Russia-Ukraine War: రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమై ఏడు నెలలు దాటింది. ఉక్రెయిన్ పై రష్యా తన దాడులను తీవ్రతరం చేసింది. ఇదిలా ఉండగా, యుద్ధం ప్రారంభ సమయంలో ఉత్తర ఉక్రెయిన్‌లో మానవ హక్కుల ఉల్లంఘనకు రష్యా దళాలే కారణమని ఐక్యరాజ్యసమితి ఆరోపించింది. రష్యా సాయుధ దళాల ఆధీనంలో ఉన్న ప్రాంతాల్లో చట్టవ్యతిరేక నిర్బంధం, చిత్రహింసలు, వేధింపులు, అత్యాచారం, ఇతర లైంగిక హింస అంతా ఇంతా కాదంటూ చెప్పుకొచ్చింది. ఉక్రెయిన్‌పై స్వతంత్ర ఇంటర్నేషనల్ కమిషన్ ఆఫ్ ఎంక్వైరీకి చెందిన ముగ్గురు సభ్యుల నివేదికను ఐక్యరాజ్యసమితి మంగళవారం (అక్టోబర్ 18) బహిర్గతం చేసింది. 


హద్దులు దాటిన రష్యన్ దళాలు


ఉక్రెయిన్‌లోని రష్యన్ సైనికులు పౌరులపై వివిధ రకాల వేధింపులకు పాల్పడుతున్నారని విచారణ కమిషన్ తన నివేదికలో పేర్కొంది. కమిషన్ తన నివేదికలో రష్యన్ సైన్యం ఉక్రేనియన్ పౌరులపై జరిగిన దౌర్జన్యాల గురించి అనేక ఉదాహరణలు కూడా ఇచ్చింది. కీవ్ ప్రాంతానికి చెందిన నాలుగేళ్ల బాలుడిని రష్యా సైనికుడు బలవంతంగా లొంగదీసుకున్నాడని కమిషన్ తెలిపింది. ఈ నివేదికలో అత్యాచార కేసులకు సంబంధించిన అనేక సంఘటనలు ప్రస్తావించింది. బాధితుల వయస్సు నాలుగు నుంచి 80 సంవత్సరాల మధ్య ఉన్నట్లు నివేదించింది. 


రష్యాలో లైంగిక వేధింపుల ఆరోపణలు


ఉక్రేనియన్ అధికారులు, హక్కుల సంఘాలు, ఐక్యరాజ్యసమితి గతంలో మాస్కో లైంగిక దాడిని యుద్ధ వ్యూహంగా ఉపయోగిస్తోందని పేర్కొన్నాయి. రష్యన్ సైనికులు నిర్మానుష్యమైన ప్రా౦త౦లోని స్త్రీలు, బాలికలను తమ ఇళ్ళ ను౦చి బలవ౦త౦గా తీసుకువెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు. చాలా సందర్భాల్లో, ఈ సంఘటనలు బాధితుల బంధువుల ముందే జరిగాయి. మహిళలు, పురుషులు, బాలికలపై లైంగిక హింసకు సంబంధించిన ఇతర సంఘటనలు కూడా  వెలుగు చూశాయి. 


పౌరులపై విచక్షణారహితంగా కాల్పులు


రష్యా సైన్యం కూడా యుద్ధ నేరాలకు పాల్పడిందని, ఇద్దరు వ్యక్తులను కాల్చి చంపి గాయపరిచిన లేదా చిత్రహింసలకు గురిచేసినట్లు కమిషన్ తెలిపింది. ఫిబ్రవరి 24న యుద్ధం ప్రారంభమైన తర్వాత రష్యా దళాలు తాము ఆక్రమించుకునేందుకు ప్రయత్నిస్తున్న ప్రాంతాలపై విచక్షణారహితంగా కాల్పులు జరిపాయి. రష్యన్ సైన్యం తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్న పౌరులపై దాడి చేసింది. ప్రాణనష్టం, ఆస్తి నష్టం వేలల్లో జరిగిందని కమిషన్ అధ్యక్షుడు ఎరిక్ మోస్సే ఒక ప్రకటనలో తెలిపారు. మౌలిక సదుపాయాల విధ్వంసం వినాశకరమైనది. 2022 ఫిబ్రవరి, మార్చి నెలల్లో ఉక్రెయిన్లోని కీవ్, చెర్నిహివ్, ఖార్కివ్, సుమీ ప్రాంతాల్లో జరిగిన సంఘటనలను ఈ నివేదిక కవర్ చేసింది.