Afghan Teen Hiding In Plane Landing Gear Found Alive In Delhi:    అఫ్ఘానిస్తాన్‌లోని కాబూల్ నుంచి ఢిల్లీకి ఓ విమానం వచ్చింది. ల్యాండ్ అయిన తర్వాత .. విమానం ల్యాండింగ్ గేర్  అంటే.. చక్రం ఉండే బాక్స్ వద్ద ఏదో తేడాగా ఉందని చూశారు. అక్కడ ఓ పదమూడేళ్ల బాలుడు ఉన్నాడు.  అందులో దాక్కుని కాబూల్ నుంచి ఇండియాకు వచ్చేశాడు. ఎయిర్ పోర్టు అధికారులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. 

ఇలా ఎందుకు వచ్చావురా అంటే.. అలా ప్రయాణించవచ్చా లేదా అన్న ఆసక్తితో ప్రయత్నించానని.. తీరా ఇండియాలో పడ్డానని చెప్పుకొచ్చాడు. ఢిల్లీ ఇండిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో (IGI) అతన్ని కనుగొనిన వెంటనే, భద్రతా అధికారులు అతన్ని తిరిగి అఫ్ఘానిస్తాన్‌కు పంపేశారు. నిజానికి వీల్ వెల్ లో ఉండి ప్రయాణం చేయడం అత్యంత ప్రమాదకరం.  బతికి ఉండే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి.  అఫ్ఘానిస్తాన్‌లోని ఉత్తర ప్రాంతంలోని కుందుజ్ నగరానికి చెందిన ఈ 13 ఏళ్ల బాలుడు తన కుటుంబంలో ఎవరికీ చెప్పకుండా  కాబూల్ హమీద్ కర్జాయి అంతర్జాతీయ విమానాశ్రయానికి ఒక్కడే చేరుకున్నాడు. అతను ఇండియా రావాలనుకోలేదు. ఇరాన్ వెళ్లాలనుకున్నాడట.   అయితే, గందరగోళంలో అతను తప్పు విమానాన్ని ఎంచుకున్నాడు – కామ్ ఎయిర్ (Kam Air) ఎయిర్‌లైన్స్ RQ-4401 ఫ్లైట్‌ ఇరాన్ వెళ్తుందనుకుని వీల్ వెల్ లో కూర్చున్నాడు. కానీ  ఇది కాబూల్ నుంచి ఢిల్లీకి  వచ్చింది. 

కాబూల్ లోని హమీద్ కర్జాయి విమానాశ్రయంలోకి  దాక్కుని ప్రయాణికుల మధ్యలో కలిసిపోయి, అతను ఎయిర్‌ప్లేన్‌లోని రియర్ సెంట్రల్ ల్యాండింగ్ గేర్ కంపార్ట్‌మెంట్‌లో రియర్ వీల్ వెల్ దాక్కుకున్నాడు. ఈ ప్రదేశం చాలా ప్రమాదకరమైనది – ఎయిర్‌ప్లేన్ ఎగరుతున్నప్పుడు ఆక్సిజన్ లేకుండా, చీకటి , మైనస్ 50 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటుంది. అలాంటి చోట కాసేపు ఉన్నా చనిపోతారు. కానీ అతను అన్నింటినీ తట్టుకున్నాడు.  ఈ ఫ్లైట్ ఏర్‌బస్ A340 మోడల్‌తో  కావడంతో..  కాబూల్ నుంచి ఢిల్లీకి  94 నిమిషాల్లో వచ్చింది. 

సెప్టెంబర్ 22, 2025 ఆదివారం ఉదయం 10:20 గంటల సమయంలో RQ-4401 ఫ్లైట్ IGI విమానాశ్రయంలో ల్యాండ్ అయ్యింది. ల్యాండింగ్ తర్వాత, ఎయిర్‌లైన్ సిబ్బంది ఎయిర్‌ప్లేన్ సమీపంలో ఒక బాలుడిని తిరుగుతున్నట్టు గమనించారు. వెంటనే భద్రతా అధికారులకు సమాచారం అందింది. సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) సిబ్బంది అతన్ని అరెస్ట్ చేసి, ప్రాథమిక ఆరోగ్య పరీక్షలు చేశారు.   బాలుడు ఎలాంటి తీవ్రమైన గాయాలు లేకుండా, స్థిరమైన ఆరోగ్యంతో ఉన్నాడు .                విచారణ పూర్తయిన వెంటనే, ఫార్మల్ ప్రొసీజర్లు పాటించి, బాలుడిని అదే రోజు మధ్యాహ్నం 12:30 గంటలకు కామ్ ఎయిర్ RQ-4402 రిటర్న్ ఫ్లైట్‌లో కాబూల్‌కు పంపేశారు. ఇమ్మిగ్రేషన్ రూల్స్ ప్రకారం, అతను అక్రమ ప్రవేశించిన వ్యక్తి.  ఈ డిపోర్టేషన్ తర్వాత, బాలుడి కుటుంబం లేదా అఫ్ఘాన్ అధికారులతో సంప్రదింపులు జరిగాయా అనేది స్పష్టంగా తెలియలేదు.