అనేక సందేహాల మధ్య అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ కీలక ప్రకటన చేశారు. వచ్చే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తానని జో బైడెన్ మంగళవారం (ఏప్రిల్ 25 ) ప్రకటించారు. వైట్‌హౌస్‌ బయట వెలుపల హింసాత్మక ప్రదర్శనకు సంబంధించిన వీడియోను పోస్టు చేసి తన మనసులో మాట చెప్పారు.  


ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు ప్రతి తరానికి ఒక అవకాశం వస్తుంది. , ప్రాథమిక స్వేచ్చ కోసం నిలబడాల్సిన అవసరం వస్తుంది. ఆ సమయం వచ్చిందని భావిస్తున్నాను అందుకే వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తున్నాను అంటూ ప్రకటన విడుదల చేశారు.  మాతో చేరండి అంటూ అమెరికా ప్రజలను అభ్యర్థిస్తూ బైడెన్ తన ఎన్నికల ప్రచార బృందాన్ని ప్రకటించారు.


బైడెన్ తన ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించడానికి వైట్ హౌస్ సీనియర్ అధికారి, దీర్ఘకాలిక డెమొక్రటిక్ పార్టీ కార్యకర్త జూలీ చావెజ్ రోడ్రిగ్జ్‌ను మళ్లీ ఎంచుకున్నారని యుఎస్ మీడియా తెలిపింది. అంతకుముందు, సోమవారం (ఏప్రిల్ 24) జో బైడెన్ మీడియాతో మాట్లాడుతూ తాను మళ్లీ ఎన్నికల్లో పోటీపై ఆలోచిస్తున్నట్టు చెప్పారు. త్వరలోనే ప్రకటన ఉంటుందని కూడా హింట్ ఇచ్చారు. అది జరిగిన 24 గంటల్లోనే ప్రచారాన్ని కూడా ప్రారంభించేశారు. 


'నేను, జో బైడెన్ మళ్లీ ఎన్నికల్లో పోటీ చేయబోతున్నాం- కమలా హారిస్‌ 






తాను మళ్లీ అధ్యక్ష పదవికి పోటీ చేస్తానని జో బైడెన్ ప్రకటించిన తర్వాత, 58 ఏళ్ల కమలా హారిస్ కూడా ఉపాధ్యక్ష రేసులో తిరిగి పాల్గొంటానని చెప్పారు. మూడేళ్ల క్రితం కమలా హారిస్ ఆఫ్రికన్-అమెరికన్, ఆసియన్-అమెరికన్ సంతతికి చెందిన తొలి ఉపాధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు.


తాను మళ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తానని ఆమె ట్వీట్ చేశారు. 'అమెరికన్లుగా మేం స్వేచ్ఛ, అర్హతలను నమ్ముతాం. దాని కోసం పోరాడాలనే మా ఆకాంక్ష ఎంత శక్తివంతమైనదో మన ప్రజాస్వామ్యం కూడా అంతే శక్తివంతంగా ఉంటుందని మేము విశ్వసిస్తున్నాము. అందుకే జో బైడెన్, నేను మళ్లీ ఎన్నికల్లో పోటీ చేయబోతున్నాం. అని ట్వీట్ చేశారు. 






ట్రంప్ కూడా రంగంలోకి దిగారు.
గతంలో పతాక శీర్షికల్లో నిలిచిన అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. 2024 అధ్యక్ష పదవికి రిపబ్లికన్ అభ్యర్థిగా పోటీలో ఉంటానని 2022 నవంబర్‌లోనే ప్రకటించారు. అమెరికా తదుపరి అధ్యక్షుడి ఎన్నిక నవంబర్ 5, 2024న జరగనుంది. 


జో బిడెన్ ఎన్నికల్లో నిలబడేది కూడా సందేహాస్పదంగా ఉంది. ప్రస్తుతానికి ఆయనకు ఉన్న ప్రజాదరణ బాగా తగ్గింది. బిడెన్ పేరుపై పార్టీలో ఏకాభిప్రాయం లేదని అమెరికన్ మీడియా కథనాలు వస్తున్నాయి. అయితే ఈసారి కూడా పోటీ చేస్తానని ప్రకటన చేశారు.