Viral video : న్యూవార్క్ లిబర్టీ అంతర్జాతీయ విమానాశ్రయంలో అమెరికా అధికారులు ఒక భారతీయ విద్యార్థిని అదుపులోకి తీసుకున్న విధానం సంచలనంగా మారుతోంది. బలవంతంగా నేలపై తొక్కిపెట్టి చేతులకు సంకెళ్లు వేసినట్లు చూపించే ఒక వీడియో తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తించింది. దీనిపై న్యూయార్క్‌లోని భారత రాయబార కార్యాలయం ఘాటుగా స్పందించింది.  

వైరల్ అయిన ఈ ఫుటేజ్ తీవ్ర భావోద్వేగాన్ని రేపింది. నలుగురు విమానాశ్రయ అధికారులు ఆ విద్యార్థిని తొక్కిపెడుతుండగా అతను ఏడుస్తున్నట్లు కనిపిస్తుంది. ఇద్దరు అధికారులు అతని వీపుపై మోకాళ్లతో కూర్చున్నారు. అతని చేతులు, కాళ్ళను కలదకుండా పట్టేశారు. ఈ క్లిప్ అనేక విమర్శలకు దారి తీస్తోంది. ఇది ఓ అమానవీయ ఘటనగా అభివర్ణించారు.

ఈ వీడియోను భారతీయ-అమెరికన్ వ్యవస్థాపకుడు కునాల్ జైన్ షేర్ చేశారు. "నిన్న రాత్రి న్యూవార్క్ విమానాశ్రయం నుంచి ఒక భారతీయ విద్యార్థిని బహిష్కరిస్తున్న ఘటన నేను చూశాను. చేతికి సంకెళ్లు వేసి, నేరస్థుడిలా వ్యవహరించారు" అని జైన్ X లో ఒక పోస్ట్‌లో రాశారు. "అతను తన కలలను సాకారం చేసుకునేందుకు ఇక్కడకు వచ్చాడు. అతను ఎవరికి ఎలాంటి హాని చేయలేదు. ఒక NRIగా నేను నిస్సహాయుడినే. చాలా బాధ కలిగింది. ఇది ఒక మానవ విషాదం." అని పేర్కొన్నారు. 

ఈ విషయంపై దర్యాప్తు చేసి విద్యార్థికి సహాయం అందించాలని భారత రాయబార కార్యాలయాన్ని జైన్ కోరారు.

చర్యలు చేపట్టిన భారత రాయబార కార్యాలయం  ఈ వీడియోపై పెరుగుతున్న అసంతృప్తిని గ్రహించిన భారత రాయబార కార్యాలయం స్పందించింది. ఈ ఘటనపై స్థానిక అమెరికా అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు న్యూయార్క్‌లోని భారత కాన్సులేట్ స్పష్టం చేసింది. 

“న్యూవార్క్ లిబర్టీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఒక భారతీయ పౌరుడు ఇబ్బందులను ఎదుర్కొన్నాడని సోషల్ మీడియా పోస్ట్‌లు చూశాము” అని కాన్సులేట్ ఒక అధికారిక ప్రకటనలో తెలిపింది. “ఈ విషయంలో మేము స్థానిక అధికారులతో సంప్రదిస్తున్నాము. భారతీయ పౌరుల సంక్షేమానికి కాన్సులేట్ ఎల్లప్పుడూ కట్టుబడి ఉంది.”అని పేర్కొంది. 

ఆ విద్యార్థి ఎవరు, బహిష్కరణకు సంబంధించిన సమాచారం తెలియడం లేదు. వీడియోలో అదను హిందీలో మాట్లాడుతున్న విషయం గమనించవచ్చు. నేను పిచ్చివాడిని కాదు; వారు నన్ను పిచ్చివాడిని చేయడానికి ప్రయత్నిస్తున్నారు, నేను పిచ్చివాడిని అని నిరూపించడానికి ప్రయత్నిస్తున్నారు.” అని ఏడుస్తూ చెబుతున్నాడు. 

భద్రతా ముప్పు అనే కోణంలో కాకుండా కమ్యూనికేషన్ ఫెయిల్యూర్‌తోనే జరిగిందనే అనుమానం వ్యక్తమవుతోంది.  "ఎంట్రీ దగ్గ ఏదో తప్పు జరిగి ఉండవచ్చు. అతను పిచ్చివాడని వారు నమ్మితే దాన్ని డీల్ చేయడానికి చాలా మార్గాలు ఉన్నాయి. అతని ఇలా అగౌరవ పరచాల్సిిన పని లేదు." అని జైన్ పోస్టులో పేర్కొన్నారు. 

గతం గుర్తు చేస్తున్న నెటిజన్లు ఈ ఘటనతో గతంలో జరిగిన విషయాలను నెటిజన్లు గుర్తు చేస్తున్నారు. ఫిబ్రవరిలో 100 మందికిపైగా భారతీయులను అమెరికా నుంచి సంకెళ్లతో పంపించారు. ఆ సమయంలో అమెరికా అధికారులు షేర్ చేసిన వీడియోలు అప్పట్లోనే సంచలనం కలిగించాయి. జైలు నుంచి తరలించే ఖైదీలు మాదిరిగా వారికి సంకెళ్లు వేశారు. వాటిపై భారత్‌ ప్రభుత్వం తీవ్ర విమర్శలు ఎదుర్కొంది. విదేశాల్లో ఉన్న పౌరులను రక్షించడానికి బలమైన దౌత్య చర్యలు తీసుకోలేదని ప్రతిపక్షాలు విమర్శించాయి.

ఇప్పుడు బహిరంగంగా మరొక భారతీయుడిని నిర్బంధించిన దృశ్యాలు మళ్లీ తెరపైకి వచ్చాయి. అమెరికా సరిహద్దులలో భారతీయ పౌరులను న్యాయంగా చూసుకుంటున్నారా? వారి హక్కులను కాపాడటానికి దౌత్యపరంగా తగినంత చర్యలు తీసుకుంటున్నారా? అనేది వేచి చూడాలి.