మనీలా: ఫిలిప్పీన్స్ లో మరోసారి భారీ భూకంపం సంభవించింది. మంగళవారం (సెప్టెంబర్ 30, 2025) నాడు మధ్య ఫిలిప్పీన్స్ లో 6.9 తీవ్రతతో బీభత్సం సృష్టించింది. ఈ భారీ భూకంపం సంభవించిన ఘటనలో 31 మంది మరణించారు. స్థానిక మీడియా నివేదికల ప్రకారం DZMM రేడియో ద్వారా ఈ సమాచారం అందింది. యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే (USGS) ప్రకారం, దాదాపు 90,000 జనాభా కలిగిన తీరప్రాంత సిటీ బోగోకు దాదాపు 17 కిలోమీటర్ల ఈశాన్య దిశలో భూకంప కేంద్రం ఉంది. భూకంపం కారణంగా పట్టణాలు, పలు గ్రామాలలో భారీ నష్టం జరిగింది.
బోగోలో కనీసం 14 మంది మృతిభూకంపం వల్ల అత్యంత ప్రభావితమైన ప్రాంతాలలో ఒకటైన బోగో ఒకటి. ఆ నగరంలో 14 మంది పౌరులు మరణించినట్లు సమాచారం. అయితే, రెస్క్యూ ఆపరేషన్లు కొనసాగుతున్నందున మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. కొండ ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడటంతో అనేక ఇండ్లు, గుడిసెలు కూలిపోయాయి. దాంతో ఆ ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టడానికి రెస్క్యూ సిబ్బందికి కష్టమవుతోంది. తీవ్రంగా శ్రమించి కొన్నిచోట్ల రెస్క్యూ టీమ్ సహాయక చర్యలు కొనసాగిస్తోంది.
విపత్తు నిర్వహణ అధికారి గ్లెన్ ఉర్సల్ అసోసియేటెడ్ ప్రెస్‌తో మాట్లాడుతూ.. బోగో ప్రాంతంలో భూకంపం వల్ల భారీగా నష్టం వాటిల్లింది. కొన్నిచోట్ల కొండ చరియలు విరిగి ఇండ్ల మీద పడటంతో ప్రాణ నష్టం మరింత పెరిగే అవకాశం ఉంది. రెస్క్యూ టీమ్ తీవ్రంగా శ్రమించి సహాయక చర్యలు కొనసాగిస్తోంది. శిథిలాల కింద చిక్కుకున్న వారిని బయటకు తీసేందుకు చర్యలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా బ్యాక్‌హోతో సహా భారీ యంత్రాలను తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు.
రెమిగియోలో ఆరుగురు మృతిడిప్యూటీ మేయర్ ఆల్ఫీ రెన్స్ ప్రకారం, సమీపంలోని నగరం సాన్ రెమిగియోలో 6 మంది మరణించినట్లు నిర్ధారించారు. వీరిలో ముగ్గురు కోస్ట్ గార్డ్ సిబ్బంది, 1 అగ్నిమాపక సిబ్బంది, 1 చిన్నారి ఉన్నారు. DZMM రేడియోతో మాట్లాడుతూ.. తక్షణ సహాయం కోసం ఆయన విజ్ఞప్తి చేశారు. రెన్స్ మాట్లాడుతూ, మా నీటి సరఫరా వ్యవస్థ, విద్యుత్ సరఫరాకు ఆటంకం తలెత్తుతున్నాయి. ప్రజలకు ఆహారం, తాగునీరు అవసరం అన్నారు.
అగ్నిమాపక సిబ్బందికి గాయాలుబోగోలో ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం.. తీవ్ర భూకంపం కారణంగా గోడలు, ఇళ్ళు, రోడ్లు దెబ్బతిన్నాయని చెప్పారు. అగ్నిమాపక సిబ్బంది రే కేటే మాట్లాడుతూ.. భూకంప తీవ్రత చూసి తాను, సహచరులు ఎంతలా ఆశ్చర్యపోయారో వివరించారు. మేము రోజు మా బ్యారక్స్‌లో ఉన్నాము, అదే సమయంలో భూమి కంపించింది. మేం వెంటనే ప్రాణభయంతో బయటకు పరుగులు తీశాం. కాని తీవ్రమైన ప్రకంపనల కారణంగా పడిపోవడంతో చాలా మందికి గాయాలయ్యాయి. అగ్నిమాపక కేంద్రం గోడ కూలిపోయిందని, అందువల్ల సిబ్బంది గాయపడ్డారని చెప్పారు.