Viral Video:
బ్రెజిల్‌లో ఘటన..
బ్రెజిల్‌లో ఓ విమానం రన్‌వేపై స్కిడ్ అయ్యి ప్రయాణికులను తెగ టెన్షన్ పెట్టింది. ఈ ప్రమాదకర ఘటన బ్రెజిల్‌లో జరిగింది. LATAM ఎయిర్‌లైన్స్‌కి చెందిన విమానం...ఫ్లోరియానోపోలిస్ హెర్సీలియో లుజ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్ అయిన సమయంలో ఒక్కసారిగా స్కిడ్ అయింది. ఓ ప్యాసింజర్ ఇదంతా వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. విమానం స్కిడ్ అయిన వెంటనే అందరూ గట్టిగా అరిచారు. ఆ సమయంలో అక్కడ భారీ వర్షం పడుతోంది. ఈ కారణంగానే ఫ్లైట్ స్కిడ్ అయిందని అధికారులు వెల్లడించారు. రన్‌వే పక్కనే ఉన్న లాన్‌లోకి దూసుకుపోయింది విమానం. ల్యాండింగ్ వీల్స్‌లో ఒకటి పేవ్‌మెంట్‌లో స్ట్రక్ అయిపోయింది. అయితే...రన్‌వే స్ట్రిప్‌లు చాలా సాఫ్ట్‌గా ఉన్నాయని, ప్రమాదానికి ఇది కూడా ఓ కారణమై ఉండొచ్చని అధికారులు వివరిస్తున్నారు. ఫ్రంట్ వీల్ పక్కనే ఉన్న గడ్డిలోకి దూసుకుపోవడం వల్ల అక్కడే విమానం అక్కడే ఆగిపోయింది. ఈ ప్రమాదం జరిగిన వెంటనే ఎమర్జెన్సీ సర్వీస్ సిబ్బంది పరుగు పరుగున అక్కడికి వచ్చింది. ఫ్లైట్‌లోని ప్యాసింజర్స్‌ని ల్యాడర్‌ల ద్వారా సురక్షితంగా కిందకు దించారు. ఎమర్జెన్సీ టీమ్ వచ్చాక కానీ ప్రయాణికులు కాస్త కుదుటపడలేదు. ఈ ఘటనలో ఎవరికీ గాయాలవ్వలేదు. లాటిన్ అమెరికాలోనే అగ్రస్థానంలో ఉన్న ఎయిర్‌లైన్స్‌లో LATAM ఒకటి. ప్రమాద సమయంలో విమానంలో 172 మంది ప్రయాణికులు, 7గురు సిబ్బంది ఉన్నారు. వాళ్లంతా సేఫ్‌గానే ఉన్నారని అధికారులు ప్రకటించారు. మెడికల్ టీమ్ కూడా వెంటనే అందుబాటులోకి వచ్చిందని తెలిపారు.