Titanic Submarine Search:
కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్
టైటానిక్‌ని చూసేందుకు వెళ్లి గల్లంతైన టూరిస్ట్ సబ్‌మెరైన్‌ని కనిపెట్టడం సవాలుగా మారింది. మూడు రోజులు గడిచిపోయినా...ఇప్పటికీ ఆచూకీ చిక్కలేదు. సముద్ర గర్భం నుంచి శబ్దాలు వస్తుండడాన్ని గమనించి సోనార్‌లను పంపినా లాభం లేకుండా పోయింది. పలు దేశాలకు చెందిన రెస్క్యూ టీమ్‌లు రంగంలోకి దిగి ఆ సబ్‌మెరైన్‌ని కనిపెట్టేందుకు కష్టపడుతున్నారు. అసలైన ఛాలెంజ్ ఏంటంటే...ఇప్పుడా సబ్‌మెరైన్‌లో కేవలం 4 గంటలకు సరిపడ ఆక్సిజన్ మాత్రమే అందుబాటులో ఉంది. ఆ లోగా కనిపెట్టకపోతే అందులో ఉన్న ఐదుగురు ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయే ప్రమాదముంది. యూఎస్ కోస్ట్‌గార్డ్‌తో పాటు కెనడా మిలిటరీ ప్లేన్స్, ఫ్రెంచ్ వెజెల్స్, రోబోలు ఈ రెస్క్యూ ఆపరేషన్‌లో పాల్గొంటున్నాయి. ప్రస్తుతానికి ఇది మల్టీ నేషనల్ ఆపరేషన్‌లా మారిపోయింది. యూఎస్ కోస్ట్ గార్డ్ వెల్లడించిన వివరాల ప్రకారం...సబ్‌మెరైన్‌లో ఆక్సిజన్ లెవెల్స్ 4 గంటలకు సరిపడా మాత్రమే ఉన్నాయి. Oceangate తయారు చేసిన ఈ సబ్‌మెరైన్ ఎమర్జెన్సీ సమయాల్లో దాదాపు 96 గంటల పాటు ఆక్సిజన్ సప్లై చేస్తాయి. ఇప్పుడా టైమ్ కరిగిపోతోంది. రేషన్ కూడా తక్కువగానే ఉంటుంది. ఇందులో ఉన్న ఐదుగురిలో ఇద్దరు ప్రముఖులే. బ్రిటీష్ బిలియనీర్ హమీష్ హర్దింగ్‌తో పాటు పాకిస్థానీ బడా వ్యాపారి షాహ్‌జాదా దావూద్‌తో పాటు ఆయన కొడుకు కూడా ఉన్నారు. ఇప్పటికే సోనార్‌లు సముద్రంలోకి వెళ్లి ఆచూకీ కనిపెట్టేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఓ చోట నుంచి భారీ శబ్దాలు వచ్చినట్టు గుర్తించారు. శబ్దాలు రావడం వల్ల ప్రయాణికులంతా బతికే ఉన్నారని నిర్ధరించుకున్నారు. అయితే...ఆ శబ్దాలు వచ్చిన చోట మరింత నిఘా పెట్టి వెతుకుతున్నారు. అయినా జాడ కనిపించడం లేదు.