత్వం దక్కడం చాలా సంతోషంగా ఉంది. కచ్చితంగా ఉపాధ్యక్షుడు అవుతాడన్న నమ్మకం కూడా ఉంది. అత్యద్భుతంగా పని చేసి.. దేశాన్ని మరింత ముందుకు తీసుకెళ్తాడని భావిస్తున్నాను’’ అంటూ ఎక్స్‌లో రాసుకొచ్చారు. పైగా జేడీ వాన్స్ భార్య ఉషా చిలుకూరి తన ఫ్యామిలీ ఫ్రెండ్ అని వివేక్ రామస్వామి ఓ టీవీ ఇంటర్వ్యూలో చెప్పారు. జేడీ వాన్స్‌కు ముగ్గురు పిల్లలు. అందులో ఒకరి పేరు వివేక్ అని కూడా రామస్వామి తెలిపారు.


అమెరికా ప్రెసిడెంట్ అభ్యర్థిగా రిపబ్లికన్ పార్టీ ప్రతినిధులంతా కలిసి డొనాల్డ్‌ ట్రంప్‌ తమ పార్టీ అభ్యర్థిగా ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. వెంటనే డొనాల్డ్ ట్రంప్.. ఉపాధ్యక్ష అభ్యర్థిగా జేడీ వాన్స్‌ పేరును ప్రకటించారు. దీంతో వారి ఇద్దరి అభ్యర్థిత్వం ఖరారు అయింది. ఇక అమెరికా అధ్యక్ష ఎన్నికలు ఈ ఏడాది నవంబరులో జరగనున్నాయి.


జేడీ వాన్స్‌ భార్య ఉషా చిలుకూరి వాన్స్‌ తెలుగు ములాలున్న వ్యక్తి. ఆమె తల్లిదండ్రులు చాలా ఏళ్ల క్రితమే ఆంధ్రా నుంచి వెళ్లిపోయి అమెరికాలో స్థిరపడ్డారు. ఉషా చిలుకూరి యేల్‌ యూనివర్సిటీ నుంచి హిస్టరీ బ్యాచిలర్‌ డిగ్రీ.. కేంబ్రిడ్జి యూనివర్సిటీ నుంచి తత్వశాస్త్రంలో మాస్టర్స్ చేశారు. న్యాయ సంబంధమైన విభాగాల్లో బాగా పని చేశారు. అమెరికా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తులు జస్టిస్‌ జాన్‌ రాబర్ట్స్‌, జస్టిస్‌ బ్రెట్‌ కెవానా వద్ద పని చేశారు.