Jahnavi Kandula Death: 



మేయర్ క్షమాపణలు...


అమెరికాలోని సియాటెల్‌లో జాహ్నవి కందుల (Jahnavi Kanduula) మృతి సంచలనం సృష్టించింది. పోలీస్ ప్యాట్రోలింగ్ వెహికిల్ ఢీకొట్టి రోడ్డుపైనే ప్రాణాలు కోల్పోయింది. ఆమె మృతిపై ఇద్దరు పోలీస్ ఆఫీసర్‌లు జోక్‌లు చేసుకుని నవ్వుకున్న వీడియో మరింత సంచలనమైంది. ఇప్పటికే దీనిపై విచారణ చేపడుతున్నారు సియాటెల్ పోలీసులు. ఎట్టి పరిస్థితుల్లోనూ నిందితులను వదలం అని తేల్చి చెబుతున్నారు. ఇప్పుడు సియాటెల్ మేయర్ బ్రూస్ హ్యారెల్ (Bruce Harrell) కూడా ఈ ఘటనపై స్పందించారు. ఇలా జరిగినందుకు క్షమాపణలు కోరారు. ఈ ఘటనపై పూర్తి స్థాయి బాధ్యత వహిస్తామని, వీడియోలో పోలీస్‌లు మాట్లాడిన భాష చాలా అభ్యంతరకరంగా ఉందని మండి పడ్డారు. ప్రతి మనిషి జీవితానికి విలువ ఉంటుందని, ఇలా కించపరచడం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మేయర్ తరపున లాయర్ ప్రీతి శ్రీధర్ ఈ విషయం వెల్లడించారు.  South Asian Immigrant Community, సియాటెల్ మేయర్ బ్రూస్ హ్యారెల్ మధ్య దాదాపు గంటన్నర పాటు భేటీ జరిగింది. జాహ్నవి మృతి కేసుపైనే చర్చించారు. ఈ సమావేశం సమయంలో దాదాపు 20 మంది లోపలకు వచ్చి జాహ్నవికి మద్దతుగా నిలిచారు. ఈ ఘటనకు కారణమైన వారిని విడిచిపెట్టొద్దని, పారదర్శకంగా విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. వారితో మాట్లాడిన మేయర్ బ్రూస్...కచ్చితంగా న్యాయం జరుగుతుందని హామీ ఇచ్చారు. సౌత్ ఏషియన్ కమ్యూనిటీకి చెందిన 100 మంది జాహ్నవికి మద్దతుగా ర్యాలీ నిర్వహించారు. కిల్లర్ కాప్స్ అంటూ ప్లకార్డ్‌లు పట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. జాహ్నవి చదువుకున్న Northeastern University ఆమె జ్ఞాపకార్థం డిగ్రీ పట్టా అందించేందుకు ముందుకొచ్చింది. 


భారత్ ఆగ్రహం..


ఈ ఘటనపై భారత్‌ సీరియస్ అయింది. శాన్ ఫ్రాన్సిస్కోలోని Consulate General of India తీవ్రంగా స్పందించింది. ఇది చాలా దారుణం అంటూ మండి పడింది. సియాటెల్‌లోని స్థానిక అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నట్టు వెల్లడించింది. పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకునేలా చొరవ చూపిస్తున్నట్టు స్పష్టం చేసింది. ఇదే విషయాన్ని ట్విటర్ అఫీషియల్ హ్యాండిల్‌లో పోస్ట్ చేసింది. ఎప్పటికప్పుడు పరిస్థితులు సమీక్షిస్తామని హామీ ఇచ్చింది. ఈ ఘటనపై తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ కూడా ట్విటర్‌లో స్పందించారు. ఈ ఘటన ఎంతో కలిచివేసిందని, బాధితురాలి కుటుంబానికి న్యాయం జరిగేలా ప్రభుత్వం చొరవ తీసుకోవాలని కోరారు. విదేశాంగ మంత్రి జైశంకర్‌ని ఈ పోస్ట్‌లో ట్యాగ్ చేశారు. యూఎస్ పోలీసులు మాట్లాడిన తీరుపై ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర మంత్రి జైశంకర్ కు లేఖ రాశారు. 


"ఈ ఘటన చాలా దారుణం. సియాటెల్‌తో పాటు వాషింగ్టన్ స్టేట్‌లోని అధికారులతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్నాం. పారదర్శకంగా విచారణ జరపాలని డిమాండ్ చేశాం. జాహ్నవి మృతికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని తేల్చి చెప్పాం. కాన్సులేట్, ఎంబసీ అధికారులతో విచారణపై ఆరా తీస్తున్నాం"


- కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా, శాన్‌ ఫ్రాన్సిస్కో 


Also Read: బీజేపీ ఓటు బ్యాంక్‌కి గురి పెట్టిన కాంగ్రెస్, రిజర్వేషన్ అస్త్రాలతో యుద్ధానికి రెడీ