అట్లాంటిక్ మహా సముద్ర గర్భంలో గల్లంతైన టైటాన్ అనే మినీ సబ్ మెరైన్ ఆచూకీ దొరికినట్లుగా భావిస్తున్నారు. టైటాన్‌ను వెతకడానికి పంపిన రిమోట్ ఆపరేటెడ్ వెహికల్ (RoV) టైటాన్ శకలాలను గుర్తించినట్లుగా అమెరికా కోస్ట్ గార్డ్ అఫీషియల్ ట్వీట్ చేసింది. టైటానిక్ షిప్ పక్కనే శిథిలాలు కనుగొన్నామని పేర్కొంది. అయితే, ఆ శకలాలు సరిగ్గా టైటాన్ వేనా అనేవి నిర్ధారించలేదు. కేవలం గల్లంతైన టైటాన్ సబ్ మెరైన్ కి చెందివని అనుమానిస్తున్నారు. రిమోట్ ఆపరేటెడ్ వెహికిల్ పంపిన సమాచారాన్ని ఈ విచారణలో పాల్గొన్న బృందం విశ్లేషిస్తోంది. ఈ శిథిలాల గురించి మరింత సమాచారం విశ్లేషించి అమెరికా కోస్ట్ గార్డ్ త్వరలోనే అధికారిక ప్రకటన చేయనుంది.
సముద్రగర్భంలో మునిగిపోయిన టైటానిక్ ఓడని చూసేందుకు వెళ్లి గల్లంతైన టూరిస్ట్ సబ్‌మెరైన్‌ని కనిపెట్టడం సవాలుగా మారిన సంగతి తెలిసిందే. మూడు రోజులు గడిచిపోయినా ఇప్పటికీ ఆచూకీ చిక్కలేదు. సముద్ర గర్భం నుంచి శబ్దాలు వస్తుండడాన్ని గమనించి సోనార్‌లను పంపినా లాభం లేకుండా పోయింది. పలు దేశాలకు చెందిన రెస్క్యూ టీమ్‌లు రంగంలోకి దిగి ఆ సబ్‌మెరైన్‌ని కనిపెట్టేందుకు కష్టపడుతున్నాయి. అసలైన ఛాలెంజ్ ఏంటంటే, ఆ సబ్‌మెరైన్‌లో కేవలం 4 గంటలకు సరిపడ ఆక్సిజన్ మాత్రమే అందుబాటులో ఉందని గురువారం సాయంత్రం (జూన్ 22) కథనాలు వచ్చాయి. యూఎస్ కోస్ట్‌గార్డ్‌తో పాటు కెనడా మిలిటరీ ప్లేన్స్, ఫ్రెంచ్ వెజెల్స్, రోబోలు ఈ రెస్క్యూ ఆపరేషన్‌లో పాల్గొంటున్నాయి.