Federal Court Blocks Donald Trump Order On Birthright Citizenship: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు (Donald Trump) బిగ్ షాక్ తగిలింది. వలస వచ్చిన వారికి అమెరికా గడ్డపై పిల్లలు పుడితే.. ఆ చిన్నారులకు సహజంగా వచ్చే పౌరసత్వ హక్కును (Birthright Citizenship) ట్రంప్ రద్దు చేయగా.. ఈ ఆదేశాలను సియాటెల్ ఫెడరల్ కోర్టు తాత్కాలికంగా నిలిపేసింది. ట్రంప్ నిర్ణయం రాజ్యాంగ విరుద్ధమని పేర్కొన్నారు. ఈ నెల 20న అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు స్వీకరించిన వెంటనే పలు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లు జారీ చేశారు. వాటిలో పారిస్ ఒప్పందం సహా డబ్ల్యూహెచ్‌వో నుంచి వైదొలగడం, ప్రభుత్వ ఉద్యోగుల ఇంటి నుంచి పని విధానాన్ని రద్దు చేయడం, ప్రభుత్వ నియామకాలపై నిషేధం, క్యాపిటల్ హిల్‌పై దాడి చేసిన వారికి క్షమాభిక్ష పెట్టడం, వలస వచ్చిన వారి పిల్లలకు జన్మతః వచ్చే పౌరసత్వ రద్దు నిర్ణయం వంటివి ఉన్నాయి.
ట్రంప్ నిర్ణయాన్ని పలు రాష్ట్రాలు తీవ్ర వ్యతిరేకించాయి. ఆ ఆదేశాలు చెల్లవని 22 రాష్ట్రాలు లా సూట్స్ దాఖలు చేశాయి. రాజ్యాంగాన్ని ఉల్లంఘించి అధ్యక్షుడు ఆదేశాలు ఇచ్చారని వాటిని అమలు చేయడానికి లేదని లా సూట్స్‌లో పేర్కొన్నాయి. అమెరికా రాజ్యాంగం 14వ సవరణ ప్రకారం.. పౌరసత్వ చట్టం నిబంధనలకు ట్రంప్ ఆదేశాలు వ్యతిరేకమని వాదించాయి. అమెరికాలో ఎవరు పుట్టినా అమెరికా వారసత్వం లభించడం అనేది రాజ్యాంగపరంగా వచ్చిన హక్కు. దాన్ని ఎవరూ కాదనలేరని న్యాయవాదులు కోర్టులో వాదించారు. ఏ దేశానికి అయినా రాజ్యాంగమే ఫైనల్ అని.. అమెరికా రాజ్యాంగాన్ని అత్యంత పకడ్బందీగా రూపొందించారు. దీంతో సియాటెల్ డిస్ట్రిక్ట్ జడ్జ్ జాన్ కాఫ్నర్.. జన్మతః పౌరసత్వ రద్ద ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ తాత్కాలికంగా నిలుపుదల చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు.
అసలేంటి "బర్త్ సిటిజెన్ షిప్"?
అమెరికన్ లా ప్రకారం వేరే దేశపు తల్లిదండ్రులకు అమెరికాలో పిల్లలు పుడితే ఆ పిల్లలు ఆటోమేటిక్‌గా అమెరికన్ పౌరులుగానే గుర్తించబడతారు. భారతదేశానికి సంబంధించిన చాలామంది తల్లిదండ్రులకు పుట్టిన పిల్లలు అలానే అమెరికన్ పౌరులుగా జీవిస్తున్నారు. ఆ పిల్లలు పెద్దైన తర్వాత వారి అనుమతితో తల్లిదండ్రులు కూడా సిటిజన్షిప్ తీసుకుంటారు. అయితే మొదటి నుంచి 'అమెరికా ఫస్ట్' నినాదంతో జాతీయ భావాల ఆధారంగా రాజకీయాలు చేస్తున్న డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు ఆ పద్ధతికి చెక్ పెట్టేశారు. అమెరికాలో పుట్టినంత మాత్రాన వేరే దేశపు తల్లిదండ్రుల పిల్లలు అమెరికన్లు అయిపోరు అంటూ సంచలనాత్మక నిర్ణయం తీసుకున్నారు. దీనికి సంబంధించి బాధ్యతలు స్వీకరించిన వెంటనే చిన్నారులకు సహజంగా వచ్చే పౌరసత్వ హక్కును రద్దు చేస్తూ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ జారీ చేశారు. ఈ ఆదేశాలతో అక్కడి భారతీయులతో పాటు, యూఎస్‌కు వలస వెళ్లిన వారిలో తీవ్ర ఆందోళన కలిగించాయి. ఫిబ్రవరి 20 తర్వాత పుట్టిన వారికి సిటిజన్ షిప్ రాదనే ట్రంప్ నిర్ణయంతో కొందరు ముందుగానే డెలివరీలు చేయించుకునేందుకు ఆస్పత్రులకు పరుగులు తీశారు. అయితే, ట్రంప్ ఆదేశాల నిలిపివేతతో భారతీయులు సహా వలస వెళ్లిన వారికి బిగ్ రిలీఫ్ దక్కినట్లయింది.
Also Read: Bill Gates : నాలుగో తరగతిలో బిల్ గేట్స్ రాక్స్ - టీచర్ షాక్స్ - ఆవు మూత్రపిండాలు తీసుకెళ్లాడట మరి !