Texas Republican Candidate Valentina Gomez Burnt Quran: అమెరికాలోని టెక్సాస్‌లో రిపబ్లికన్ పార్టీ నేత ఒకరు ఖురాన్‌ను దహనం చేసిన ఘటన వైరల్ గా మారింది.  టెక్సాస్‌లో రిపబ్లికన్ కాంగ్రెస్ అభ్యర్థి వాలెంటీనా గోమెజ్, ఖురాన్‌ను   దహనం చేశారు. "టెక్సాస్‌లో ఇస్లాంను అంతం చేస్తాను" అని శపథం చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ వీడియోతో ముస్లిం సమాజంతో పాటు వివిధ రాజకీయ నాయకులు, సివిల్ రైట్స్ సంస్థల నుండి తీవ్ర విమర్శలు వస్తున్నాయి. గోమెజ్, టెక్సాస్ నుండి 2026 ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు.

ఇస్లాంను ఒక్కసారిగా అంతం చేయకపోతే  మీ కుమార్తెలు బలాత్కారానికి గురవుతారు, మీ కుమారుల తలలు నరికేస్తారు అని గోమెజ్ వీడియోలో హెచ్చరికలు జారీ చేశారు.   "అమెరికా ఒక క్రైస్తవ దేశం, కాబట్టి ఆ ఉగ్రవాద ముస్లింలు 57 ముస్లిం దేశాలకు వెళ్లిపోవచ్చు. ఒకే ఒక నిజమైన దేవుడు ఉన్నాడు, అది ఇజ్రాయెల్ దేవుడు," అని ఆమె వీడియోలో వ్యాఖ్యానించారు. ఈ వీడియోను మిలియన్ల మంది చూశారు.  కొలంబియాలో జన్మించిన వాలెంటీనా గోమెజ్, చిన్న వయసులో అమెరికాకు వలస వచ్చారు. 2024లో ఆమె మిస్సౌరీ సెక్రటరీ ఆఫ్ స్టేట్ కోసం రిపబ్లికన్ నామినేషన్‌లో పోటీ చేసి, 7.4% ఓట్లతో ఆరవ స్థానంలో నిలిచారు. గతంలో ఆమె ట్రాన్స్‌జెండర్ క్రీడాకారులపై వివాదాస్పద వ్యాఖ్యలు, ఎల్‌జీబీటీక్యూ+ సాహిత్యాన్ని దహనం చేసిన వీడియోలు,  డిసెంబర్ 2024లో ఒక వలసదారుడి నకిలీ ఉరిశిక్షను చిత్రీకరించిన వీడియో వంటి  వాటితో తరచూ వార్తల్లో నిలిచారు.  

టెక్సాస్‌లో ముస్లిం జనాభా ఎక్కువ మంది లేరు. కేవలం ఒక్క శాతం మంది మాత్రమే ఉన్నారు.  కౌన్సిల్ ఆన్ అమెరికన్-ఇస్లామిక్ రిలేషన్స్  ఈ ఘటనను మత స్వేచ్ఛను బెదిరించే ప్రమాదకర ప్రవర్తనగా వర్ణించింది. అయితే ట్రంప్ క్యాంప్ నుంచి మద్దదతు లభిస్తోంది. ట్రంప్ సన్నిహితురాలు లారా లూమర్ ఈ చర్యను సమర్థిస్తూ, ఇది రిపబ్లికన్ సభ్యులలో కోరుకునే శక్తి అని ప్రశంసించారు .

 

గోమెజ్ తన వీడియోలను సమర్థించుకున్నారు. ఖురాన్ హింసను ప్రోత్సహించే గ్రంథమని ..లైంగిక హింస ,  ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తుందని వాదిస్తున్నారు.  ఈ ఘటన అమెరికాలో ఇస్లామోఫోబియా  గురించి మరోసారి చర్చను ప్రారంభించినట్లయింది.  గోమెజ్  రాజకీయ జీవితంలో గుర్తింపు పొందడానికి చేసిన ప్రయత్నంగా విమర్శకులు భావిస్తున్నారు. ప్రచారానికి విరాళాలు కూడా రారవడం లేదని..  అందుకే గోమెజ్ చర్యలు రాజకీయ లాభం కోసం మతపరమైన ఉద్రిక్తతలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి.