Usha Chilukuri Vance Latest News: రిపబ్లికన్ పార్టీ తరపున అధ్యక్ష అభ్యర్థిగా ఎంపికైన డొనాల్డ్ ట్రంప్.. ఉపాధ్యక్ష పదవికి జేడీ వాన్స్ అనే ఒహియో సెనెటర్‌ను ఎంపిక చేయడం.. ఇప్పుడు ఇండియాలో ట్రెండ్ అవుతున్న సంగతి తెలిసిందే. జేడీ వాన్స్ తెలుగు మూలాలు ఉన్న ఒక అమ్మాయిని వివాహం చేసుకోవడమే అందుకు కారణం. దీంతో జేడీ వాన్స్ భార్య ఉషా చిలుకూరి గురించి ముఖ్యంగా తెలుగు వారు వెతకడం మొదలుపెట్టారు. ఈ క్రమంలో తొలిసారిగా ఉషా చిలుకూరి తన భర్త గురించి కీలక విషయాలను వెల్లడించారు. అమెరికాలో జరిగిన రిపబ్లికన్ నేషనల్ కన్వెన్షన్ 2024 లో మాట్లాడిన ఉషా చిలుకూరి తన భర్త గురించి ఇలా చెప్పారు.
‘‘నా భర్తను నేను మీ అందరికీ పరిచయం చేయాలని నన్ను వీళ్లు అడిగినప్పుడు నాకేం అర్థం కాలేదు. జేడీ వాన్స్ గురించి మీకు కొత్తగా చెప్పాల్సింది ఏముంది. అతని జీవితంలో ఏం జరిగిందో ఏం సాధించాడో హాలీవుడ్ లో ఓ సినిమానే వచ్చింది. జేడీ ఏం సాధించారో ఆయనే రాసిన పుస్తకం హిల్ బెల్ ఎలెజీ పుస్తకంలో మీతో పంచుకున్నారు కూడా. ఆయన సెనేటర్ గా పోటీ చేసినప్పుడైనా.. లేదా ఇప్పుడు యూఎస్ సెనేటర్ గా మీ ముందు ఆయన నిలబడినా.. నేను ఆయన కోసం చేయగలిగింది ఒక్కటే.. నేను నా మనస్ఫూర్తిగా ఆయన్ను ఎందుకు ప్రేమిస్తున్నానో చెప్పగలను. అంతే కాదు ఆయన మన దేశానికి ఉపాధ్యక్షుడు అయితే ఎంతలా అమెరికాను అభివృద్ధి చేయగలడో వివరించగలను.
నేను మొదటిసారి జేడీని లా స్కూల్లోనే కలిశాను. జీఐ బిల్లుల సాయంతో వచ్చిన డబ్బులతో అతను చదువుకోవటానికి లా స్కూలుకు వచ్చాడు. ముందు మేం స్నేహితులం. జేడీ వాన్స్ తో ఫ్రెండ్ షిప్ చేయాలని అనుకోని వాళ్లు ఎవరుంటారు. అప్పటికి ఇప్పటికీ నేను కలిసిన ఆసక్తికరమైన మనిషి అంటే అది జేడీ వ్యాన్సే. కష్టపడి పనిచేసే తత్వం ఉన్న వ్యక్తి. చిన్నప్పటి నుంచి ఎన్నో ఇబ్బందులను దాటుకుని పెరిగాడు. మేం లా స్కూల్ కంప్లీట్ చేసేసరికి ఓ కంప్లీట్ పర్సన్ గా తయారయ్యాడు. ఎప్పుడూ సర్వీస్ లో బిజీగా ఉంటారు. అయినా కూడా కుక్కపిల్లలతో ఆడుకోవటానికి, పిల్లలతో కలిసి సినిమాలు చూడటానికి సమయం కేటాయిస్తారు.
నాకు తెలిసిన వ్యక్తుల్లో గొప్ప అంకితభావంతో చేయాలనుకున్న పని మీద లక్ష్యం మీద ధ్యాసతో ఉండే వ్యక్తి జేడీ వాన్స్. ఓ భర్తగా, ఓ తండ్రిగా తన కుటుంబాన్ని తనకు కావాల్సినట్లుగా చిన్నప్పుడు తను కలలుకన్నట్లుగా అందంగా మలుచుకున్నాడు. జేడీతో పోల్చి చూస్తే నా నేపథ్యం చాలా విభిన్నంగా ఉంటుంది. నేను శాండియాగోలో ఓ మధ్యతరగతి కుటుంబంలో పుట్టిపెరిగాను. మా అమ్మానాన్న ఇద్దరూ భారత దేశం నుంచి అమెరికాకు వలస వచ్చారు. నన్ను నా సోదరిని ఎంతో గారాబంగా పెంచారు. నేను, జేడీ వాన్స్ యేల్ లా స్కూల్ లో కలవటం, ప్రేమలో పడటం, తర్వాత పెళ్లి చేసుకోవటం అనేవన్నీ మేం ఇద్దరం కలిసి ఈ దేశానికి సేవ చేయాలని రాసి పెట్టి ఉండి జరిగాయేమో.
నా కోసం నాన్ వెజ్ మానేశాడు
జేడీ అంటే ఏంటో మొదటిసారి దేశ ప్రజలందరికీ తెలిసే సందర్భం కాబట్టి ఇది అతని జీవితంలో కూడా ఇది కీలకమైన సందర్భం. మేం ఇద్దరం మొదటిసారి కలిసినప్పుడు పరస్పరం ఒకరి విషయాల మీద మరొకరం ఆసక్తి చూపించేవాళ్లం. ప్రత్యేకించి నా గురించి మొత్తం తెలుసుకోవాలని జేడీ వాన్స్ తాయత్రయపడేవాడు. నేను ఎక్కడ పెరిగాను.. నా బాల్యం ఎలా గడిచింది.. ఎక్కడి నుంచి వచ్చాను ఇలా అన్నీ అడిగి తెలుసుకునేవాడు. జేడీ ఎలాంటి వాడంటే కేవలం వెజిటేరియనే తింటానని నాకోసం వెజ్ మాత్రమే తినటం మొదలుపెట్టాడు. అంతే కాదు మా అమ్మ దగ్గర నుంచి వంట చేయటం కూడా నేర్చుకున్నాడు. అది కూడా మా ఇండియన్ ఫుడ్ చేయటం నేర్చుకున్నాడు.
మా కుటుంబంలో కలిసిపోయాడు
నాకు కూడా తెలియకుండానే నా కుటుంబంలో అతనో విడదీయలేని భాగమైపోయాడు. ఎంతలా అంటే అతను లేకుండా నేను బతకలేనని నాకూ అర్థమైంది. ఆరోజు నేను చూసిన.. నాకు తెలిసిన జేడీ ఎలాంటి వ్యక్తో ఈ రోజు మీ ముందున్న జేడీ అలాగే ఉన్నాడు. అతను మా కుటుంబం నుంచి నేర్చుకున్నదీ ఒకటే. అందరినీ జాగ్రత్తగా చూసుకోవటం, అందరికీ అవకాశాలు కల్పించటం, అద్భుతమైన భవిష్యత్తుకు బాటలు వేయడం, ఓపెన్ మైండ్ తో సమస్యలను అర్థం చేసుకోవటం వాటిని పరిష్కరించటం. ఈరోజు ఇలా మేం ఇక్కడ నుంచి మాట్లాడతామని.. నేను కానీ జేడీ కానీ ఎప్పుడూ అనుకోలేదు. ఓ సాధారణ మధ్యతరగతి కుర్రాడి నుంచి ఈ రోజు ఈ అత్యున్నత స్థాయి పదవికి పోటీ పడగలిగేంత స్థాయిని సంపాదించుకునేంత వరకూ ఓ సాధారణ అమెరికన్ తన కలను నెరవేర్చుకోవచ్చు అనటానికి శక్తివంతమైన ఉదాహరణగా అయితే నిలవగలిగాం.
నానమ్మ చేతుల్లో పెరిగిన జేడీ
జేడీ ని వాళ్ల నానమ్మ పెంచి పెద్ద చేసింది. కష్టాల నుంచి పెరిగి ఇప్పుడు దేశానికి సేవ అందించే స్థాయికి చేరుకున్నాడు. జేడీ వాన్స్ ను, మా కుటుంబాన్ని మీరింతలా ఆదరిస్తున్నందుకు, నమ్ముతున్నందుకు మేమంతా మీకు రుణపడి ఉంటాం. ఈ సందర్భంగా నా భర్తను, అమెరికాకు కాబోయే ఉపాధ్యక్షుడిని పరిచయం చేస్తున్నందుకు గర్వపడుతున్నాను’’ అని జేడీ వాన్స్ సతీమణి ఉషా చిలుకూరి వాన్స్ మాట్లాడారు.