US government shutdown: అమెరికా చరిత్రలో 15వసారి ప్రభుత్వ షట్‌డౌన్ మొదలైంది. ఆరేళ్ల తర్వాత 2018-19లో జరిగిన సుదీర్ఘ షట్‌డౌన్ తర్వాత మళ్లీ ఈ పరిస్థితి ఏర్పడిండి. అర్ధరాత్రి నుంచి ప్రారంభమైన ఈ షట్‌డౌన్, రాజకీయ పార్టీల మధ్య బిల్లులపై ఘర్షణ ఫలితంగా ఏర్పడింది. రిపబ్లికన్లు ప్రతిపక్ష డెమోక్రాట్ల డిమాండ్లను తిరస్కరించడంతో అత్యవసరం కాని ప్రభుత్వ సేవలు నిలిచిపోయాయి. దీంతో దాదాపు 9 లక్షల మంది ఫెడరల్ ఉద్యోగులకు జీతాలు అందలేదు. ఈ ఆర్థిక సంవత్సరం ప్రారంభమైన అక్టోబర్ 1 నుంచి ప్రభుత్వ నిధులకు ఆమోదం లభించకపోవడమే ప్రధాన కారణం. రిపబ్లికన్‌లకు ఆధిక్యం ఉన్న కాంగ్రెస్‌లో డెమోక్రాట్లు తమ కీలక డిమాండ్లు అయిన ఒ బామా కేర్, బీమా సబ్సిడీకు విస్తరణ, మెడికైడ్ కట్స్‌ను రద్దు చేయడం, విదేశీ సహాయం , పబ్లిక్ బ్రాడ్‌కాస్టింగ్‌కు 9 బిలియన్ డాలర్ల కట్స్‌ను వెనక్కి తీసుకోవడం వంటివి నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఇవి మొత్తంగా 1 ట్రిలియన్ డాలర్లకు సమానమైనవి.
హౌస్ స్పీకర్ మైక్ జాన్సన్ నేతృత్వంలో రిపబ్లికన్లు నవంబర్ 21 వరకు నిధులను విస్తరించే బిల్లును ఆమోదించారు, కానీ సెనెట్‌లో డెమోక్రాట్లకు బలం ఉండటంతో అది విఫలమైంది. సెప్టెంబర్ 29న డొనాల్డ్ ట్రంప్‌తో జరిగిన సమావేశం కూడా ఫలితం ఇవ్వలేదు. ట్రంప్ ప్రభుత్వం విదేశీ సహాయానికి మరో 5 బిలియన్ డాలర్ల 'పాకెట్ రెసిషన్'ను రద్దు చేయాలని ప్రతిపాదించడం మరింత ఉద్రిక్తతను పెంచింది. అధ్యక్ష డొనాల్డ్ ట్రంప్ డెమోక్రాట్లను పిచ్చివాళ్లు అని విమర్శించి, ఏఐ-జనరేటెడ్ వీడియోల ద్వారా డెమెక్రాట్లను టార్గెట్ చేశారు. మిలిటరీ, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ వంటి అత్యవసరాలు కొనసాగుతాయి, కానీ చెల్లింపులు ఆలస్యమవుతాయి. సోషల్ సెక్యూరిటీ, మెడికేర్ లబ్ధిదారులకు ప్రయోజనాలు కొనసాగుతాయి, కానీ ఆఫీసులు పరిమితంగా పని చేస్తాయి. ఒబామా కేర్ సబ్సిడీలు ఆగితే 2 కోట్ల మంది బీమా ధరలు పెరుగుతాయి, 1 కోట్ల మంది ఆరోగ్య సేవలు కోల్పోతారు.
వెంటనే పెద్ద ఆర్థిక నష్టం లేకపోయినా, ప్రతి వారానికి ఆర్థిక వృద్ధి 0.1 నుంచి 0.2 పాయింట్లు తగ్గొచ్చు. మార్కెట్లు, ప్రజల విశ్వాసం దెబ్బతింటాయి. 2018-19 షట్‌డౌన్ 35 రోజులు జరిగి, చరిత్రలో అత్యంత సుదీర్ఘమైందనదిగా రికార్డు సృష్టించింది. అప్పట్లో కూడా ట్రంప్ అధ్యక్షుడుగా ఉన్నారు.
ప్రస్తుతం రాజీ సూచనలు లేవు. షట్‌డౌన్ ఎంతకాలం కొనసాగుతుందో అనిశ్చితి. మార్చి 2025లో ఒక షట్‌డౌన్‌ను నివారించినా, ఈసారి టారిఫ్‌లు, మార్కెట్ అనిశ్చితి మరింత తీవ్రతను పెంచుతున్నాయి. ఈ షట్‌డౌన్ అమెరికా ఆర్థిక వ్యవస్థ, ప్రజల జీవనాలపై దీర్ఘకాలిక ప్రభావం చూపొచ్చని అంచనా వేస్తున్నారు.