US Senator Remarks on Chilkur Balaji Temple: భారతీయ ఐటీ నిపుణులు, విద్యార్థుల కలల నిలయం, వీసా గాడ్ గా పేరొందిన చిలుకూరు బాలాజీ దేవాలయాన్ని అమెరికా రాజకీయ నేతలు వివాదం చేసే ప్రయత్నం చేస్తున్నారు. అమెరికాలోని మిస్సోరి రాష్ట్రానికి చెందిన రిపబ్లికన్ సెనేటర్ ఎరిక్ ష్మిత్ , హెచ్-1బీ వీసా విధానంపై విమర్శలు చేస్తూ నేరుగా చిలుకూరు బాలాజీ టెంపుల్‌ను లక్ష్యంగా చేసుకున్నారు. ఈ దేవాలయాన్ని ఆయన ఒక వీసా కార్టెల్ గా అభివర్ణించడం వాళ్లలోని అసహనాన్ని చూపిస్తోంది.
సెనేటర్ కోపానికి కారణమేంటి? సెనేటర్ ఎరిక్ ష్మిత్ సోషల్ మీడియా వేదికగా అమెరికా ఉద్యోగ మార్కెట్‌పై సుదీర్ఘమైన పోస్ట్‌లు చేశారు. ఇందులో భాగంగా చిలుకూరు బాలాజీ ఫోటోను షేర్ చేస్తూ.. ఈ వీసా కార్టెల్‌కు హైదరాబాద్‌లో ఒక వీసా టెంపుల్ కూడా ఉంది. వేలాది మంది భారతీయులు తమ పాస్‌పోర్టులను ఇక్కడ పూజ చేయించి, అమెరికా ఉద్యోగాల కోసం వీసాలు పొందుతున్నారు అని వ్యాఖ్యానించారు. అమెరికన్ కంపెనీలు స్థానికులను కాదని, తక్కువ జీతాలకే లభించే భారతీయ నిపుణులను ప్రోత్సహిస్తున్నాయని, ఈ వ్యవస్థ అంతా ఒక స్కామ్ అని ఆయన ఆరోపించారు.
భారతీయుల ప్రతిభే వారి భయమా?
సెనేటర్ వ్యాఖ్యల వెనుక కేవలం రాజకీయాలే కాకుండా, భారతీయ నిపుణులపై ఉన్న ఒక రకమైన అభద్రతా భావం స్పష్టంగా కనిపిస్తోంది. అమెరికాలోని టెక్ రంగంలో భారతీయులు సాధిస్తున్న విజయాలు, ముఖ్యంగా ఏఐ (AI) వంటి ఆధునిక సాంకేతికతల్లో భారతీయుల ఆధిపత్యం పెరగడం అమెరికన్ నేతల్లో ఆందోళన కలిగిస్తోంది. మెరిట్ పరంగా భారతీయులతో పోటీ పడలేక, ఇలాంటి వీసా కార్టెల్ అనే ముద్ర వేసి భారతీయ ప్రతిభను తక్కువ చేసే ప్రయత్నం చేస్తున్నారు.
ఆధ్యాత్మికతపై దాడి?
చిలుకూరు బాలాజీని వీసా కార్టెల్‌గా పేర్కొనడంపై భక్తులు తీవ్రంగా స్పందిస్తున్నారు. క్రైస్తవ మతంలో తమ కోరికల కోసం ప్రార్థనలు చేయడం ఎలా సహజమో, హిందువులు తమ ఇష్టదైవానికి మొక్కులు చెల్లించుకోవడం కూడా అంతే సహజమని నెటిజన్లు కౌంటర్ ఇస్తున్నారు. కేవలం వీసా కోసమే కాకుండా, శతాబ్దాల చరిత్ర కలిగిన ఈ పురాతన దేవాలయాన్ని ఒక మాఫియాతో పోల్చడం భారతీయుల విశ్వాసాలపై జరిగిన దాడిగా పలువురు అభివర్ణిస్తున్నారు.
అమెరికా రాజకీయాల్లో ఇండియా కార్డు
అమెరికాలో స్థానిక నిరుద్యోగితకు విదేశీయులే కారణమనే వాదనను తెరపైకి తెచ్చి ఓట్లు దండుకునేందుకు ఎరిక్ ష్మిత్ వంటి నేతలు ప్రయత్నిస్తున్నట్లు స్పష్టమవుతోంది. ముఖ్యంగా హెచ్-1బీ, ఎల్-1 వీసాల ద్వారా అమెరికా వెళ్లే వారిలో 70-80 శాతం భారతీయులే ఉండటం వల్ల, వీరిని లక్ష్యంగా చేసుకోవడం ద్వారా అమెరికన్ మధ్యతరగతి ప్రజల మద్దతు పొందవచ్చని వారి వ్యూహంగా కనిపిస్తోంది. ఒక పవిత్ర క్షేత్రాన్ని రాజకీయ వివాదాల్లోకి లాగడం వల్ల అమెరికా-భారత్ మధ్య ఉన్న దౌత్యపరమైన సంబంధాలపై ప్రభావం పడే అవకాశం ఉంది. ఏది ఏమైనా, భారతీయ ఐటీ రంగ నిపుణుల మేధస్సును తట్టుకోలేకే అమెరికన్ సెనేటర్లు ఇలాంటి అసహనపూరిత వ్యాఖ్యలు చేస్తున్నారని నెటిజన్లు ఘాటుగా సమాధానమిస్తున్నారు.
