Modi US Visit:


 
ఇదే తొలిసారి..


ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కలిసి ప్రెస్‌మీట్‌లో పాల్గొననున్నారు. జర్నలిస్ట్‌లు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పనున్నారు. ప్రధాని మోదీ అమెరికాలో ప్రెస్‌మీట్‌లో పాల్గొనడం ఇదే తొలిసారి. వైట్‌హౌజ్ ఇందుకు సంబంధించి కీలక ప్రకటన చేసింది. నేషనల్ సెక్యూరిటీ ప్రతినిధి జాన్ కిర్బీ స్పందించారు. ప్రధాని మోదీ ప్రెస్‌మీట్‌లో పాల్గొనడం చాలా గొప్ప విషయం అని అన్నారు. 


"అమెరికా పర్యటన ముగిసే ముందు ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షుడు జో బైడెన్‌తో కలిసి ప్రెస్‌మీట్‌లో పాల్గొంటుండటం చాలా గొప్ప విషయం. మా దేశానికి ఇది చాలా కీలకం అని భావిస్తున్నాం. మోదీ కూడా ఇలాగే భావిస్తున్నారని అనుకుంటున్నాం"


- జాన్‌ కిర్బీ, యూఎస్ నేషనల్ సెక్యూరిటీ ప్రతినిధి


లిమిటెడ్ క్వశ్చన్స్..


వైట్‌హౌజ్‌లో ప్రెస్‌మీట్ అంటే చాలా భద్రత ఉంటుంది. అందులోనూ ఇద్దరు దేశాధినేతలు ఒకే వేదికపైకి రావడం వల్ల సెక్యూరిటీని మరింత పెంచారు. అమెరికాతో పాటు విదేశాలకు చెందిన మీడియా కూడా మోదీ, బైడెన్‌ని ప్రశ్నించనున్నాయి. అయితే...రిపోర్టర్‌లు ఎవరైనా లిమిటెడ్‌గా ప్రశ్నలు వేయాలని ముందుగానే వైట్‌హౌజ్ అధికారులు కండీషన్ పెట్టారు. 


అమెరికా అధ్యక్షుడి ఆహ్వానంతో వైట్ హౌస్ లోకి ప్రవేశించిన ప్రధాని మోదీ.. అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్‌కు అద్భుతమైన గిఫ్ట్ ఇచ్చారు. మొత్తం భారతీయ సంప్రదాయాన్ని ప్రతిబింబించేలా అన్ని రాష్ట్రాల సంస్కృతిని కళ్లకు కట్టేలా ఓ విలువైన గంధపుచెక్క పెట్టెను మోదీ అమెరికా అధ్యక్షుడికి బహుకరించారు. రాజస్థాన్ లో నైపుణ్యం కలిగిన నగిషీలు చెక్కే కళాకారులతో తీర్చిదిద్దిన ఈ గంధపు చెక్కెపెట్టెలో ఎన్నో ప్రత్యేకతలున్నాయి. ఈ బాక్సులో 'సహస్ర చంద్ర దర్శనం' అని రాసి ఉంచిన కార్డును కూడా ఉంచారు. ఈ గంధపు చెక్కను కర్ణాటకలోని మైసూరు నుంచి తెప్పించారు. ఈ పెట్టెలో ఓ వినాయకుడి చిన్నివిగ్రహాన్ని ఉంచారు. వినాయకుడు సర్వ విఘ్నాలను తొలగిస్తాడని భారతీయుల నమ్మకమని మోదీ అమెరికా అధ్యక్షుడికి వివరించారు. ఈ విగ్రహాన్ని కోల్ కతాకు చెందిన స్వర్ణకారులు తయారు చేశారు. ఈ పెట్టెలో ఓ దీపపు కుందెను ఉంచారు. హిందూ సంప్రదాయాల్లో దీపానికి ప్రత్యేక స్థానం ఉంది. వెండితో తయారు చేసిన ఈ దీపపు కుందెను కూడా బెంగాల్ లోనే తయారు చేయించారు.