Viral Video:
గాజాలో పౌరుల పరుగులు..
ఇజ్రాయేల్ పాలస్తీనా మధ్య యుద్ధం (Israel Palestine War) కారణంగా వేలాది మంది పౌరులు నలిగిపోతున్నారు. ఆ రెండు దేశాల పంతం వీళ్ల ప్రాణాల మీదకు తెచ్చింది. కళ్లు మూసి తెరిచేలోగా బిల్డింగ్‌లన్నీ నేలమట్టం అవుతున్నాయి. ఎక్కడో ఓ చోట కాస్త నీడ దొరికిందని తల దాచుకునే లోగా పై నుంచి రాకెట్‌లు దూసుకొచ్చి దాడులు చేస్తున్నాయి. ప్రాణాలు కాపాడుకునేందుకు పరుగులు పెడుతున్నారు. మరీ ముఖ్యంగా గాజా వద్ద పౌరుల పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఎటు చూసినా శిథిలాల దిబ్బలే, శవాల గుట్టలే కనిపిస్తున్నాయి. వీటిని చూసి మరింత జడిసిపోతున్నారు గాజా పౌరులు. సహాయం కోసం అర్థిస్తున్నారు. అక్కడి దృశ్యాలు ప్రపంచాన్నే కన్నీరు పెట్టిస్తున్నాయి. ఇలాంటి వీడియో ఒకటి వైరల్ అవుతోంది. శిథిలాల కింద చిక్కుకున్న ఓ మహిళ తనను కాపాడాలంటూ వేడుకుంది. శరీరం అంతా శిథిలాల్లోనే చిక్కుకుంది. కేవలం చేయి మాత్రమే బయటకు కనిపిస్తోంది. ఆ చేతినే ఊపుతూ సాయం చేయాలని అభ్యర్థించింది. ఆమె ఒక్కరే కాదు. అక్కడి పౌరులందరిదీ ఇదే ఘోష. ఆమె ఎంతగా వేడుకున్నా ఎవరూ పట్టించుకోలేదు. చుట్టు పక్కల ఆంబులెన్స్‌లు లేవు. కాపాడటానికి వీల్లేకుండా పోయింది. అంత పెద్ద శిథిలాల్ని తొలగించి కాపాడడం స్థానికులకూ సవాలుగా మారింది. వాటిని తొలగించేందుకు అవసరమైన ఎక్విప్‌మెంట్ కూడా వాళ్ల దగ్గర ఉండడం లేదు. హమాస్ ఉగ్రవాదులు దాక్కుని ఉన్నారన్న అనుమానం వచ్చిన ప్రతి చోటా ఇజ్రాయేల్ రాకెట్‌లతో విధ్వంసం సృష్టిస్తోంది. ఈ దాడుల్లో ఉగ్రవాదులు చనిపోతున్నారో లేదో కానీ...సామాన్యులు మాత్రం ఇలా నలిగిపోతున్నారు.