ప్రపంచమంతా ఎంతో ఉత్కంఠగా ఎదురుచూసిన ఉక్రెయిన్‌- రష్యా మధ్య చర్చలు ముగిశాయి. బెలారస్ లో ఇరుదేశాల ప్రతినిధులు సుమారు 4 గంటలపాటు చర్చించారు. తక్షణమే కాల్పుల విరమణ పాటించాలని ఉక్రెయిన్‌ రష్యాను డిమాండ్‌ చేసింది. గతంలో ఆక్రమించుకున్న క్రిమియా, డాన్​బాస్​ల నుంచి రష్యా బలగాలను వెనక్కి తీసుకోవాలని స్పష్టం చేసింది. నాటోలో చేరబోమని రాతపూర్వకంగా హామీ ఇవ్వాలని రష్యా డిమాండ్ చేసింది. పలు ఒప్పందాలకు ఆమోదం తెలపాలని రష్యా పట్టుబట్టింది. చర్చలు అసంపూర్తిగానే జరిగాయని తెలుస్తోంది.  


ముగిసిన ఉక్రెయిన్-రష్యా చర్చలు 


రష్యా, ఉక్రెయిన్‌ మధ్య యుద్ధం ముగిసే దిశగా మొదటి అడుగు పడింది. బెలారస్‌ సరిహద్దుల్లోని ఉక్రెయిన్‌ భూభాగంలో రష్యా-ఉక్రెయిన్ ప్రతినిధులు చర్చలు జరిపారు. చర్చలకు ముందు రష్యా, ఉక్రెయిన్‌ తమ డిమాండ్లను తెలిపాయి. తమ అభ్యంతరాల పరిష్కారంపై హామీ ఇవ్వాలని రష్యా స్పష్టం చేసింది. రష్యా తక్షణమే తమ భూభాగం నుంచి వెళ్లిపోవాలని, ఆయుధాలను వదిలి కాల్పుల విరమణ అమలు చేయాలని ఉక్రెయిన్ తేల్చిచెప్పింది. ఈ చర్చల్లో  రెండు దేశాల ప్రతినిధులు ఇవే అంశాలను ప్రస్తావించారు. గత ఐదు రోజులుగా ఉక్రెయిన్‌ లో బాంబులు మోత మోగిపోతుంది. అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. 


యూఏఎన్ సమావేశం 


ఉక్రెయిన్​ పై రష్యా యుద్ధం నేపథ్యంలో ఐక్యరాజ్య సమితి 11వ అత్యవసర సర్వసభ సమావేశం ఏర్పాటుచేసింది. ఉక్రెయిన్ ​లో తాజా పరిస్థితులు భవిష్యత్తు కార్యాచరణపై ఈ సమావేశం సభ్య దేశాలు చర్చిస్తున్నాయి. ఉక్రెయిన్ ​పై జరుపుతున్న దాడులను రష్యా వెంటనే ఆపాలని ఐక్యరాజ్య సమితి చీఫ్​ ఆంటోనియో గుటెరస్​ కోరారు. రష్యా సైనికులు తమ ప్రాంతాలకు తిరిగి వెళ్లాలని ఆయన సూచించారు. రష్యా న్యూక్లియర్ దళాలను అప్రమత్తం చేయటం సరైన చర్య కాదన్నారు. అణ్వాయుధాలను వినియోగించాలన్న ఆలోచన ఊహించలేనిదన్నారు. 


శాంతి చర్చల సమయంలోనూ దాడులు


రష్యా యుద్ధాన్ని ఆపడానికి వ్లాదిమిర్ పుతిన్‌పై ఒత్తిడి తీసుకురావాలని ఉక్రెయిన్​ తన భాగస్వామ దేశాలను విజ్ఞప్తి చేస్తుంది. మొదటి రౌండ్ శాంతి చర్చలు నిర్వహిస్తున్న సమయంలోనూ ఉక్రెయిన్ లో కాల్పులు, బాంబు దాడులు జరిగాయని ఆ దేశ ప్రతినిధులు తెలిపారు. ఈ యుద్ధం కారణంగా 4 లక్షల మందికి పైగా ఉక్రెనియన్లు శరణార్థులుగా మారారన్నారు. పరిస్థితులు ఇలానే సాగితే 70 లక్షలకు మంది శరణార్థులుగా మారే ప్రమాదం ఉందన్నారు. దాడులు ఆపేసి వెనక్కి వెళ్లిపోయి ప్రాణాలు కాపాడుకోవాలని రష్యా సైనికులను ఉక్రెయిన్​ అధ్యక్షుడు వొలొదిమిర్​ జెలెన్​స్కీ హెచ్చరించారు. 


36 దేశాల విమానాలపై రష్యా ఆంక్షలు


రష్యాపై ఆంక్షలకు దీటుగా చర్యలు స్పందిస్తుంది. బ్రిటన్, జర్మనీ సహా 36 దేశాలకు చెందిన విమానాలను నిషేధిస్తున్నట్లు రష్యా ప్రకటించింది. ఉక్రెయిన్ పై దాడి కారణంగా యూరోపియన్ యూనియన్ రష్యా విమానాలపై ఆంక్షలు విధించింది.