Great Wall of China: ఏదైనా ప్రాంతానికి వెళ్లాలంటే ఎవరైనా ఏం చేస్తారు? సాధారణంగా అక్కడికి వెళ్లాంటే షార్ట్ కట్ దారులు ఏమైనా ఉన్నాయోమో చూస్తారు. కొన్ని సార్లు పక్కనే ఉన్న ప్రదేశానికి వెళ్లడానికి కూడా చుట్టూ చాలా దూరం ప్రయాణిస్తుంటారు. సిటీల్లో దూరాలను తగ్గించడానికి చాలా మంది షార్ట్‌కట్‌ కోసం డివైడర్లను తవ్వేస్తుంటారు. మరి కొందరు కాలువుల పూడ్చేస్తారు. ఇలాంటి మనం తరచూ చూస్తూనే ఉంటాం. అయితే వెళ్లాల్సిన ప్రదేశానికి 21,196 కిలోమీటర్ల పొడవున్న గోడ ఉంటే ఏం చేస్తారు. 


ఇలాంటి సమస్యే చైనాకు చెందిన ఓ జంటకు ఎదురైంది. తాము వెళ్లాల్సిన ప్రదేశానికి త్వరగా చేరుకోవడానికి ఏకంగా చారిత్రక ‘గ్రేట్‌ వాల్‌’ (Great Wall)నే తవ్వేశారు. ఈ ఘటన చైనా(China)లోని ఉత్తర షాక్సి ప్రావిన్స్‌ యుయు కౌంటీ వద్ద యాంగ్‌కాన్హె టౌన్‌షిప్‌ వద్ద చోటు చేసుకుంది. తొందరగా వెళ్లేందుకు ప్రపంచ వింతల్లో ఒకటిగా నిలిచిన చారిత్రక కట్టడాన్నే అడ్డంగా తవ్వేసింది. తమ వాహనాలు వెళ్లేందుకు కావాల్సినంత వెడల్పుగా గోడను తవ్వేసింది. వివరాలు ఇలా ఉన్నాయి.






యుయు కౌంటీ వద్ద ఉన్న గ్రేట్‌వాల్‌ ఆఫ్‌ చైనా ఉంది. దీనిని 32 గ్రేట్‌వాల్‌ అని పిలుస్తుంటారు. దీనికి సమీపంలో ఓ కన్‌స్ట్రక్షన్‌కు సంబంధించిన కాంట్రాక్టును 38 ఏళ్ల వ్యక్తి, 55 ఏళ్ల మహిళ ఇద్దరు వ్యక్తులు తీసుకున్నారు.  అయితే వారు ఉండే ప్రదేశానికి, కాంట్రాక్ట్‌ తీసుకున్న ప్రదేశానికి మధ్యలో 32 గ్రేట్‌వాల్‌ అడ్డుగా ఉంటుంది. దీంతో కాంట్రాక్ట్ తీసుకున్న వ్యక్తులు చాలా కిలోమీటర్లు చుట్టూ తిరిగి వెళ్లాల్సి వస్తోంది. రోజూ యంత్రాలను, సామగ్రిని తీసుకుని అంత దూరం తిరిగి వెళ్తుంటే బోలెడంత సమయం, డబ్బులు ఖర్చవుతోంది.


దీంతో సమయం, డబ్బు ఆదా చేసుకోవడానికి ఓ ఉపాయం ఆలోచించారు. అడ్డుగా ఉన్న గ్రేట్‌వాల్‌ను కాస్త కూల్చేస్తే సులువుగా కన్‌స్ట్రక్షన్ ప్రాంతానికి వెళ్లొచ్చని అనుకున్నారు. గ్రేట్‌వాల్‌కు ఓ చోట చిన్న సందు వారికి జాక్‌పాట్‌లా కనిపించింది. ఇంకేముంది ఆ సందును కాస్తా తమ వాహనాలు వెళ్లేందుకు కావాల్సినంత వెడల్పుగా తవ్వేశారు. తాము వెళ్లేందుకు ఒక షార్ట్‌కట్‌ను క్రియేట్‌ చేసుకున్నారు. ఇది గమనించిన స్థానికులు ఆగస్టు 24వ తేదీన అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. 


జరిగిన విషయం తెలుసుకుని చైనా అధికారులు ఖంగుతిన్నారు. చైనా సమగ్రతకు, ప్రతిష్టకు ప్రతీకగా నిలిచే చారిత్రాత్మకమైన గోడను కూల్చేయడం చూసి అధికారులు విస్మయానికి గురయ్యారు. కేవలం షార్ట్‌కట్‌గా ఉపయోగపడుతుందని ప్రపంచ ఏడు వింతల్లో ఒకటిగా నిలిచిన కట్టడం కూల్చేయడమేంటని సీరియస్‌ అయ్యారు. నిందితులు సైతం తాము చేసిన తప్పును ఒప్పుకున్నారు. సులువుగా రాకపోకలు సాగించేందుకు ఈ పురాతన గోడను కూల్చినట్లు అంగీకరించారు. నిందితులు ఇద్దరిపై కేసు నమోదు చేసి ఈ ఘటనపై విచారణ జరుపుతున్నారు. 


1987లో యునెస్కో గుర్తింపు
గ్రేట్ వాల్ ఆఫ్ చైనా నిర్మాణం క్రీస్తుపూర్వం 200లోనే ప్రారంభమైనట్లు చరిత్ర చెబుతోంది. కానీ ఇప్పుడున్న కట్టడాన్ని నిర్మించింది మాత్రం మింగ్ వంశీయులే. క్రీస్తుశకం 1368-1644 సమయంలో దీని నిర్మాణం జరిగినట్లు తెలుస్తోంది. ప్రపంచంలోనే అతి పెద్ద సైనిక కట్టడమైన ఈ గోడను యునెస్కో వారు వరల్డ్‌ హెరిటేజ్‌ సైట్‌గా గుర్తించారు. ఈ చారిత్రక కట్టడాన్ని చూసేందుకు నేటికీ ప్రపంచ దేశాల నుంచి టూరిస్టులు ఇక్కడికి తరలివస్తుంటారు. ప్రపంచంలోనే అతి పొడవైన ఈ గోడను 1987లో యునెస్కో వారసత్వ సంపదగా గుర్తించింది.