Reverse Ageing: 



హార్వర్డ్ సైంటిస్ట్‌ల ప్రయోగం..


వయసు మీద పడిపోతున్న కొద్దీ ఒంట్లో సత్తువ తగ్గిపోతుంది. జబ్బులు ఇబ్బందులు పెడతాయి. ఏ పనీ చేసుకోలేం. ప్రతి చిన్న విషయానికీ వేరే వాళ్లపై ఆధారపడాల్సి వస్తుంది. రానురాను విలువ కూడా తగ్గిపోతుంది. ఈ ముసలితనం రాకుంటే ఎంత బాగుండు అనిపిస్తుంది. కానీ అది పగటి కల మాత్రమే. వృద్ధాప్యం రాకుండా ఎలా ఉంటుంది..? కానీ సైంటిస్ట్‌లు మాత్రం దీనికీ మందులున్నాయంటున్నారు. అవును వయసు తగ్గించుకునే ట్యాబ్లెట్‌లు కనిపెట్టేశారు. హార్వర్డ్ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు తయారు చేసిన ఈ మందులు వేసుకుంటే ఏజ్ రివర్సింగ్‌ (Reverse Ageing) సాధ్యమవుతుందట. న్యూయార్క్ పోస్ట్ ఇదే విషయం వెల్లడించింది. రివర్స్ సెల్యులార్ ఏజింగ్ పేరుతో ఓ పరిశోధన చేసిన సైంటిస్ట్‌లు జులై 12న దీనికి సంబంధించిన వివరాలను ఓ జర్నల్‌లో ప్రచురించారు. మొత్తం ఆరు కెమికల్ కాక్‌టెయిల్స్‌ని కలిపి ఈ మందు తయారు చేశారు. ముందు ఎలుకపై ప్రయోగం చేసి ఆ తరవాత మనిషిపైనా ప్రయోగించారు. ఈ రెండు ప్రయోగాల్లోనూ ఫలితాలు ఊహించనట్టుగానే వచ్చాయి. వయసు తగ్గిపోయినట్టు స్పష్టంగా కనిపించింది. హార్వర్డ్‌ యూనివర్సిటీకి చెందిన ఓ రీసెర్చర్‌ ట్విటర్‌లో ఈ వివరాలు పోస్ట్ చేశారు. 


"మా కొత్త పరిశోధనకు సంబంధించిన వివరాలు వెల్లడించడం చాలా గర్వంగా ఉంది. గతంలోనే మేం ఏజ్ రివర్సింగ్ సాధ్యమే అని చెప్పాం. జీన్ థెరపీతో చేయొచ్చని రుజువు చేశాం. ఈ సారి కెమికల్ కాక్‌టెయిల్స్‌తో మందు తయారు చేశాం. ఈ మందుతో శరీరమంతా యాక్టివేట్ అవుతుంది. వయసు తగ్గిపోతుంది"


- హార్వర్డ్ రీసెర్చర్ 






ఈ కాక్‌టెయిల్‌లో దాదాపు 5-7 ఏజెంట్స్‌ ఉన్నాయని వివరించారు సైంటిస్ట్‌లు. ఫిజికల్‌, మెంటల్ డిజార్డర్‌లకు ఇది దివ్యౌషధంగా పని చేస్తుందని వెల్లడించారు. దాదాపు మూడేళ్లుగా దీనిపై ప్రయోగాలు చేసిన తరవాతే నిర్ధరణకు వచ్చామని చెప్పారు. 


"బ్రెయిన్ టిష్యూ, కిడ్నీ, కండరాలపై మేం చేసిన ప్రయోగం సానుకూల ఫలితాలనిచ్చింది. కంటిచూపు మెరుగవడంతో పాటు లైఫ్‌స్పాన్ కూడా పెరిగింది. ఆ తరవాత కోతుల్లోనూ ప్రయోగించాం. అక్కడా సక్సెస్ అయ్యాం. ప్రస్తుతానికి మనుషులపై ఇంకా క్లినికల్ ట్రయల్స్ నడుస్తున్నాయి. అంతా బాగానే జరుగుతుందని ఆశిస్తున్నాం"


- హార్వర్డ్ రీసెర్చర్