Donald Trump Warns Elon Musk: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్, ప్రపంచ కుబేరుడు ఎలాన్‌ మస్క్‌ మధ్య విబేధాలు తారాస్థాయికి చేరినట్లు తెలుస్తోంది. మే నెలలో తీసుకొచ్చిన రిపబ్లికన్‌ ట్యాక్స్‌ బిల్లును మస్క్‌ వ్యతిరేకించడంతో ట్రంప్‌తో దూరం పెరిగింది. ఒకరిపై ఒకరు తీవ్రస్థాయిలో ఆరోపణలు చేసుకున్నారు. ఈ నేపథ్యంలోనే ట్రంప్​ కీలక వ్యాఖ్యలు చేశారు. 

పర్యవసానాలకు మూల్యం చెల్లించాల్సి ఉంటుందిట్రంప్​ NBC న్యూస్‌ ఛానల్​తో మాట్లాడుతూ.. ఎలన్​ మస్క్​తో సంబంధాలను పునరుద్ధరించుకునే ఆలోచన లేదని వెల్లడించారు. తాను విధించిన పన్ను కోత బిల్లుకు అనుకూలంగా ఓటు వేసిన రిపబ్లికన్లపై పోటీ చేయడానికి డెమొక్రాటిక్ అభ్యర్థులకు నిధులు సమకూర్చాలని నిర్ణయించుకుంటే చాలా తీవ్రమైన పరిణామాలు ఉంటాయని తన మాజీ మిత్రుడిని హెచ్చరించారు. ‘అతను అలా చేస్తే, దాని పర్యవసానాలకు మూల్యం చెల్లించాల్సి ఉంటుంది’ అని ట్రంప్ NBC న్యూస్‌తో అన్నారు.  

మస్క్​తో సంబంధాన్ని పునరుద్ధరించాలని ఆశిస్తున్నారా అని అడిగినప్పుడు ట్రంప్ ‘లేదు’ అని బదులిచ్చారు. ‘నేను వేరే పనుల్లో చాలా బిజీగా ఉన్నాను’ అని పేర్కొన్నారు. ‘నాకు అతడితో మాట్లాడే ఉద్దేశం లేదు’ అని అన్నారు. మస్క్​తో మీ సంబంధం ముగిసిందని భావిస్తున్నారా అని అడిగినప్పుడు ‘అవును, అలాగే అనుకుంటున్నా’ అని సమాధానమిచ్చారు. అధ్యక్షుడి కార్యాలయానికి టెక్ బిలియనీర్ అగౌరవంగా ఉన్నారని ట్రంప్​ ఆరోపించారు. ‘ఇది చాలా చెడ్డ విషయం. అతను చాలా అగౌరవంగా ఉన్నాడు. అధ్యక్షుడి కార్యాలయాన్ని ఆయన  అగౌరవపరచలేరు’ ట్రంప్​ పేర్కొన్నట్లు NBC న్యూస్ నివేదించింది.

అలా మొదలైన మాటల యుద్ధంమస్క్​తో కొనసాగుతున్న వైరం నేపథ్యంలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. ట్రంప్​ తీసుకొచ్చిన ‘వన్‌ బిగ్‌ బ్యూటిఫుల్‌ బిల్‌’తో వివాదం మొదలైంది. టాక్స్‌లు తగ్గిస్తూ, ప్రభుత్వ ఖర్చును పెంచుతూ ట్రంప్‌ ప్రభుత్వం బిల్లు రూపొందించింది. అయితే ఈ బిల్లును ఎలాన్‌ మస్క్‌ వ్యతిరేకించారు. ఆ బిల్లును ‘అసహ్యకరమైన బిల్లు’ అని వ్యాఖ్యానించారు. దీంతో మస్క్‌ తీరును తప్పుబట్టారు ట్రంప్‌. ఈ నేపథ్యంలోనే ఆ ఇద్దరి మధ్య మాటల యుద్ధం మొదలైంది. 

ట్రంప్​పై కీలక వ్యాఖ్యలు చేస్తూ మస్క్ ట్వీట్ల వర్షంతన సహాయం, మద్దతు లేకుండా ట్రంప్ అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలిచేవారు కాదని మస్క్‌ అన్నారు. ట్రంప్‌ను అభిశంసించాలంటూ మస్క్ డిమాండ్‌ చేశారు. బిగ్‌ బాంబ్‌ వేయడానికి సమయం వచ్చిందంటూ Xలో మస్క్‌ పోస్ట్‌ పెట్టారు. పలు అంశాలను ప్రస్తావిస్తూ వరుస పోస్టులు చేశారు. చైల్డ్‌ సెక్స్‌ అఫెండర్‌ జెఫరీ ఎప్‌స్టీన్‌తో ట్రంప్‌కు సంబంధాలు ఉన్నాయంటూ మస్క్‌ ఆరోపించారు. దీంతో మస్క్‌ కంపెనీలకు ప్రభుత్వ కాంట్రాక్ట్‌లు రద్దుచేస్తామని ట్రంప్‌ హెచ్చరించారు. వారి మధ్య గొడవ కారణంగా మస్క్​కు చెందిన టెస్లా షేర్లు ఏకంగా 14 శాతం పడిపోయాయి.

కొత్త పార్టీపై ఫాలోవర్ల అభిప్రాయ సేకరణఈక్రమంలో మస్క్‌ కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు గురించి ప్రస్తావించారు. ‘80 శాతం అమెరికన్లకు ప్రాతినిధ్యం వహించేలా కొత్త పార్టీ స్థాపించడానికి ఇది తగిన సమయమా’ అని ఎక్స్‌లో తన ఫాలోవర్ల అభిప్రాయాన్ని కోరారు.

మస్క్‌కు రష్యా బంపర్‌ ఆఫర్‌ఇదిలా ఉండగా మస్క్‌కు రష్యా బంపర్‌ ఆఫర్‌ ఇచ్చింది. తమ దేశంలో పొలిటికల్‌ అసైలమ్‌లో ఉండేందుకు మస్క్‌కు అవకాశం కల్పిస్తామని పేర్కొంది. రష్యాకు చెందిన స్టేట్‌ డ్యూమా ఫెడరేషన్‌ కమిటీ ఛైర్మన్‌ దిమిత్రి నోవికోవ్‌ ఓ వార్తా సంస్థతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘మస్క్‌ పూర్తిగా భిన్నమైన ఆట ఆడతారని నేను అనుకుంటున్నా. ఆయనకు రాజకీయ శరణార్థిగా ఉండాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఆయన అలా చేయాలనుకుంటే రష్యా సహకరిస్తుంది’ అని పేర్కొన్నారు.