H-1B  Visa Fees Hike In America: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ H-1B వీసాకు సంబంధించి తీసుకున్న నిర్ణయం భారత్‌లో ఐటీ రంగంపై ప్రభావం చూపుతోంది. ఇప్పుడు H-1B వీసాపై ఏదైనా కంపెనీ విదేశీ ఉద్యోగిని అమెరికాకు తీసుకువస్తే, వారి పేరిట 100,000 అమెరికన్ డాలర్ల ఫీజు చెల్లించాలి. అయితే, ఇంతకు ముందు ఈ వీసా కోసం దాదాపు 5 లక్షల రూపాయలు ఖర్చయ్యేది. ఇప్పుడు ట్రంప్ ప్రభుత్వం దానిని ఏకంగా రూ.88 లక్షలకు పెంచేసింది. అదే సమయంలో అమెరికాలోని 2 ప్రముఖ కంపెనీలు తమ కంపెనీలో ఇద్దరు భారతీయులకు సీఈవోగా పదోన్నతి కల్పించడం అందరినీ ఆశ్చర్యపరిచాయి. వీరిలో ఒకరు శ్రీనివాస్ 'శ్రీని' గోపాలన్. మరొకరు రాహుల్ గోయల్‌. ట్రంప్ నిర్ణయాలకు అమెరికా కంపెనీలు భయపడేది లేదని ఈ తాజా మార్పులు స్పష్టం చేస్తున్నాయి.

Continues below advertisement

ఎవరీ శ్రీనివాస్ గోపాలన్..  

IIM- అహ్మదాబాద్‌లో చదుకున్న శ్రీనివాస్ ప్రస్తుతం టెలికాం రంగంలో దిగ్గజ అమెరికన్ కంపెనీ T-Mobile COO (చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్) గా సేవలు అందిస్తున్నారు. ఇటీవల జరిగిన పదోన్నతిలో భాగంగా 55 ఏళ్ల శ్రీనివాసన్ ను సీఈవోగా నియమించారు. నవంబర్ 1న శ్రీనివాస్ గోపాలన్ T-Mobile కొత్త CEO (చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్)గా బాధ్యతలు చేపడతారు. 2020 నుండి కంపెనీని నిర్వహిస్తున్న మైక్ సీవర్ట్ స్థానంలోకి శ్రీనివాసన్ వస్తారు.

మైక్ ఇప్పుడు కంపెనీ కొత్త వైస్ ఛైర్మన్ స్థానంలో కొనసాగుతారు. శ్రీనివాసన్ లింక్డ్‌ఇన్‌లో ఒక పోస్ట్ ద్వారా ఈ విషయంపై కంపెనీకి కృతజ్ఞతలు తెలిపారు. అతను ఇలా రాసుకొచ్చారు. "T-Mobile తదుపరి CEO కావడం చాలా గౌరవంగా ఉంది. నేను చాలా కాలం నుంచి కంపెనీ సాధించిన విజయాలను చూసి ఆశ్చర్యపోతున్నాను.  వినియోగదారులకు సేవ అందించడానికి సిద్ధంగా ఉన్నాను" అని పోస్ట్ చేశారు.

Continues below advertisement

గోపాలన్ పేరు మీద అనేక విజయాలు 

గోపాలన్ హిందుస్థాన్ యూనిలీవర్లో మేనేజ్‌మెంట్ ట్రైనీగా కెరీర్ ప్రారంభించారు. ఆ తర్వాత భారతి ఎయిర్‌టెల్ (Airtel), వోడాఫోన్, క్యాపిటల్ వన్, డాయిష్ టెలికాం వంటి అనేక పెద్ద కంపెనీలలో కీలక పదవుల్లో పనిచేశారు. ఈ క్రమంలో అనేక పెద్ద విజయాలను సాధించాడు. ఈ కంపెనీల్లో పనిచేస్తూ, అతను లక్షలాది ఇళ్లకు ఫైబర్ నెట్‌వర్క్‌ను అందించిన ఘనత దక్కించుకున్నారు. జర్మనీలో రికార్డు మొబైల్ షేర్‌ను సాధించారు. T మొబైల్‌లో గోపాలన్ టెక్నాలజీ, కన్స్యూమర్ తో పాటు బిజినెస్ విభాగాలను గోపాలన్ విజయవంతంగా నిర్వహించారు. అలాగే 5G, AI, ఇతర డిజిటల్ మార్పులను కూడా చూసుకున్నారు.

మోల్సన్ కూర్స్ సీఈవోగా రాహుల్ గోయల్‌

హెచ్1బీ వీసాల చార్జీల పెంపు, విదేశీ ఉద్యోగులకు చెక్ పెడుతున్న సమయంలో చికాగోకు చెందిన బెవరేజ్ కంపెనీ మోల్సన్ కూర్స్ 49 ఏళ్ల రాహుల్ గోయల్‌ను సీఈవోగా నియమించింది. అక్టోబర్ 1 నుండి తమ కొత్త ప్రెసిడెంట్,  CEOగా రాయల్ గోయల్‌ను సంస్థ ఎంపిక చేసింది. అతను గెవిన్ హేటర్స్‌లీ స్థానంలోకి వస్తారు. వాస్తవానికి భారతదేశానికి చెందిన రాహుల్ గోయల్ మైసూర్‌లో ఇంజనీరింగ్ చదివారు. ఆ తర్వాత బిజినెస్ ఎడ్యుకేషన్ చదవడానికి డెన్వర్‌కు వెళ్లారు. అతను అమెరికా, బ్రిటన్, భారతదేశంలో కూర్స్, మోల్సన్ బ్రాండ్‌లతో పనిచేశాడు.

తన కొత్త బాధ్యత గురించి రాహుల్ స్పందించారు. తాను కంపెనీ వారసత్వాన్ని కొనసాగిస్తూ సవాళ్లను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. గోపాలన్ లేదా రాహుల్ మాత్రమే కాదు, భారత సంతతికి చెందిన చాలా మంది అమెరికాలోని పలు కంపెనీల్లో సీఈవో, పెద్ద పదవుల్లో కొనసాగుతున్నారు. మైక్రోసాఫ్ట్‌లో సత్య నాదెళ్ల, ఆల్ఫాబెట్‌ కంపెనీలో సుందర్ పిచాయ్. ఇప్పుడు ఫార్చ్యూన్ గ్లోబల్ 500కి చెందిన ఇతర కంపెనీలు కూడా భారతీయులపై ఆసక్తి చూపుతున్నారు.