Tilapia Fish: ప్రపంచంలో ప్రతిదీ కలుషితం అవుతున్నాయి. తినే తిండి, తాగే నీరు, పీల్చే గాలి ఇలా ప్రతిదీ కలుషితమే. ఇలా కలుషితమైన, అపరిశుభ్ర ఆహారం తిని ఎంతో మంది రోగాల పాలవుతున్నారు. మరికొంత మంది మృత్యువాత పడుతున్నారు. ఇటీవలే ఫ్రాన్స్‌లో సార్డినెస్ అనే చేపల వంటకాన్ని తిని ఓ మహిళ మృతి చెందగా, మరో 12 మంది ఆస్పత్రిలో చికిత్స పొందారు. తాజాగా ఇలాంటి ఘటనే కాలిఫోర్నియాలో జరిగింది. కలుషితమైన తిలాపియా చేపలు తిని ఓ మహిళ మంచానికే పరిమితమైంది. ఆమెలోని నాలుగు ప్రధాన అవయవాలు పనిచేయడం మానేశాయి.
ఈ విషయాన్ని మహిళ స్నేహితులు సోషల్ మీడియా ఖాతాల్లో తెలిపారు. బ్యాక్టీరియాతో కూడిన కలుషితమైన తిలాపియా చేపలను తక్కువగా ఉడకబెట్టి తినడంతో ఆమెకు బ్యాక్టీరియా సోకిందని, ఫలితంగా ఆమె ఆరోగ్యం పూర్తిగా చెడిపోయిందని, మంచానికి పరిమితమైందని తెలిపారు. వివరాలు.. ఓ 40 ఏళ్ల వయసున్న లారా బరాజాస్ శాన్‌జోస్‌లోని స్థానిక మార్కెట్‌లో తిలాపియన్ చేపలు కొనుగోలు చేసింది. అయితే అప్పటికే ఆ చేపలు ప్రాణాంతకమైన బ్యాక్టీరియా సోకి చెడిపోయాయి. ఆవిషయం తెలియన లారా బరాజాస్ వాటిని వండుకుని తిన్నారు. దీంతో ఆమె ఒక్కసారిగా అస్వస్థతకు గురయ్యారు. ఆస్పత్రిలో నెలల తరబడి చికిత్స తీసుకున్న అనంతరం గురువారం ఆమె ప్రాణాలు నిలిపేందుకు వైద్యులు శస్త్రచికిత్స చేశారు.
దీనిపై ఆమె స్నేహితులు సోషల్ మీడియాలో స్పందించారు. ‘ఇది నిజంగా మనందరికి కష్టమైన విషయం. ఇది భయంకరమైనది. ఇది మనలో ఎవరికైనా జరిగి ఉండవచ్చు’ అని బరాజాస్ స్నేహితురాలు అన్నా మెస్సినా చెప్పారు. శాన్ జోస్‌లోని స్థానిక మార్కెట్‌లో కొనుగోలు చేసిన చేపలతో చేసిన వంట తినడంతో బరాజాస్ అస్వస్థతకు గురయ్యారని, ఆమె దాదాపు ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి వచ్చిందని, ఆమె రెస్పిరేటర్‌లో ఉందని చెప్పారు. బరాజాస్‌ను కాపాడేందుకు వారు ఆమెను వైద్యపరంగా ప్రేరేపిత కోమాలోకి వెళ్లేలా చేశారని, ఆమె వేళ్లు, పాదాలు, దిగువ పెదవి నల్లగా మారాయని, ఆమె మూత్రపిండాలు విఫలమయ్యాయని సోషల్ మీడియాలో ఆమె రాసుకొచ్చారు.
బరాజాస్‌కు విబ్రియో వల్నిఫికస్ అనే ప్రాణాంతక వైరస్ సంక్రమించిందని మెస్సీనా పేర్కొన్నారు. ఈ బ్యాక్టీరియా సముద్రపు ఆహారం, సముద్రపు నీటిలో కనిపించే ప్రాణాంతకమైన బ్యాక్టీరియా అన్నారు. సముద్రపు ఆహారాన్ని సరిగా శుభ్రం చేయకపోవడంతో బ్యాక్టీరియా సోకే అవకాశం ఉందన్నారు. ఇటువంటి తీవ్రమైన ఆరోగ్య ప్రమాదాలను నివారించడానికి సముద్రపు ఆహారాన్ని సరిగ్గా వండాలని హెచ్చరించారు. ఈ బాక్టీరియా సంక్రమించగల మార్గాలను UCSF ఇన్ఫెక్షియస్ డిసీజ్ నిపుణుడు డాక్టర్ నటాషా స్పాటిస్‌వుడ్ వివరించారు. కలుషిత ఆహారం తినడం లేదా బ్యాక్టీరియా ఉన్న నీటిలో దిగనప్పుడు గాయాల ద్వారా శరీరంలోకి ప్రవేశించవచ్చని ఆయన తెలిపారు.
ఫ్రాన్స్‌లో కవల చేపలు తిని ఒకరు మృతి
ఫ్రాన్స్‌లో ఇలానే నిల్వ చేసిన చేపల కూర తిని అరుదైన వ్యాధితో మహిళ మరణించింది. ఫ్రాన్స్ లోని బోర్డియక్స్ సిటీ వైన్, ఆహారానికి ప్రసిద్ధి చెందింది. పట్టణంలో సాధారణంగానే పెద్ద సంఖ్యలో పర్యాటకులు ఉంటారు. ఇక్కడ చిన్ ట్చిన్ వైన్ బార్ అనే రెస్టారెంట్‌లో సెప్టెంబరు 4 నుంచి10 తేదీల మధ్య పలువురు సార్డినెస్ అనే చేపల వంటకాన్ని తిన్నారు. వారిలో 32 ఏళ్ల ఓ మహిళ మరణించింది. మరో 12 మంది పరిస్థితికి విషమించడంతో వారికి చికిత్స పొందారు.