క్వెట్టా: పహల్గాంలో చేసిన ఉగ్రదాడితో పాక్ సొంతగా ఉచ్చు బిగించుకున్నట్లు పరిస్థితి తయారైంది. ఓవైపు భారత ప్రభుత్వం సింధు జలాల పంపకాలపై నిషేధం, పాక్ జాతీయులకు అన్ని రకాల వీసాలు రద్దు చేసి బిగ్ షాకిచ్చింది. మరోవైపు బలూచ్ లిబరేషన్ ఆర్మీ (BLA) పాకిస్తాన్ ఆర్మీకి చుక్కలు చూపిస్తోంది. పాకిస్తాన్‌లోని క్వెట్టా సమీపంలో రిమోట్ కంట్రోల్డ్ ఇంప్రూవైజ్డ్ ఎక్స్‌ప్లోజివ్ డివైస్ (IED) ద్వారా పాకిస్తాన్ ఆర్మీ కాన్వాయ్‌పై బాంబు దాడి చేసింది బలూచ్ ఆర్మీ. ఇందుకు తామే బాధ్యత వహిస్తున్నామని సైతం ప్రకటించుకుంది.

బలూచ్ లిబరేషన్ ఆర్మీ (BLA) చేసిన ఈ బాంబు దాడి మార్గట్ ప్రాంతంలో జరిగింది. ఈ దాడిలో కనీసం 10 మంది పాకిస్తాన్ సైనికులు మరణించారని బలూచ్ టీమ్ చెబుతోంది. పాకిస్తాన్ ఆర్మీ వాహనం ధ్వంసమైందని, జవాన్లు చనిపోయారని ప్రకటించింది. బలూచ్ లిబరేషన్ ఆర్మీ ఐఈడీ పేల్చివేసిన ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

క్వెట్టా సమీపంలో తాము ఐఈడీ బాంబు దాడి చేశామని బలూచ్ లిబరేషన్ ఆర్మీ ప్రతినిధి జీయంద్ శుక్రవారం ఓ ప్రకటనలో ధృవీకరించారు. ఈ ప్రాంతంలో తమను ఆక్రమిత దళాలుగా అభివర్ణించిన పాకిస్తాన్ ఆర్మీపై విజయవంతంగా ఆపరేషన్ నిర్వహించారని తెలిపారు.  బలూచిస్తాన్‌లో తమ ప్రయత్నాలు ముమ్మరం చేస్తామని, తమ చర్యలను తప్పుపడితే రియాక్షన్ ఇలాగే ఉంటుందని హెచ్చరించింది. 

గత నెలలో బలూచ్ వేర్పాటువాద గ్రూపు ఏకంగా ఓ ఎక్స్‌ప్రెస్ రైలును హైజాక్ చేయడంతో వారి ప్రాబల్యాన్ని చాటాలని చూశారు. BLA మిలిటెంట్లు బోలాన్‌లో జాఫర్ ఎక్స్‌ప్రెస్‌ రైలును హైజాక్ చేసి ఏకంగా 339 మంది ప్రయాణికులను బంధీలుగా ఉంచారు. ఈ ఘటనలో కాల్పులు, దాడులు జరగడంతో 25 మంది మరణించారు. క్వెట్టా నుండి పెషావర్ వెళ్లే రైలులో  ట్రాక్‌పై పేలుడు పదార్థాలను పేల్చివేసి రైలు నిలిచిపోయేలా చేశారు. ఆపై రైలు బోగీలు పట్టాలు తప్పడం, మొత్తానికి రైలు అక్కడికక్కడే ఆగిపోయింది. వెంటనే బలూచ్ లిబరేషన్ ఆర్మీ బలగాలు జాఫర్ ఎక్స్‌ప్రెస్ రైలులోకి ఎక్కి అందులోని ప్రయాణికులను బంధీలుగా చేసుకున్నారు.