Donald Trump Swearing in ceremony : అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డోనాల్డ్ ట్రంప్ మరో కొన్ని గంటల్లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ క్రమంలో ఆయన పర్యటనల గురించిన వార్తలు వెలువడుతున్నాయి. బీజింగ్‌తో సంబంధాలను మరింత బలోపేతం చేసుకునే ప్రయత్నంలో భాగంగా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ చైనాకు వెళ్లాలనుకుంటున్నారని ప్రచారం నడుస్తోంది. ఈ సందర్భంలోనే భారత పర్యటన గురించి సలహాదారులతో కూడా మాట్లాడినట్లు ఓ మీడియా కథనం తెలిపింది. అంతకుముందు తాను అధికారంలోకి వచ్చాక చైనా దిగుమతులపై సుంకాలు విధిస్తానని ట్రంప్ హెచ్చరికలు జారీ చేసిన సంగతి తెలిసిందే. అందులో భాగంగానే చైనాలో పర్యటించనున్నట్టు సమాచారం.
భారత్ లో ట్రంప్ పర్యటన
భారత్ లోనూ పర్యటించేందుకు ట్రంప్ సన్నాహాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ అంశంపైనే సలహాదారులతో చర్చలు జరిపినట్టు పలు వర్గాలు చెబుతున్నాయి. ఇదిలా ఉండగా మరి కొన్ని నెలల్లో ఆస్ట్రేలియా, జపాన్, యునైటెడ్ స్టేట్స్ నాయకులతో కూడిన క్వాడ్ సమ్మిట్‌కు సమ్మిట్‌కు ఆతిథ్యం ఇవ్వడానికి భారతదేశం సిద్ధంగా ఉంది. ఈ సందర్శన ఏప్రిల్ ప్రారంభంలో లేదా ఈ సంవత్సరం చివరలో జరగవచ్చు. కాగా శ్వేతసౌధంలో జరిగే దేశాధినేతల సమావేశానికి ట్రంప్, భారత ప్రధాని మోదీని ఆహ్వానించే అవకాశముందని భావిస్తున్నారు. ఆ తర్వాతే ట్రంప్ భారత్ లో పర్యటిస్తారని వార్తలు వినిపిస్తున్నా.. దీనిపై అధికారికంగా ఎలాంటి సమాచారమూ లేదు.
అంతకుముందు చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్‌తో ఫోన్ లో మాట్లాడిన ట్రంప్.. ప్రపంచ శాంతి కోసం ఇరు దేశాలు కలిసి పని చేస్తామని చెప్పారు. అయితే ట్రంప్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి జిన్ పింగ్ హాజరు కావడం లేదని చైనా ఇదివరకే తెలిపింది. ఆయనకు బదులుగా చైనా తరపున వైస్ ప్రెసిడెంట్ హాన్ జెంగ్ ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు. ఒక సీనియర్ చైనా అధికారి యూఎస్ అధ్యక్ష ప్రారంభోత్సవానికి హాజరుకావడం ఇదే తొలిసారి. ఇకపోతే భారత్ తరపున విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ప్రాతినిధ్యం వహిస్తారన్న సంగతి తెలిసిందే.
47వ అధ్యక్షుడిగా ట్రంప్ ప్రమాణ స్వీకారం
అమెరికా 47వ అధ్యక్షుడిగా రెండో సారి ట్రంప్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఈ కార్యక్రమం క్యాపిటల్ హిల్ లోని రోటుండా ఇండోర్ ఆవరణలో జరగనుంది. ఈ నేపథ్యంలో ట్రంప్, ఆయన భార్య మెలానియా, కుమారుడు బారన్ లు డల్లాస్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు.
Also Read : Jamili Elections: మోదీ నియంతగా మారేందుకే జమిలి ఎన్నికలు, ప్రజాస్వామ్య పార్టీలు మద్దతివ్వొద్దు: స్టాలిన్