US Apache Helicopter | టెహ్రాన్: పశ్చిమాసియాలో మరోసారి యుద్ధ వాతావరణం కనిపిస్తోంది. ఇదివరకే ఇరాన్ మీద ఇజ్రాయెల్ దాడి చేయగా, టెహ్రాన్ సైతం ప్రతీకార దాడులకు దిగింది. మంగళవారం నాడు అమెరికాకు చెందిన అపాచీ హెలికాప్టర్ (AH 64)ను ఇరాన్ కూల్చివేయడం అగ్రరాజ్యంతో ఉద్రిక్తతను మళ్లీ పెంచింది. హెలికాప్టర్ కూల్చివేతకు ప్రతీకారంగా యూఎస్ ఎయిర్ ఫోర్స్ ఇరాన్‌లోని టెహ్రాన్ సహా పలు వ్యూహాత్మక ప్రాంతాలపై డ్రోన్లు, మిస్సైల్స్‌తో దాడులు ప్రారంభించింది. హర్మూజ్ సమీపంలోని ఖేష్మ్ దీవిలో బాంబు దాడుల శబ్దాలు వినిపించినట్లు ఇరాన్ మీడియా రిపోర్ట్ చేసింది.
ఇరాన్‌కు చెందిన కేశమ్, బందర్ అబ్బాస్ నగరాల్లోని పలు కీలక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని అమెరికా సైన్యం విరుచుకుపడింది. అమెరికాకు చెందిన అడ్వాన్స్‌డ్ అపాచీ హెలికాప్టర్‌ను కూల్చివేయడాన్ని తీవ్రంగా పరిగణించిన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, అందుకు తగిన సమాధానం చెబుతామని, ఇరాన్ మూల్యం చెల్లించుకోకతప్పదని తన సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ట్రూత్ సోషల్ ద్వారా ఇదివరకే హెచ్చరించారు. ఆ తరువాత కొన్ని గంటలకే అమెరికా బలగాలు ఇరాన్‌లోని పలు లక్ష్యాలపై విరుచుకుపడుతున్నాయి.
ఒమన్ తీరంలో హర్మూజ్ జలసంధి వద్ద గస్తీ కాస్తున్న అమెరికా సైన్యానికి చెందిన అపాచీ హెలికాప్టర్ కూలిపోయిన ఘటనకు ఇరానే కారణమని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విమర్శించారు. ఈ క్రమంలో మంగళవారం (జూన్ 9) నుండి ఇరాన్‌పై దాడులు ప్రారంభించినట్లు అమెరికా సైన్యం అధికారికంగా తెలిపింది. సోషల్ మీడియా ద్వారా అమెరికన్ సెంట్రల్ కమాండ్ (CENTCOM) ఓ ప్రకటన విడుదల చేసింది. అకారణంగా ఇరాన్ చేసిన దాడులకు, ఉద్దేశపూర్వక చర్యలకు ఇదే సరైన సమాధానమని స్పష్టం చేసింది.
హెలికాప్టర్ కూల్చివేతకు ఇరానే బాధ్యత వహించాలని ట్రంప్ హెచ్చరించిన కొద్ది గంటల్లోనే అమెరికా బలగాలు రంగంలోకి పలు ప్రాంతాలు లక్ష్యంగా దాడులు చేస్తున్నాయి. అమెరికా దాడుల తీవ్రతకు హర్మూజ్ జలసంధి (Strait of Hormuz) లోని ఒక ఇరాన్ ద్వీపం ఖేష్మ్‌లో భారీ పేలుళ్ల శబ్దాలు వినిపించినట్లు ఇరాన్ ప్రభుత్వ మీడియా ధృవీకరించింది.
ఇరాన్ లక్ష్మణరేఖ దాటిందా..
హర్మూజ్ జలసంధి సమీపంలో తమ హెలికాప్టర్‌ను కూల్చివేయడం ద్వారా ఇరాన్ లక్ష్మణ రేఖ దాటిందని, ఇందుకుగానూ అమెరికా బదులిచ్చి తీరుతుందని ట్రంప్ స్పష్టం చేశారు. మరోవైపు, ఈ ఉద్రిక్తతలపై ఇరాన్ దౌత్యవేత్త స్పందించారు. తమ దేశ సరిహద్దుల సమీపంలో విదేశీ సైనిక బలగాలకు ముప్పు పొంచి ఉంటుందని హెచ్చరించారు. అయితే శాంతి చర్చలు జరుగుతాయని, త్వరలోనే యుద్ధానికి పూర్తిగా ముగింపు పలుకుతామని డొనాల్డ్ ట్రంప్ చెబుతున్న సమయంలోనే అటు ఇరాన్, అమెరికా మధ్య, మరోవైపు ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య సైతం పరిస్థితులు మరింత దిగజారుతున్నాయి. అసలే మూడు నెలలకు పైగా చమురు సంక్షోభం నెలకొనడంతో ఈ పరిణామాలు అంతర్జాతీయంగా తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి.
