ట్విట్టర్ చేతులు మారుతోంది. ఎలన్ మస్క్ చేతుల్లోకి వెళ్లబోతోంది. ఈ సమయంలో ట్విట్టర్ కేంద్రంగా అనేకానేక వివాదాలు, ప్రచారాలు జరుగుతున్నాయి. తాజాగా ట్విట్టర్ అధికారికంగా తన చేతుల్లోకి రాగానే అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఖాతాను పునరుద్ధరిస్తామని ఎలన్ మస్క్ ప్రకటించారు. ఈ ప్రకటనపై అమెరికాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
అమెరికాలో ఎన్నికల హడావుడి ఎక్కువగా ఉన్న సమయంలో క్యాపిటల్ భవనంపై జరిగిన హింసాత్మక దాడి ఘటనలో 150 మంది భద్రతా అధికారులు గాయపడగా, ఇద్దరు మరణించారు. ఈ ఘటనలో హింసను రెచ్చగొట్టడంలో ట్రంప్ ప్రమేయం ఉన్నందున ట్రంప్ ట్విటర్ ఖాతాను శాశ్వతంగా నిలిపివేశారు. ఇప్పుడు ట్రంప్ ట్విటర్ ఖాతాను పునరుద్ధరిస్తామంటూ ఎలన్ మస్క్ ప్రకటనకు ట్విటర్ మాజీ ఛీప్ జాక్ డోర్సే కూడా మద్దతు తెలిపారు. ట్రంప్ ఖాతా నిషేధం అత్యంత మూర్ఖపు నిర్ణయమని, తప్పుడు నిర్ణయమని పేర్కొన్నారు.
ట్విటర్ నుంచి శాశ్వతంగా నిషేధించడం తమ వైఫల్యమంటూ జాక్ డోర్సే తెలిపినట్టుగా వచ్చిన వార్తా కథనాన్ని రీట్వీట్ చేస్తూ కేంద్ర మంత్రి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏదైనా ఒక ప్లాట్‌ఫామ్ నుంచి ఒక వ్యక్తిని శాశ్వతంగా నిషేధించడం అంటే యూజర్ల ప్రాథమిక హక్కులను హరించినట్టే. ఇటువంటి ఏకపక్ష నిర్ణయాలు మళ్లీ జరగకుండా ఉండాలంటే బలమైన చట్టాలను తీసుకురావాల్సిన అవసరం ఉందని కేంద్ర మంత్రి అన్నారు.
ఫ్రీ స్పీచ్, శాశ్వత నిషేధం వంటి అంశాలపై ఇప్పటికే ఈలాన్ మస్క్‌కి రోజురోజుకి ఆదరణ పెరుగుతుండగా తాజాగా భారత కేంద్ర మంత్రి కూడా మద్దతు పలికినట్లయింది. నిజానికి మస్క్‌తో భారత ప్రభుత్వం అంత సత్సంబంధాలనేం పెట్టుకోలేదు. టెస్లా ప్లాంట్ ఏర్పాటు.. ఇతర అంశాల్లో భిన్నాభిప్రాయులు వ్యక్తమయ్యాయి. ఇలాంటి సమయంలో అనూహ్యంగా ఓ కేంద్ర మంత్రి నుంచి ఈలాన్ మస్క్‌కి పరోక్ష మద్దతు లభించింది. కొసమెరుపేమిటంటే మస్క్ ట్విట్టర్ కొనుగోలు చేసినా తాను మళ్లీ రీ ఎంట్రీ ఇవ్వనని ట్రంప్ ఇంతకు ముందే ప్రకటించారు.