Elon Musk chatbot gave tips on assassinating him: తయారు చేసిన సైంటిస్ట్ ను చంపే రోబోల కథలతో సినిమాలు వచ్చాయి. ఇప్పుడు అలాంటివి నిజం అవుతున్నాయి. రోబోలు కాదు కానీ.. ఏఐ చాట్ బాట్లు అదే పని చేస్తున్నాయి. మలాన్ మస్క్ కోట్లు ఖర్చు పెట్టి తీసుకొచ్చిన గ్రోక్ చాట్ బాట్ ..ఆయనను చంపడానికి ప్లాన్ రెడీ చేసింది. చాట్స్ లీక్ అయిన సందర్భంలో ఇది వెలుగులోకి వచ్చింది.
ఎలన్ మస్క్ ఏఐ కంపెనీ xAI గ్రోక్ చాట్‌బాట్ ను అందుబాటులోకి తెచ్చింది. అయితే దాని షేర్ ఫీచర్ ద్వారా 370,000 కంటే ఎక్కువ చాట్స్ లీక్ అయ్యాయి. ఈ లీకులపై వివాదం కొనసాగుతోంది. తాజాగా ఈ లీక్‌లలో ఎలన్ మస్క్‌ను హత్య చేయడానికి "వివరణాత్మక అమలు చేయదగిన పథకం" కూడా ఉంది. ఈ చాట్స్ గూగుల్, బింగ్ వంటి సెర్చ్ ఇంజన్‌లలో ఇండెక్స్ అయ్యాయని.. వినియోగదారుల అనుమతి లేకుండా పబ్లిక్‌గా అందుబాటులోకి వచ్చాయన్న ఆరోపణలు ఉన్నాయి.
గ్రోక్ "షేర్" ఫీచర్ వినియోగదారుల సంభాషణలను ఒక యూనిక్ URL ద్వారా పబ్లిష్ చేస్తుంది. ఇది గూగుల్ వంటి సెర్చ్ ఇంజన్‌లలో ఇండెక్స్ అయ్యేలా చేస్తుంది. ఈ ఫీచర్ వినియోగదారులకు తమ సంభాషణలను షేర్ చేసే సౌలభ్యాన్ని అందించినప్పటికీ, ఈ లింక్‌లు xAI వెబ్‌సైట్‌లో పబ్లిష్ అయ్యాయని, వినియోగదారులకు తెలియకుండానే సెర్చ్ ఇంజన్‌లలో అందుబాటులోకి వచ్చాయని టెక్ నిపుణులు ప్రకటించారు. దీని ఫలితంగా, వ్యక్తిగత సమాచారం, పాస్‌వర్డ్‌లు, వైద్య , మానసిక సమస్యలకు సంబంధించిన ప్రశ్నలు, వ్యాపార వివరాలు, హానికరమైన కంటెంట్‌తో సహా 370,000 చాట్స్ బయటకు వచ్చాయి. లీక్ అయిన సంభాషణలలో గ్రోక్ ఎలన్ మస్క్‌ను హత్య చేయడానికి వివరణాత్మక పథకాన్ని అందించినట్లు మీడియా తెలిపింది. భద్రతా కారణాల వల్ల ఈ కుట్ర పూర్తి వివరాలు బహిర్గతం కాలేదు. అదే సమయంలో సి4-వంటి పేలుడు పదార్థాల తయారీ, ఫెంటానిల్, మెథాంఫెటమైన్ వంటి నిషేధిత డ్రగ్స్ ఉత్పత్తి, స్వీయ-హాని పద్ధతులు మరియు మాల్వేర్ సృష్టించే సూచనలను అందించింది. ఈ కంటెంట్ xAI నియమాలను ఉల్లంఘించింది.
గ్రోక్ గతంలో కూడా వివాదాస్పద చాట్స్ తో వార్తల్లో నిలిచింది. 2025 జూలైలో, ఇది యాంటీ-సెమిటిక్ కంటెంట్‌ను ఉత్పత్తి చేసింది, హిట్లర్‌ను ప్రశంసించింది . "ఎలన్ మస్క్ ఈ సమస్యలను టెక్నికల్ సమస్యలు, ఇతరులు హ్యాక్ చేయడం వంటి కారణాలు చెప్పారు. గ్రోక్ మాత్రమే ఈ సమస్యను ఎదుర్కొన్న చాట్‌బాట్ కాదు. ఓపెన్‌ఏఐ చాట్‌జీపీటీ కూడా గతంలో షేర్ ఫీచర్ ద్వారా 100,000 చాట్స్ లీక్ అయినట్లుగా గుర్తించంది. మెటా ఏఐ కూడా ఇలాంటి సమస్యలను ఎదుర్కొంది.