ఆక్సిజన్‌ అంటే ప్రాణవాయువు అని తెలిసిందే. భూమి మీద జీవరాశి బతుకుతోందంటే ఆక్సిజన్‌ వల్లే. అయితే ఇలాంటి ఆక్సిజన్‌ మూలకంలో కొత్త రకాన్ని కనిపెట్టారు శాస్త్రవేత్తలు. జపాన్‌లోని టోక్యో ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీకి చెందిన అణు భౌతిక శాస్త్రవేత్త యోసుకే కొండో నేతృత్వంలోని అంతర్జాతీయ భౌతిక శాస్త్రవేత్తల బృందం ఈ కొత్త రకం ఆక్సిజన్‌ ఐసోటోప్‌ను గుర్తించింది. ఆక్సిజన్‌-28 అనే కొత్త ఐసోటోప్‌ను కనిపెట్టినట్లు శాస్త్రవేత్తలు ఇటీవల వెల్లడించారు. అణు భౌతిక శాస్త్రంలో ఇది మేజర్‌ డిస్కవరీ అని, అణు ప్రయోగాలపై పరిశోధనలకు ఇది ఉపయోగపడుతుందని తెలిపారు.


ఈ ఆక్సిజన్‌ ఐసోటోప్‌ కేంద్రకంలో ఇప్పటివరకు చూసిన దానికంటే ఎక్కువగా అధికసంఖ్యలో న్యూట్రాన్లను కలిగి ఉంటుంది. ఇందులో 20 న్యూట్రాన్లు, 8 ప్రొటాన్లు ఉన్నట్లు తెలిపారు. ఇప్పటి వరకు అందుబాటులో ఉన్న ఆక్సిజన్‌ రకాల్లో ఈ ఆక్సిజన్‌ పరిమాణంలో పెద్దదిగా చెప్తున్నారు. అయితే ఈ ఆక్సిజన్‌ ఐసోటోప్‌లో ఎక్కువ న్యూట్రాన్లు, తక్కువ ప్రోటాన్ల రేష్యోతో కలిగి ఉండడం వల్ల చాలా అరుదైనదని పేర్కొన్నారు. భవిష్యత్తు న్యూక్లియర్‌ ప్రయోగాలకు, థియేరిటికల్‌ ఇన్వెస్టిగేషన్‌కు ఈ మూలకం బాగా ఉపయోగపడుతుందని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. గతంలో శాస్త్రవేత్తలు ఆక్సిజన్‌-26 ఐసోటోప్‌ అత్యధిక న్యూట్రాన్లు కలిగిన మూలకంగా గుర్తించారు. అందులో 18 న్యూట్రాన్లు, 8 ప్రొటాన్లు ఉంటాయి. కాగా తాజాగా అంతకంటే ఎక్కువ పరిమాణంలో న్యూట్రాన్లు కలిగిన మూలకాన్ని గుర్తించారు.


సాధారణంగా ఆక్సిజన్‌ మూలకం ఆక్సిజన్‌-16 రూపంలో ఉంటుంది. అయితే ఇప్పుడు గుర్తించిన ఆక్సిజన్‌ -28 రకం ఐసోటోప్‌ మ్యాజిక్‌ నంబర్‌గా శాస్త్రవేత్తలు చెప్తున్నారు. 20 న్యూట్రాన్లు, 8 ప్రోటాన్లు రెండూ కూడా మ్యాజిక్‌ ఫిగర్స్‌ అని దీంతో ఈ మూలకాన్ని 'డబులీ మ్యాజిక్‌' అని పేర్కొంటున్నారు. ఇది చాలా స్టేబుల్‌గా ఉంటుందని అంచనా వేస్తున్నారు.