Thailand legalises growing cannabis : గంజాయి ఎక్కడ కనిపించిన మన దగ్గర అయితే పోలీసులు కొట్టిన చోట కొట్టకుండా కొట్టి తీసుకెళ్లి లోపలేస్తారు. అదే గంజాయి పంట పండిస్తే తాట తీస్తారు. ఎందుకంటే గంజాయి అంతహానికరం మరి. కానీ విచిత్రంగా కొన్ని దేశాలకు ఈ గంజాయి పంట.. మామూలు పంటలాగానే అనిపిస్తోంది. వాటిని నిరభ్యంతరంగా పండించుకోవచ్చని చెబుున్నాయి. అలాంటి దేశాల జాబితాలో ధాయ్‌లాండ్ కూడా చేరింది. 


వైద్య అవసరాల కోసం గంజాయిపై నిషేధం ఎత్తివేత


పర్యాటక దేశంగా ధాయ్ లాండ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ దేశం గంజాయి సాగును, వినియోగాన్ని చట్టబద్ధం చేస్తున్నట్లు శుక్రవారం ప్రకటించింది. దీంతో గంజాయిని చట్టబద్ధం చేసిన తొలి ఆసియా దేశంగా థాయ్ లాండ్‌  నిలిచింది. గంజాయి మొక్కలు, పువ్వులను నార్కోటిక్‌ డ్రగ్స్‌ కేటగిరీ నుంచి తొలగిస్తున్నట్లు థాయ్ లాండ్‌  ఫుడ్‌ అండ్‌ డ్రగ్‌ అడ్మినిస్ట్రేషన్‌ వెల్లడించింది. వైద్య, పరిశ్రమ అవసరాల కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు  పేర్కొంది.  


దేశానికి ఆదాయం.. రైతుకు లాభం కూడానట !


అంతేకాకుండా శుక్రవారం నుండి 10 లక్షల గంజాయి మొక్కలను ప్రభుత్వమే పంపిణీ చేయనున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే ఈ నేరాల కింద శిక్ష అనుభవిస్తున్న సుమారు 4 వేల మందిని విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. వైద్య అవసరాల కోసం మాత్రమే గంజాయి సాగును తాము ప్రోత్సహిస్తున్నామని థాయ్ లాండ్‌  ఆరోగ్య మంత్రి ప్రకటించారు. అంతేగాక, దీని సాగుతో దేశానికి పెద్ద మొత్తంలో ఆదాయం రావడంతో పాటు చిన్న రైతులకు ఉపాధి లభిస్తుందన్నారు. 


బహిరంగ ప్రదేశాల్లో గంజాయి తాగడం మాత్రం నేరం !


బహిరంగ ప్రదేశాల్లో గంజాయి తాగడం, ఎక్కువ మొత్తంలో వినియోగించడంపై మాత్రం నిషేధం కొనసాగుతుందని స్పష్టం చేసింది.   సరదా కోసం గంజాయిని వినియోగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం చెబుతోంది.  బహిరంగ ప్రదేశాల్లో గంజాయి తాగితే 3 నెలల జైలు శిక్షతో పాటు 780 డాలర్ల జరిమానా విధించనున్నట్లు తెలిపారు.  ఆహార పదార్థాల్లో 0.2 శాతం కంటే ఎక్కువ మొత్తంలో గంజాయి ఉండటం కూడా చట్టవిరుద్ధమని పేర్కొన్నారు.  


ధాయ్ ల్యాండ్ ప్రభుత్వం ఏ ఉద్దేశంతో ఈ చట్టం చేసిందో కానీ.. ఇప్పుడు ధాయ్ వెళ్లే పర్యాటకులు చాటుమాటుగా కాకుండా యథేచ్చగా గంజాయి సేవరించొచ్చన్నమాట. అక్కడి ప్రభుత్వం దూకుడు చూస్తూంటే.. త్వరలో గంజాయి రైతులకు రైతు భరోసా, రైతు బంధు లాంటి పథకాలు పెట్టినా ఆశ్చర్యపోనక్కరలేదన్న సెటైర్లు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి.