UK Air Traffic Control: బ్రిటన్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ నెట్‌వర్క్ వ్యవస్థలో తలెత్తిన సాంకేతిక సమస్యతో యూకే గగనతలం మూసివేయాల్సి వచ్చింది. కంప్యూటర్లలో సాంకేతిక సమస్య వల్ల ఈ పరిస్థితి తలెత్తింది. గగనతలంలో విహరించాల్సిన విమానాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. విమానాల రాకపోకలకూ తీవ్ర అంతరాయం ఏర్పడింది. విమానాలు ఎక్కడివక్కడే నిలిచి పోవడంతో గంటల పాటు ప్రయాణాలు వాయిదా పడ్డాయి. విమానాల్లో చిక్కుకున్న వారు, విమానాల్లో ప్రయాణించాల్సిన వాళ్లు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. 


సాంకేతిక కారణం వల్ల ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ నెట్‌వర్క్‌ వ్యవస్థ పని చేయడం లేదని బ్రిటన్ జాతీయ ఎయిర్ ట్రాఫిక్ సర్వీస్ (NATS) ప్రతినిధి ఒకరు మీడియాతో తెలిపారు. ట్రాఫిక్ కంట్రోల్ నెట్‌వర్క్‌ లోనే సమస్య రావడంతో.. విమానాల రాకపోకలపై ఆంక్షలు విధించినట్లు తెలిపారు. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ నెట్‌వర్క్‌్ ఫెయిల్ నేపథ్యంలో తమ సర్వీసులకు అంతరాయం ఏర్పడినట్లు బ్రిటన్ కు చెందిన పలు విమానయాన సంస్థలు ప్రకటన విడుదల చేశాయి. వీలైనంత త్వరగా సమస్య నుంచి బయట పడేందుకు ప్రయత్నిస్తున్నట్లు అధికారులు తెలిపారు.


బ్రిటన్ సమస్యల ప్రభావం యూరోప్ అంతటా విమానాలపై పడింది. సాంకేతిక సమస్య కారణంగా అనేక విమానాలు ఆలస్యం అయ్యాయి. లండన్ లూటన్ విమానాశ్రయం, బర్మింగ్‌హామ్ విమానాశ్రయం ఎప్పటికప్పుడు బ్రిటన్ NATS తో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిపాయి. సాంకేతిక సమస్య పరిష్కారం అయితే గానీ విమానాలు గాల్లోకి ఎగరలేని పరిస్థితి. సాంకేతిక సమస్య వల్ల స్కాటిష్ విమానయాన సంస్థ లోగనైర్, ఈజీ జెట్ విమానాలు ఆలస్యంగా నడుస్తాయని తమ ప్రయాణికులకు సోషల్ మీడియా వేదికగా ముందస్తు సమాచారాన్ని పంచుకున్నాయి. 


ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ వ్యవస్థలో సమస్య వల్ల ప్రస్తుతానికి బ్రిటన్ వ్యాప్తంగా విమానాల ల్యాండింగ్ కు మాత్రమే అనుమతి ఇస్తున్నారు. విమానాల టేకాఫ్ లను అనుమతించడం లేదు. బ్రిటన్ లో వచ్చిన సమస్య ప్రభావం ఇతర దేశాలపై, వేలాది మంది ప్రయాణికులపై పడింది. లాంగ్ వీకెండ్ కావడం వల్ల విదేశాలకు వెళ్లిన చాలా మంది తిరిగి రావడానికి, విదేశాలకు వెళ్లడానికి తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యకు కారణాన్ని కూడా ఇంకా గుర్తించలేకపోతున్నట్లు తెలుస్తోంది.