మారుతున్న కాలంతో పాటు ప్రజల అలవాట్లలోనూ చాలా మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఇంట్లో  కూర్చునే ప్రతి వస్తువును తమ దగ్గరకు తెచ్చుకుంటున్నారు. ప్రజల అభిరుచికి తగినట్లుగానే బోలెడు ఆన్ లైన్ యాప్ లు కూడా పెరిగిపోయాయి. కరోనా వచ్చిన తరువాత అయితే ఆన్ లైన్‌ షాపింగ్ విపరీతంగా పెరిగిపోయిందనే చెప్పవచ్చు.


బయట షాపింగ్ మాల్స్‌ లో దొరకని కొన్ని వస్తువులు కూడా ఆన్ లైన్‌ లో దొరుకుతుండటంతో వినియోగదారులు విపరీతంగా పెరిగారు. ఏ చిన్న వస్తువు కావాలన్నా ఇప్పుడు ఆన్ లైన్ షాపింగ్‌ ఉందిగా అంటున్నారు. ఆన్ లైన్‌ యాప్‌ లలో ముందుగా చెల్లించే పద్దతి ఉంది. ఇంటికి వచ్చిన తరువాత చెల్లించే పద్దతి కూడా ఉంది. 


కానీ, ఎవరో ఇతరులు ఆర్డర్‌ చేసిన వస్తువులు కొన్ని సార్లు తప్పుడు చిరునామాకు వెళ్తుంటాయి. ఏదన్నా ఒకటి రెండు సందర్భాల్లో ఇలా జరగడం సహజం. కానీ ఇక్కడ ఓ మహిళకు మాత్రం ఏకంగా 100 కి పైగా ఆర్డర్‌ లు తప్పుగా వచ్చాయి. వర్జీనియా కు చెందిన ఓ మహిళకు అమెజాన్ యాప్ నుంచి 100 కి పైగా ప్యాకేజీలు డెలివరీ అయ్యాయి. 


వర్జీనియా సిటీకి చెందిన సిండి స్మిత్ తన ప్రిన్స్ విలియం కౌంటీ హోమ్‌ లో ఈ ఆర్డర్లన్నింటిని కూడా అందుకున్నారని ఓ వార్త సంస్థ తెలిపింది. ఆమె అందుకున్న ప్యాకేజీలలో 1,000 హెడ్‌ల్యాంప్‌లు, 800 గ్లూ గన్‌లు, డజన్ల కొద్దీ బైనాక్యులర్‌లు ఉన్నాయి. అయితే వాటిలో ఒక్కదానిని కూడా సిండి ఆర్డర్ చేయలేదు. 


అడ్రెస్‌ కరెక్ట్ గానే ఉన్నప్పటికీ, పేరు మాత్రం లిక్సియావో జాంగ్‌ అని ఉంది. అయితే, ఇంతకు ముందు ఎప్పుడూ కూడా  ఈ పేరు వినలేదని స్మిత్ చెప్పింది. కొన్ని సార్లు ఇలా పొరపాటు జరుగుతుంటుందని సంస్థ పేర్కొంది.