UAE Visa Ban 9 Countries: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) 2026 నుంచి ఆఫ్రికా, ఆసియా దేశాల్లోని 9 దేశాల పౌరులకు కొత్త టూరిస్ట్ , వర్క్ వీసాలు జారీ చేయడాన్ని నిలిపివేసింది.  అఫ్ఘానిస్తాన్, బంగ్లాదేశ్, లిబయా, యెమెన్, సోమాలియా, లెబనాన్, కెమరూన్, సుడాన్, ఉగాండా దేశాల పౌరులకు ఇక యూఏఈ వీసాలు ఇవ్వరు.  భద్రతా ఆందోళనలు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, కోవిడ్-19 తర్వాత ఆరోగ్య నిబంధనలు కారణంగా తీసుకున్నట్టు యుఏఈ మీడియా రిపోర్టులు సూచిస్తున్నాయి.       

 UAE ఇమ్మిగ్రేషన్ డిపార్ట్‌మెంట్ ఒక   సర్క్యులర్ జారీ చేసింది. ఈ సర్క్యులర్ ప్రకారం, పైన పేర్కొన్న 9 దేశాల నుంచి కొత్త వీసా అప్లికేషన్లు ప్రాసెస్ చేయవద్దని.. ఇది 2026 జనవరి 1 నుంచి అమలులోకి వస్తుందని తెలిపింది. ఈ నిర్ణయం 'ఆపరేషన్ 2026 వీసా స్ట్రాటజీ'లో భాగంగా జరిగినట్టు తెలుస్తోంది. 

ఈ ఆంక్షలు టూరిస్ట్ వీసాలు, వర్క్ పర్మిట్లు, బిజినెస్ వీసాలపై మాత్రమే వర్తిస్తాయి. ఇప్పటికే వాలిడ్ వీసాలు ఉన్నవారు UAEలో ఉండటం, పని చేయటం, ప్రవేశించటం కొనసాగవచ్చు. అయితే, వీసా రెన్యూవల్స్, కొత్త ఉద్యోగాలకు అప్లై చేయడంలో  ఈ దేశాల వారిని పరిగణనలోకి తీసుకోకపోవచ్చని అంచనా వేస్తున్నారు.  పాకిస్తాన్, టర్కీ వంటి ఇతర దేశాల పౌరులపై కూడా ఇలాంటి పార్షియల్ ఆంక్షలు ఉన్నాయి, కానీ పాకిస్తాన్ ఈ 9 దేశాల జాబితాలో లేదు.

అఫ్ఘానిస్తాన్, యెమెన్, సోమాలియా, లిబయా, సుడాన్ వంటి దేశాల్లో ఉగ్రవాదం, యుద్ధాలు, అస్థిరతలు UAE ఇమ్మిగ్రేషన్‌ను ప్రభావితం చేస్తున్నాయి. ఈ దేశాల నుంచి వచ్చే పౌరులు భద్రతకు రిస్క్‌గా భావిస్తున్నారు.   కోవిడ్-19 మహమ్మారి తర్వాత, బంగ్లాదేశ్, కెమరూన్, ఉగాండా వంటి దేశాల్లో ఆరోగ్య పరిస్థితులు ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ ఆంక్షలు ఆరోగ్య ప్రోటోకాల్స్‌లో భాగంగా తీసుకున్నవిగా కనిపిస్తున్నాయి.                                           

అనూహ్యంగా బంగ్లాదేశ్ పౌరులను కూడా నిషేధించడం ఆ దిగజారిపోయిన ఆ దేశం పరిస్థితిని తెలియచేస్తోంది. ఇప్పటి వరకూ  కల్లోలిత దేశాల పరిధిలో బంగ్లాదేశ్ ఉండేది కాదు. కానీ ఇప్పుడు ఆ దేశ పౌరులకు ఇతర దేశాలు వీసాలివ్వని పరిస్థితి నెలకొంది.